రావెల.. తప్పుకో
* ఎక్కడేం జరిగినా వైఎస్ జగనే బాధ్యుడా?
* వైఎస్సార్‌సీపీ ఎల్పీ ఉపనేత ఉప్పులేటి కల్పన మండిపాటు
సాక్షి, హైదరాబాద్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అరెస్టయిన కుమారుడు సుశీల్‌ను వెనకేసుకొస్తున్న ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, లేదా ఏపీ సీఎం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కుమారుడు తప్పు చేస్తే దాని వెనుక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హస్తం ఉందని మంత్రి ఆరోపించడమేమిటన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక జగన్ హస్తం ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కుమారుడు మహిళను వేధించి కేసులో ఇరుక్కున్నా జగన్‌కే ఆపాదిస్తారా? కాపు సభలో గొడవ జరిగితే దాని వెనుక కూడా జగన్ హస్తమే ఉందా? కాకి అరిచినా దానికీ జగనే బాధ్యుడా? ఇదంతా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఉందని ధ్వజమెత్తారు. బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు కారు రేసింగ్ చేస్తూ ఓ విద్యార్థి మరణానికి కారకుడైతే దాని వెనుకా జగనే ఉన్నాడని నిందించారన్నారు. బాబు పాలనలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఆయనతోపాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా అని చంద్రబాబు తనకు మహిళలపై ఉన్న చిన్న చూపును చాటుకున్నారని చెప్పారు.
మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలి
ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే, రిషితేశ్వరి మరణానికి కారకుడైన అగ్రకుల ప్రిన్సిపాల్ బాబూరావును చంద్రబాబు వెనకేసుకొచ్చారని కల్పన మండిపడ్డారు. ఏలూరులో ఇందుమతి అనే యువతిని దహనం చేశారని, ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. మహిళలను వేధించిన వారిపట్ల పోలీసులు మెతకవైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారపక్షం చెప్పినట్లు వ్యవహరిస్తూ నిందితులను పట్టించుకోవడం లేదన్నారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అమ్మాయిలు వెంటపడితే కడుపు చేయాలంటూ పచ్చిగా మాట్లాడిన సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు గర్హనీయమని ఉప్పులేటి ధ్వజమెత్తారు. మహిళలంతా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.