టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం
కమలాపురం : వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, దుర్మార్గాలను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
కమలాపురం నియోజకవర్గంలో నీచ సంస్కృతి కొనసాగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని, బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. టీడీపీ నాయకుల దుర్మార్గాలను, దౌర్జన్యాలను ప్రజలు ఆదరించరని, ఇలాంటి చర్యలు ఎక్కువ కాలం మనుగడ సాధించవన్నారు. బాధితులకు అండగా తాము ఉంటామని, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. టీడీపీ అధినాయకుడు కోడికత్తితో జగన్ మోహన్‌రెడ్డితో హతమార్చడానికి ప్రయత్నించాడన్నారు. తాము రౌడీయిజాన్నిఎంకరేజ్ చేయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్యాక్షనిజాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ జగన్ సీఎం కాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ప్రతి ఏకరాకు సాగు నీరు అందిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి
రాష్ట్రంలో చింతమనేని ప్రభాకరే కాకుండా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఆగడాలు రోజు రోజుకు మితి మీరుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంంద్రనాథ్ రెడ్డి అన్నారు. బెదిరిస్తే ఓట్లు పడవని, ఆ కాలాలు పోయాయని, ఇప్పటికి మూడు సార్లు ఓడిపోయావు, ఇంకెన్ని సార్లు ఓడి పోతావని టీడీపీ నాయకుడిని ప్రశ్నించారు. వీరందరికి చంద్రబాబు ఆదర్శం అని, ఇది ప్రజాస్వామ్యమా? రాజరిక పాలన అని అన్నారు. మూడు నెలల్లో టీడీపీ నాయకులందరికి శంకరగిరి మాన్యాలే గతి అని ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అపుడు అధికారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది ఉండదని, తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటానని హామి ఇచ్చారు.
బెదిరింపులకు భయపడేది లేదు
ఎన్నికల సీజన్లో ఒడిదుడుకులు సహజమే. అయితే టీడీపీ నాయకులు చేసే బెదిరింపులకు భయపడేది లేదని నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తెలిపారు. 30ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నామన్నారు. దేనికైనా తాము అండగా ఉంటామని, కేవలం 3 మాసాలు ఆగాలని, పదేళ్ల నుంచి పడుతున్న కష్టాలను మరిచి పోయేలా చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసిన టీడీపీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నారు. జిల్లా రైతు కన్వీనర్ సంబటూరు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కమలాపురం మండలంలోని అనేక మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు.
చివరకు మోటార్లు, స్టాటర్టు సైతం ధ్వంసం చేసారని గుర్తు చేశారు. కడప నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నిత్యా నందరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్షన్‌కు కాలం చెల్లిందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కిశోర్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అనంతరం తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి, ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి లకు వినతి పత్రాలు అందించారు. మరోసారి దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండలాల కన్వీనర్లు, ఉత్తమారెడ్డి, రఘనాథరెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి, బాలమల్లారెడ్డి, మాచునూరు చంద్రారెడ్డి, ఆరు మండలాల కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.