సమైక్యాంధ్ర ద్రోహులను చొక్కా పట్టుకుని నిలదీయండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ద్రోహులను చొక్కా పట్టుకుని నిలదీయండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేమని గుర్తించిన ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నడం రాష్ట్ర విభజనకు దారితీసిందని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు చేతులెత్తేసి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ కోరిన విధంగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి వుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియాగాంధీ ఓట్లు, సీట్ల రాజకీయం చేసి తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర పన్నిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చంద్రబాబు వత్తాసు పలికి సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన విజయవాడ ఎంపీ లడగపాటి రాజగోపాల్ కూడా చివరకు చేత్తులెత్తేశారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర ద్రోహులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ర్టంలో సువర్ణయుగం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరదృష్టి గల నాయకుడని, అందుకే ఆయన హయాంలో సువర్ణయుగం సాగిందన్నారు. చంద్రబాబు హయాంలో వరుస కరువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మడకశిరలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం తథ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైఎస్సార్ రుణాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి మంత్రి రఘువీరారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.