రాష్ట్రాన్ని కాపాడుకుందాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యశంఖారావం సభ సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించారు. పార్టీ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్లైన్ః
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని తేరుబజార్‌లో సమైక్య శంఖారావం సభ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం వెలువడిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు సీమాంధ్రకు ఆదర్శంగా నిలిచారన్నారు. 135 రోజులుగా అన్ని వర్గాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడం అభినందనీయమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెడుతూ ఉద్యమాన్ని నీరుగార్చారన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్ర తీర్మానానికి ముందుకు వస్తారని సూచించారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రగా పనిచేసి వేలాది కోట్లను దండుకున్న చంద్రబాబునాయుడు సీబీఐ దర్యాప్తు జరగకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని విమర్శించా రు. కేసులుకు భయపడే రాష్ట్రాన్ని గాలికివదిలేశారన్నారు.
పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మాట తప్పక.. మడమ తిప్పక రాష్ట్రం కోసం పోరాడుతున్న తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోతే ఒక్క రాజధానిలోనే ఆరు లక్షల ఉద్యోగాలను సీమాంధ్రులు కోల్పోతారని, జలవివాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం మొట్టమొదట రాజీనామాలు సమర్పించి, నేటికీ సమైక్య తీర్మానం కోసం పట్టుపడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌నే అన్నారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దశాబ్దాలుగా డీలాపడిపోయిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకొస్తే, అదే పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుండటం విచారకరమన్నారు. విభజన ప్రక్రియను ఆపాలని తమ అధినేత దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా చర్చజరిగేలా ప్రయత్నాలు చేపట్టి విజయవంతమైయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ మహిళ, చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుకమ్మను ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బీఆర్.బసిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చెర్మైన్ రమాకాంత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్, మైనార్టీ నాయకులు హాజీ నద్దిముల్లా, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లింగమూర్తిలు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠప్ప, మాచాని నాగరాజు, నందవరం సంపత్‌కుమార్‌గౌడ్, లక్ష్మికాంత్‌రెడ్డి, నసిరుద్దీన్, కాశీవిశ్వనాథ్‌రెడ్డి, గోవిందు, భీమిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ధర్మకారి నాగేశ్వరరావు, ఇంజనీర్ రాజన్న, సునీల్‌కుమార్, రియాజ్‌అహ్మద్, రాజారత్నం పాల్గొన్నారు.
బడుగు మహిళను.. మీ ఆడపడుచును
బడుగు మహిళను.. మీ ఆడపడుచును.. ఆదరించండి.. జగనన్న ఆశయాల్లో నన్ను పాలుపంచుకోనివ్వండి’ అంటూ వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక సభలో ప్రసంగించడం పలువురిని ఆకట్టుకుంది. చేనేత వర్గానికి చెందిన ఓ మహిళను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళాసాధికారితకు పెద్దపీట వేశారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం పాటుపడుతానని ఆమె పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ చేనేతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, జననేత కూడా చేనేతల అభివృద్ధికి శ్రమిస్తారన్నారు.