శ్రీసిటీకి మరిన్ని జపాన్ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీపై మరిన్ని జపాన్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన 15 కంపెనీలు ఈ సెజ్‌లో అడుగు పెట్టాయి. తయారీ రంగాల్లో ఉన్న కంపెనీలు ఇక్కడ ప్లాంటు పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఇంజనీరింగ్ సంస్థలు రానున్నాయని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. శ్రీసిటీలో భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 116 కంపెనీలు చేతులు కలిపాయి.
ఇందులో 55కిపైగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ ఏడాది మరో 20-25 కంపెనీలు వీటికి జతకూడనున్నాయని ఆయన చెప్పారు. కాగా, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీకి చెందిన దక్షిణాసియా విభాగం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కట్సువో మట్సుమోటో బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్రతోనూ ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. రానున్న రోజుల్లో శ్రీసిటీ నుంచి మరింత వ్యాపారం ఆశిస్తున్నట్టు మట్సుమోటో చెప్పారు.