ఏడాదిలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు
రెండు కంపెనీలను కొంటాం
రే బిజ్టెక్ సీఈవో చైత్ మదునూరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసుల్లో ఉన్న రే బిజినెస్ టెక్నాలజీస్ (రే బిజ్టెక్) ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, తయారీ, రిటైల్, మీడియా, ట్రావెల్ తదితర రంగ కంపెనీలకు సేవలందిస్తున్న ఈ సంస్థ 2009లో అయిదుగురితో ప్రారంభమైందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో 215 మంది, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే కార్యాలయాల్లో 25 మంది ఉద్యోగులున్నారని రే బిజ్టెక్ సీఈవో చైత్ మదునూరి తెలిపారు. సిబ్బంది సంఖ్యను ఏడాదిలో ి500కు, 2018 కల్లా 2,000కు పెంచుకోనున్నామని చెప్పారు. సీఎంఎంఐ లెవెల్ 3 ధ్రువీ కరణ వచ్చిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సంస్థ సామర్థ్యానికి ఈ ధ్రువీకరణ నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ ధ్రువీకరణ రాకతో విదేశాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మార్గం సుగమం అయిందని ఎండీ అజయ్ రే అన్నారు. యూఎస్‌కు చెందిన రెండు కంపెనీలను ఏడాదిలో కొనుగోలు చేస్తామని చైత్ వెల్లడించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్‌డేటా విభాగాల్లోకి ప్రవేశిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సొంత కార్యాలయం ఏర్పాటుకు స్థలం సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని, రూ.13 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తామని సీవోవో అజయ్ గుప్త తెలిపారు.