‘సీమ’కే నష్టం
వేర్పాటువాదంపై రాయచోటి వాసులు గర్జించారు. సమైక్యవాదానికి మద్దతుగా రణభేరి మోగించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది జనం ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా సమైక్యగర్జన చేశారు.
మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినకూలీలు ఒక్కరేంటి అన్ని వర్గాల వారు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రణభేరితో సమైక్య ఉద్యమానికి కొత్త ఊపిరి వచ్చింది. సమైక్య గళానికి బలం చేకూరింది.
సాక్షి, కడప/రాయచోటి, న్యూస్‌లైన్ : విభజన జరిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే రాయలసీమకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. గురువారం రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ‘రాయచోటి రణభేరి’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్‌బాబు సీమ కరువు పరిస్థితులు, విభజన వల్ల వాటిల్లే నష్టంపై ప్రసంగించారు. సమైక్యరాష్ట్రంలోనే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రాయలసీమలో ఏర్పడే కరువు పరిస్థితులు అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటికీ సీమకు సరైన సాగునీటి వనరులు లేవన్నారు. ఇప్పటికే కృష్ణాజలాల కోసం కర్నాటకతో జగడం జరగుతోందన్నారు.
ఈ పరిస్థితుల్లో విభజన జరిగితే మిగులు జలాలపై ఆధారపడిన హంద్రీ-నీవా, గాలేరు-నగరితో పాటు తెలుగుగంగ, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావడం కష్టమవుతుందన్నారు. ఇదే జరిగితే రాయలసీమలోని రైతులు భూములను అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. చివరకు తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరకన్నారు. ఇప్పటి వరకూ ‘సీమ’కు జరిగిన అన్యాయానికి వెలకట్టలేమని, విడగొడితే మరింత అన్యాయానికి గురవుతారన్నారు.
విభజిస్తే సీమ ఎడారే
విభజనతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులై కేంద్రం చేతుల్లోకి వెళతాయని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఇదే జరిగితే మిగులు జలాల ప్రాజెక్టులకు చుక్కనీరందదన్నారు. ఈ జాబితాలో రాయచోటి నియోజకవర్గానికి సాగునీరందించే హంద్రీ-నీవా కూడా ఉందన్నారు. ఈ సమస్యను ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోవచ్చని కేంద్రం చెబుతోందని, అయితే ఇప్పటికే అన్ని ప్రాజెక్టులకు కేటాయింపులు అయిపోయాయన్నారు. కొత్తగా అదనపు కేటాయింపులు ఉండవని, ఈక్రమంలో తమిళనాడు, కర్నాటక మధ్య తలెత్తిన ‘కావేరి’జలాల తరహాలో తెలంగాణ, సీమాంధ్ర, కర్నాటక కొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. ముందు సీమకు నీరిచ్చే మార్గాలు వెతికి సాగునీటి సమస్య తీర్చాలన్నారు. లేదంటే సీమ శాశ్వత ఎడారి కాకతప్పదన్నారు.