rayal telangana
-
రాయల తెలంగాణపై సోనియాతో ఆజాద్ చర్చలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుండగా, మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర వ్యవహరాల మాజీ ఇంచార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం భేటి అయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై సోనియాతో ఆజాద్ చర్చించినట్టు సమాచారం. ఇదే విషయంపై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాయలసీమకు చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అంతకుముందు సోనియాతో సమావేశమైన కేంద్రమంత్రి చిరంజీవి రాయల తెలంగాణ గురించి మాట్లాడుతూ.. ఈ అంశంతో తనకు సంబంధంలేదన్నారు. ఇది రాయలసీమ నేతల ఇష్టమని చిరంజీవి చెప్పారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు కూడా రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. -
రాయల తెలంగాణ కోసం సోనియాను కలుస్తాం: దివాకర్ రెడ్డి
రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, దివాకర్ రెడ్డి అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చించారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం వల్ల న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, అనంతపురం, కర్నూలు జిల్లాలకే చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుండగా, మరికొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారు. -
రాయల తెలంగాణకు ఆమోదం లేదుః శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్ : రాయల తెలంగాణకు ప్రజామోదం లేదని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. ఎవరో కొంతమంది నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారే తప్ప సీమాంధ్రలో 99 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే ప్రతిపాదనను అంగీకరించేది లేదని, విభజనపై కేంద్ర ప్రభుత్వ కమిటీ ఏర్పడినా...ఆంటోని కమిటీయే కొనసాగినా తమ వైఖరిలో మాత్రం మార్పు ఉండబోదని ఉద్ఘాటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిజంగా విభజనను వ్యతిరేకిస్తున్నట్లయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని టీడీపీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. తెలుగు జాతి ఐక్యతకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడినందున ఇప్పటికైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానేసి విపక్ష పార్టీలు విభజనను వ్యతిరేకించాలని సూచించారు. విభజన పాపం కిరణ్, బొత్సలదేనంటూ కిషోర్ చంద్రదేవ్ చేసిన విమర్శలను శైలజానాథ్ తోసిపుచ్చారు.