RBI Governor Rajan
-
అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్థమే
ముంబై: ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్థాలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీ కూడా అసమానతలకు కారణంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఓవైపు ఆటోమేషన్ మూలంగా కొన్ని ఉద్యోగాల్లో కోత పడుతుండగా, మరోవైపు ఏదైనా ఎక్కడైనా ఉత్పత్తిచేయడం సాధ్యపడుతుండటంతో అప్పటిదాకా వాటి తయారీపైనే ఆధారపడిన సామాజిక వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ‘ఆయా వర్గాలు తమ ఆర్థిక ఆసరాను కోల్పోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. కొన్నిసార్లు జనాకర్షక కార్య క్రమాలతో రాజకీయనాయకులు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా సామాజిక అసమానతల పరిష్కారానికి విరుగుడుగా జనాకర్షక విధానాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటం పెట్టుబడిదారీ వ్యవస్థకు ముప్పుగా పరిణమించనుంది’ అని పేర్కొన్నారు. దేశ సమైక్యత, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, సామాజిక.. ఆర్థిక అభివృద్ధి అంశాల్లో అందించిన సేవలకు గాను యశ్వంత్రావ్ చవాన్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వీడియో లింక్ ద్వారా రాజన్ ఈ విషయాలు పేర్కొన్నారు. ఆయా వర్గాల సమస్యల పరిష్కారం ద్వారా అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నం చేయొచ్చన్నారు. వెనకబడిన వర్గాలు టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు చేపట్టే చర్యలపై దృష్టి సారించాలన్నారు. -
మందగమనం వల్లే మొండి బకాయిల సెగ
పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ రాజన్ వివరణ... న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్పీఏ) ఘోరంగా పెరిగిపోవడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనమే ప్రధాన కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి ఇచ్చిన వివరణ నివేదికలో ఎన్పీఏలు ఎగబాకడానికి గల కారణాలను వివరించారు. పీఏసీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేవీ థామస్ పదవీకాలం ముగియడంతో కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వివరణను పరిశీలించేందుకు రాజన్‌ను హాజరుకావాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల చీఫ్‌లను కూడా పిలిపించి వాటి మొండిబకాయిల వివరాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆరు కారణాలు... డిసెంబర్ చివరినాటికి పీఎస్‌బీల ఎన్పీఏలు రూ.3.61 లక్షల కోట్లకు ఎగియడంతో స్వచ్చంధంగా(సుమోటో) ఈ అంశాన్ని పీఏసీ పరిశీలిస్తోంది. పీఎస్బీలకు డిసెంబర్ ఆఖరికల్లా రూ.100 కోట్లకు మించి బాకాయిపడ్డ ఖాతాలు 701 వరకూ ఉండగా.. మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లుగా అంచనా. ‘చాలా ఎన్పీఏలకు సంబంధించి గతం లో రుణాన్ని మంజూరు చేసిన అధికారులే మళ్లీ వాటిని రికవరీ చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని పీఏసీ తన పరిశీలనలో గుర్తించింది. దీన్నిబట్టి చూస్తే.. రికవరీకి తగిన యంత్రాంగం లేదని తేలుతోంది’ అని పీఏసీలోని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఎన్పీఏలు 2.2% ఉండగా.. పీఎస్బీలకు సంబంధించి 5.98%కి పెరిగిపోవడమేంటని పీఏసీ రాజన్‌ను ప్రశ్నించింది. దీనికి 6 కీలక అంశాలను ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావించారు. దేశీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం ప్రధాన కారణమని చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతుల జాప్యం, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎడాపెడా రుణాలు తీసుకున్న కార్పొరేట్లు పరిస్థితులు బాగోలేకపోవడంతో చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా క్రెడిట్ రిస్కులు, ప్రాజెక్టులకు సంబంధించి సరైన మదింపు లేకపోవడం కూడా ఎన్పీఏలను ఎగదోస్తోందన్నారు. కొన్ని కేసుల్లో రుణాల మంజూరులో అవినీతి, మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలూ ఎన్పీఏలను పెంచుతున్నాయని రాజన్ వివరించారు. -
ఇదండీ... రాజన్ ‘దోశ’ కథ
వడ్డీరేట్లు తగ్గుతుండటంపై పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ఆర్బీఐ గవర్నరు రాజన్‌కు లేఖలు కూడా రాశారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక సమావేశంలో ఆయనే స్వయంగా చెప్పారు. ‘ఈ మధ్య నాకు పెన్షనర్ల నుంచి అనేక లేఖలొస్తున్నాయి. చాలామంది తమకు ఏడాది కిందట 10 శాతం వడ్డీ వచ్చేదని, ఇప్పుడు 8 శాతం కూడా రావడం లేదని పేర్కొన్నారు. తమ అవసరాలు తీరాలంటే వడ్డీ రేట్లు తగ్గించకూడదని కోరుతున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే... వడ్డీ రేట్లు తగ్గుతున్నా పెన్షనర్లకి గతంలో కన్నా డబ్బులు ఎక్కువే మిగులుతున్నాయని. అదెలాగని మీరు అడగొచ్చు. మీ అందరికీ అర్థమయ్యేటట్లు ‘దోశ’లతో చెపుతా. ఉదాహరణకు దోశ ఖరీదు రూ.50 అనుకుందాం. మీరు దాచుకున్న లక్ష రూపాయలతో సుమారు 2,000 దోశెలు కొనుక్కోవచ్చు. కానీ ఈ పెన్షనర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా అదనపు మొత్తం కావాలనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే... వడ్డీరేటు 10% ఉందనుకుంటే ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయల మీద వడ్డీ రూపంలో అదనంగా రూ. 10,000 వస్తాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం 10% వల్ల దోశె రేటు కూడా రూ.55 అయ్యింది. అంటే ఈ వడ్డీతో అదనంగా 182 దోశెలు వస్తాయి. ద్రవ్యోల్బణం తగ్గితే.. వడ్డీరేటు 8 శాతం, ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉందనుకుందాం. అప్పుడు మీకు వడ్డీ కింద రూ. 8,000 వస్తుంది. ఇదే సమయంలో దోశె ఖరీదు రూ. 52.75 అవుతుంది. అప్పుడు ఈ వడ్డీతో మీకు 152 దోశలే వస్తాయి. ఈ లెక్కన చూసినపుడు... వడ్డీరేటు తగ్గగానే దోశలు తగ్గిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇక్కడ వడ్డీని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. అసలు లక్ష రూపాయల విలువను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 10 శాతం ద్రవ్యోల్బణం ఉంటే లక్ష రూపాయలకు వచ్చే దోశలు 1,818 మాత్రమే. అదే ద్రవ్యోల్బణం 5.5 శాతానికి తగ్గితే 1,896 దోశలు వస్తాయి. ఇప్పుడు వీటికి వడ్డీతో వచ్చే దోశెలను కూడా కలిపితే 10 శాతం వడ్డీరేటు ప్రకారం 2,000 (1,818 + 182), అదే 8 శాతం వడ్డీ ప్రకారం 2,048 (1,896 + 152) దోశెలు వస్తాయి. అంటే వడ్డీరేటు తగ్గినా 2.5 శాతం అధికంగా దోశెలు పొందుతున్నారు!! అంటూ దోశ ఎకనామిక్స్‌తో ఢిల్లీలో పెన్షనర్లకి పెద్ద క్లాసే తీసుకున్నారు రాజన్. అయితే నెల రోజుల తిరక్క ముందే కేరళ విద్యార్థిని నుంచి రాజన్‌కు దోశె రూపంలోనే దిమ్మ తిరిగే ప్రశ్న ఎదురయ్యింది. ద్రవ్యోల్బణం పెరిగితే దోశె రేటు పెరుగుతోంది!! కానీ తగ్గినప్పుడు దోశె రేట్లు దిగిరాకపోవడానికి కారణం ఏమిటని ఆ అమ్మాయి ప్రశ్నించింది. ఒక్కసారిగా ఊహించని ప్రశ్న వచ్చినప్పటికీ... వెంటనే తేరుకొని ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దోశె తయారీకి ‘పెనం (తవ్వా)’ వాడుతుండటమే ధరలు తగ్గకపోవడానికి కారణమంటూ జారుకున్నారు. ఒకరకంగా ద్రవ్యోల్బణం తగ్గినా ఆ ప్రయోజనం పెన్షనర్ల జేబును తాకడం లేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు. -
దోశా.. దోశా..ఎందుకు దిగిరావడం లేదు?
పెనమే కారణమంటున్న ఆర్బీఐ గవర్నర్ రాజన్ కోచి: ఒకపక్క ఆర్బీఐ ఏమో ధరలను కట్టడి చేయడంలో విజయం సాధించామని చెప్పుకుంటోంది. మరి వస్తువుల ధరలు తగ్గినప్పటికీ.. పెరిగిన దోశ రేట్లు మళ్లీ ఎందుకు తగ్గడం లేదు? ఇది ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను అడిగిన ప్రశ్న. మరి ఆయన దీనికి చెప్పిన ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా.. ‘పెనం’! అదేంటి పెనం ఏం చేసిందనేగా ఇప్పుడు మీ ప్రశ్న. అవును మరి దోశను వేసేందుకు ఎప్పటిలాగే ఇంకా సాంప్రదాయబద్దమైన పెనంనే ఉపయోగిస్తున్నారని.. ఈ విషయంలో టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడంవల్లే రేట్లు దిగిరావడం లేదనేది రాజన్ లాజిక్. అంతేకాదు దోశలు వేసే వంటవాళ్ల జీతాలు పెరిగిపోవడం వల్ల కూడా దోశ రేట్లు తగ్గడం లేదన్నారు ఆర్బీఐ గవర్నర్. ఫెడరల్ బ్యాంక్‌కు చెందిన ఒక కార్యక్రమంలో ఒక విద్యార్థిని ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఈ ‘దోశ’ ప్రశ్న అడిగింది. ఏ రంగమైనా ఇంతే... టెక్నాలజీ వినియోగంతో ఉత్పాదకత పెరుగుతుందని.. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) వాడకంతో ఒక క్లర్క్ మరింత ఎక్కువ మందికి సేవలు అందించగలుగుతున్నాడని రాజన్ వివరించారు. ‘ఒకపక్క, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న తరుణంలో కొన్ని రంగాలు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటుంటే.. మరికొన్ని వెనుకబడుతున్నాయి. ఇలా టెక్నాలజీని మెరుగుపరుచుకోలేని రంగాలకు చెందిన వస్తువుల రేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. దోశ విషయంలో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే’ అంటూ రాజన్ ముగించారు. -
ఐఎంఎఫ్ చోద్యం చూస్తూ కూర్చుంది..
సంస్థ విధానాలను ఆక్షేపించిన ఆర్బీఐ గవర్నర్ రాజన్ ముంబై: ఉదార ఆర్థిక విధానాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యవహరించిన తీరును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా ఆక్షేపించారు. సంపన్న దేశాల మొదలుపెట్టిన విధానాలు వర్ధమాన మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మాత్రం చప్పట్లు కొడుతూ, చోద్యం చూస్తూ కూర్చున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే పరిణామాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఐఎంఎఫ్... దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. ఒక దేశానికి మేలు చేసే విధానాలు యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయన్న రీతిలో ఐఎంఎఫ్ అధ్యయనాలు ఉంటున్నాయని రాజన్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. కానీ, ఏ సెంట్రల్ బ్యాంకుకైనా నిర్దేశిత లక్ష్యం ఆయా దేశాలకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవడమే తప్ప యావత్ప్రపంచం ప్రయోజనార్థం పనిచేయడం కాదన్నారు. సెంట్రల్ బ్యాంకులు స్వదేశం తర్వాతే మిగతా ప్రపంచదేశాలకు రెండో ప్రాధాన్యమే ఇస్తాయని చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతిద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నాయని, దాని బారి నుంచి తప్పించుకునేందుకు వృద్ధికి ఊతమిచ్చే చర్యల కోసం ప్రయత్నిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెడితేనే 9% వృద్ధి.. తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో పాటు సరఫరాలను మెరుగుపర్చి, డిమాండ్‌కి ఊతమిచ్చే చర్యలు అవసరమని రాజన్ చెప్పారు. అయితే, ఇదంతా నిరంతర ప్రక్రియని, ఒక్క రోజులో సాధ్యపడేది కాదని పేర్కొన్నారు. వాస్తవిక వృద్ధి సాధన కష్టంతో కూడుకున్నదన్నారు. కానీ ఏదో రకంగా వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జనాకర్షక విధానాలు పాటించడం సరికాదని రాజన్ తెలిపారు. సరైన ఆర్థివేత్తలు తగినంతమంది లేరు.. అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగే సత్తా ఉన్న మంచి ఆర్థికవేత్తలు భారత్‌లో తగినంత మంది లేరని కూడా రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెనడా-భారత్ సారథ్యంలో.. ఏర్పాటైన జీ20 మార్గదర్శకాల కమిటీలో కెనడా ఆర్థికవేత్తలు ఏకంగా ఏడుగురు ఉన్నారని, కానీ భారత్ తరఫునుంచి అంత మంది లేరని రాజన్ చెప్పారు. ఆ నైపుణ్యాలు గల వారు ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. మరోవైపు, ఉద్యోగాల కల్పన మెరుగుపడాలంటే చిన్న సంస్థలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం కూడా ఉందని రాజన్ చెప్పారు. -
అధిక స్థాయిలోనే ధరలు
ఆర్బీఐ గవర్నర్ రాజన్ అభిప్రాయం ♦ ఇటీవలి ద్రవ్యోల్బణం తగ్గుదల ♦ బేస్ ఎఫెక్ట్ ప్రభావమని విశ్లేషణ ♦ అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి అని వ్యాఖ్య న్యూఢిల్లీ : అమెరికా ఫెడ్ రేట్ల పెంపును వాయిదావేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు కోత సెప్టెంబర్ 29న ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో, దీనికి భిన్నమైన ధోరణిలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు చేశారు. రేటు కోత నిర్ణయం ‘ద్రవ్యోల్బణం అదుపు’పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు నెల చరిత్రాత్మక కనిష్ట స్థాయి 3.6 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోవడం- బేస్ ఎఫెక్ట్‌గా కూడా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ వ్యాఖ్య సెప్టెంబర్ 29 రెపో రేటు కోతపై పలువురి అంచనాలపై నీళ్లు జల్లుతోంది. గత ఏడాదే ధరల పెరుగుదల శాతం అధికంగా వుండటం వల్ల... అప్పటితో పోల్చితే (క్రితం ఏడాది ప్రాతిపదిక) ఈ ఆగస్టు నెలలో పెరుగుదల శాతం తక్కువవుండటమే బేస్ ఎఫెక్ట్. కానీ మొత్తం మీద ఈ ఏడాదీ ధరలు పెరిగాయ్. బేస్ ఎఫెక్ట్‌ను తొలగిస్తే... వాస్తవ ద్రవ్యోల్బణం 5% వరకూ ఉం టుందని కూడా రాజన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన సీకే ప్రహ్లాద్ నాల్గవ స్మారక కార్యక్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండడమే కీలకం. అయితే ఇది కేవలం ఇప్పుటికే సంబంధించిన అంశం కాదు. భవిష్యత్తుకూ ఇది అవసరమే.’ అని ఆయన అన్నారు. ‘ఇప్పుడు మీ కెమెరాలు అన్నీ దేనికోసం చూస్తున్నాయో నాకు తెలుసు. నా స్పందన యథాతథమే. మీరు రానున్న విధాన ప్రకటన వరకూ వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ►అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి. పలు దేశాలు వృద్ధికి ఇబ్బందులు పడుతుంటే... భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది. ►వృద్ధి దిశలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ మనం బ్రెజిల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వేగంగా అభివృద్ధి చెందాలనుకున్న దేశం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ రుణ భారం, అవినీతి, కంపెనీల నష్టాలు, మొండిబకాయిల సమస్యల్లో బ్రెజిల్ కూరుకుంది. ►వృద్ధి ప్రగతిలో పటిష్ట వ్యవస్థల పాత్రా కీలకం. అధిక విలువ నోట్లు అందుకే ముద్రించడం లేదు పొరుగు దేశాలతో సంక్లిష్టమైన సంబంధాల కారణంగా నకిలీ నోట్లు వెల్లువెత్తవచ్చన్న ఆందోళన వల్లే అధిక విలువ గల నోట్ల ముద్రణ ఆర్బీఐకి కష్టంగా ఉంటోందని రాజన్ చెప్పారు. సిసలైనవిగా కనిపించే రూ. 500 నకిలీ నోట్లను తాను అనేకం చూశానని, ఇలాంటివి అరికట్టేందుకు ఎప్పటికప్పుడు అదనపు భద్రతా ఫీచర్లను జోడి స్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.