ఇదండీ... రాజన్ ‘దోశ’ కథ
వడ్డీరేట్లు తగ్గుతుండటంపై పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై ఆర్‌బీఐ గవర్నరు రాజన్‌కు లేఖలు కూడా రాశారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక సమావేశంలో ఆయనే స్వయంగా చెప్పారు. ‘ఈ మధ్య నాకు పెన్షనర్ల నుంచి అనేక లేఖలొస్తున్నాయి. చాలామంది తమకు ఏడాది కిందట 10 శాతం వడ్డీ వచ్చేదని, ఇప్పుడు 8 శాతం కూడా రావడం లేదని పేర్కొన్నారు. తమ అవసరాలు తీరాలంటే వడ్డీ రేట్లు తగ్గించకూడదని కోరుతున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే... వడ్డీ రేట్లు తగ్గుతున్నా పెన్షనర్లకి గతంలో కన్నా డబ్బులు ఎక్కువే మిగులుతున్నాయని. అదెలాగని మీరు అడగొచ్చు. మీ అందరికీ అర్థమయ్యేటట్లు ‘దోశ’లతో చెపుతా.
ఉదాహరణకు దోశ ఖరీదు రూ.50 అనుకుందాం. మీరు దాచుకున్న లక్ష రూపాయలతో సుమారు 2,000 దోశెలు కొనుక్కోవచ్చు. కానీ ఈ పెన్షనర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా అదనపు మొత్తం కావాలనుకుంటున్నారు.
ద్రవ్యోల్బణం పెరిగితే...
వడ్డీరేటు 10% ఉందనుకుంటే ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయల మీద వడ్డీ రూపంలో అదనంగా రూ. 10,000 వస్తాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం 10% వల్ల దోశె రేటు కూడా రూ.55 అయ్యింది. అంటే ఈ వడ్డీతో అదనంగా 182 దోశెలు వస్తాయి.
ద్రవ్యోల్బణం తగ్గితే.. వడ్డీరేటు 8 శాతం, ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉందనుకుందాం. అప్పుడు మీకు వడ్డీ కింద రూ. 8,000 వస్తుంది. ఇదే సమయంలో దోశె ఖరీదు రూ. 52.75 అవుతుంది. అప్పుడు ఈ వడ్డీతో మీకు 152 దోశలే వస్తాయి.
ఈ లెక్కన చూసినపుడు... వడ్డీరేటు తగ్గగానే దోశలు తగ్గిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇక్కడ వడ్డీని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. అసలు లక్ష రూపాయల విలువను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 10 శాతం ద్రవ్యోల్బణం ఉంటే లక్ష రూపాయలకు వచ్చే దోశలు 1,818 మాత్రమే. అదే ద్రవ్యోల్బణం 5.5 శాతానికి తగ్గితే 1,896 దోశలు వస్తాయి. ఇప్పుడు వీటికి వడ్డీతో వచ్చే దోశెలను కూడా కలిపితే 10 శాతం వడ్డీరేటు ప్రకారం 2,000 (1,818 + 182), అదే 8 శాతం వడ్డీ ప్రకారం 2,048 (1,896 + 152) దోశెలు వస్తాయి. అంటే వడ్డీరేటు తగ్గినా 2.5 శాతం అధికంగా దోశెలు పొందుతున్నారు!! అంటూ దోశ ఎకనామిక్స్‌తో ఢిల్లీలో పెన్షనర్లకి పెద్ద క్లాసే తీసుకున్నారు రాజన్.
అయితే నెల రోజుల తిరక్క ముందే కేరళ విద్యార్థిని నుంచి రాజన్‌కు దోశె రూపంలోనే దిమ్మ తిరిగే ప్రశ్న ఎదురయ్యింది. ద్రవ్యోల్బణం పెరిగితే దోశె రేటు పెరుగుతోంది!! కానీ తగ్గినప్పుడు దోశె రేట్లు దిగిరాకపోవడానికి కారణం ఏమిటని ఆ అమ్మాయి ప్రశ్నించింది. ఒక్కసారిగా ఊహించని ప్రశ్న వచ్చినప్పటికీ... వెంటనే తేరుకొని ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దోశె తయారీకి ‘పెనం (తవ్వా)’ వాడుతుండటమే ధరలు తగ్గకపోవడానికి కారణమంటూ జారుకున్నారు. ఒకరకంగా ద్రవ్యోల్బణం తగ్గినా ఆ ప్రయోజనం పెన్షనర్ల జేబును తాకడం లేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు.