దోశా.. దోశా..ఎందుకు దిగిరావడం లేదు?
పెనమే కారణమంటున్న ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
కోచి: ఒకపక్క ఆర్‌బీఐ ఏమో ధరలను కట్టడి చేయడంలో విజయం సాధించామని చెప్పుకుంటోంది. మరి వస్తువుల ధరలు తగ్గినప్పటికీ.. పెరిగిన దోశ రేట్లు మళ్లీ ఎందుకు తగ్గడం లేదు? ఇది ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను అడిగిన ప్రశ్న. మరి ఆయన దీనికి చెప్పిన ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా.. ‘పెనం’! అదేంటి పెనం ఏం చేసిందనేగా ఇప్పుడు మీ ప్రశ్న. అవును మరి దోశను వేసేందుకు ఎప్పటిలాగే ఇంకా సాంప్రదాయబద్దమైన పెనంనే ఉపయోగిస్తున్నారని..
ఈ విషయంలో టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడంవల్లే రేట్లు దిగిరావడం లేదనేది రాజన్ లాజిక్. అంతేకాదు దోశలు వేసే వంటవాళ్ల జీతాలు పెరిగిపోవడం వల్ల కూడా దోశ రేట్లు తగ్గడం లేదన్నారు ఆర్‌బీఐ గవర్నర్. ఫెడరల్ బ్యాంక్‌కు చెందిన ఒక కార్యక్రమంలో ఒక విద్యార్థిని ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఈ ‘దోశ’ ప్రశ్న అడిగింది.
ఏ రంగమైనా ఇంతే...
టెక్నాలజీ వినియోగంతో ఉత్పాదకత పెరుగుతుందని.. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) వాడకంతో ఒక క్లర్క్ మరింత ఎక్కువ మందికి సేవలు అందించగలుగుతున్నాడని రాజన్ వివరించారు.
‘ఒకపక్క, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న తరుణంలో కొన్ని రంగాలు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటుంటే.. మరికొన్ని వెనుకబడుతున్నాయి. ఇలా టెక్నాలజీని మెరుగుపరుచుకోలేని రంగాలకు చెందిన వస్తువుల రేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. దోశ విషయంలో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే’ అంటూ రాజన్ ముగించారు.