మందగమనం వల్లే మొండి బకాయిల సెగ
పార్లమెంటరీ కమిటీకి ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వివరణ...
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్‌పీఏ) ఘోరంగా పెరిగిపోవడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనమే ప్రధాన కారణమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి ఇచ్చిన వివరణ నివేదికలో ఎన్‌పీఏలు ఎగబాకడానికి గల కారణాలను వివరించారు. పీఏసీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేవీ థామస్ పదవీకాలం ముగియడంతో కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వివరణను పరిశీలించేందుకు రాజన్‌ను హాజరుకావాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల చీఫ్‌లను కూడా పిలిపించి వాటి మొండిబకాయిల వివరాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ఆరు కారణాలు...
డిసెంబర్ చివరినాటికి పీఎస్‌బీల ఎన్‌పీఏలు రూ.3.61 లక్షల కోట్లకు ఎగియడంతో స్వచ్చంధంగా(సుమోటో) ఈ అంశాన్ని పీఏసీ పరిశీలిస్తోంది. పీఎస్‌బీలకు డిసెంబర్ ఆఖరికల్లా రూ.100 కోట్లకు మించి బాకాయిపడ్డ ఖాతాలు 701 వరకూ ఉండగా.. మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లుగా అంచనా. ‘చాలా ఎన్‌పీఏలకు సంబంధించి గతం లో రుణాన్ని మంజూరు చేసిన అధికారులే మళ్లీ వాటిని రికవరీ చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని పీఏసీ తన పరిశీలనలో గుర్తించింది.
దీన్నిబట్టి చూస్తే.. రికవరీకి తగిన యంత్రాంగం లేదని తేలుతోంది’ అని పీఏసీలోని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఎన్‌పీఏలు 2.2% ఉండగా.. పీఎస్‌బీలకు సంబంధించి 5.98%కి పెరిగిపోవడమేంటని పీఏసీ రాజన్‌ను ప్రశ్నించింది. దీనికి 6 కీలక అంశాలను ఆర్‌బీఐ గవర్నర్ ప్రస్తావించారు. దేశీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం ప్రధాన కారణమని చెప్పారు.
ప్రాజెక్టులకు అనుమతుల జాప్యం, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎడాపెడా రుణాలు తీసుకున్న కార్పొరేట్లు పరిస్థితులు బాగోలేకపోవడంతో చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా క్రెడిట్ రిస్కులు, ప్రాజెక్టులకు సంబంధించి సరైన మదింపు లేకపోవడం కూడా ఎన్‌పీఏలను ఎగదోస్తోందన్నారు. కొన్ని కేసుల్లో రుణాల మంజూరులో అవినీతి, మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలూ ఎన్‌పీఏలను పెంచుతున్నాయని రాజన్ వివరించారు.