RBI statistics
-
పరిశ్రమలకు రెట్టింపు బ్యాంకు రుణాలు
ముంబై: దేశీ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు జూలై నెలలో రెట్టింపు స్థాయికి చేరాయి. జూలైలో బ్యాంక్‌లు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో 10.2 శాతం పరిశ్రమలకు దక్కాయి. ఏడాది క్రితం ఇదే నెలలో పరిశ్రమలకు మంజూరైన రుణాలు 4.6 శాతంగానే ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సైతం 18.1 శాతం రుణాలు లభించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరైన రుణాల వాటా 16.7 శాతంగా ఉంది. జూలై నెలలో రంగాల వారీ బ్యాంక్ రుణాలపై ఆర్బీఐ గణాంకాలను పరిశీలించగా.. కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు, అణు ఇంధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. బేసిక్ మెటల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ రంగాలకు రుణాల మంజూరు మోస్తరుగా ఉంది. జూలై నెలలో బ్యాంకు మొత్తం రుణాల్లో సేవల రంగం వాటా 15.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 19.7 శాతంతో పోలి్చతే తగ్గినట్టు తెలుస్తోంది. వాణిజ్య రియల్ ఎస్టేట్, పర్యాటకం, హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం రుణాల్లో వృద్ధి కనిపించింది. వ్యక్తిగత రుణాల వాటా 17.8 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 18.4 శాతంగా ఉండడం గమన్హార్హం. వ్యక్తిగత రుణాల్లో అధిక వాటా కలిగిన ఇంటి రుణాల్లో మాత్రం మెరుగుదల కనిపించింది. -
ఆకర్షణ కోల్పోతున్న డెబిట్ కార్డు.. దూసుకుపోతున్న క్రెడిట్ కార్డు!
న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ ఇప్పుడు తన ఆకర్షణ కోల్పోతోంది. దీని స్థానంలో క్రెడిట్ కార్డు ఆకర్షణీయంగా మారుతోంది. డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డుతో చెల్లింపుల లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దం క్రితం డెబిట్ కార్డులే చెల్లింపుల్లో సింహ భాగం వాటా కలిగి ఉంటే, నేడు క్రెడిట్ కార్డులు ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటున్నాయి. కార్డుతో చెల్లించినప్పటికీ, 45 రోజుల వరకు ఆ బకాయి తీర్చేందుకు వ్యవధి ఉండడం, చెల్లింపులపై రివార్డులు ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డుల ద్వారా 22 కోట్ల మర్చంట్ (వర్తకులు) చెల్లింపులు నమోదు అయితే, అదే నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల లావాదేవీలు 25 కోట్లుగా ఉన్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే.. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపుల జరిగితే, డెబిట్ కార్డుల లావాదేవీల విలువ ఇందులో సగానికంటే తక్కువ రూ.53,000 కోట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ–కామర్స్, భౌతిక దుకాణాల్లో చేసిన లావాదేవీలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో క్రెడిట్ కార్డుల స్వైప్ (చెల్లింపు)లు 20 శాతం పెరగ్గా, డెబిట్ కార్డు స్వైప్‌లు 31 శాతం క్షీణించాయి. ఫిన్‌టెక్‌ల మద్దతు స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి ప్రాధాన్యం చూపిస్తున్నాయి. మింత్రా కోటక్ మహీంద్రా బ్యాంకుతో, పేటీఎం ఎస్బీఐ కార్డ్‌తో కలసి ఇటీవలే క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రభుత్వరంగ పీఎన్బీ బ్యాంక్‌తో కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకురావడం గమనార్హం. ఇలా పెద్ద సంస్థలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి. ‘‘వస్త్రాలను విక్రయించే పెద్ద మార్కెట్‌ప్లేస్‌కు అమ్మకాలపై ఎంతలేదన్నా 50–60 శాతం లాభాల మార్జిన్ ఉంటుంది. దీంతో అవి తమ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వగలవు. తద్వారా కస్టమర్ల విశ్వసనీయతను చూరగొనవు’’అని ఓ ఫిన్‌టెక్ సంస్థ ఉన్నతోద్యోగి తెలిపారు. బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో వాటా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ, అది వాటికి పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు శాఖ తరఫున ఒక్క క్రెడిట్ కార్డు కస్టమర్‌ను పొందేందుకు అవి రూ.2,000ను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పోలిస్తే కో బ్రాండెడ్ ఒప్పందం ద్వారా అయితే తక్కువ ఖర్చులోనే ఎక్కువ కస్టమర్లను చేరుకోవడం వాటిని ఆ దిశగా దృష్టి సారించేలా చేస్తోంది. అందుకే అవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ప్ర ముఖ ఫిన్‌టెక్‌లు, కన్జ్యూమర్ కంపెనీలతో టైఅప్ కోసం కృషి చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ సాయంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్ చేస్తుండడం గమనార్హం. పరిశ్రమ వ్యాప్తంగా క్రెడిట్ కార్డు యాక్టివిటీ రేటు 50 శాతంగా ఉంటే, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డులో ఇది 70 శాతంగా ఉన్నట్టు అమెజాన్ పే ఇండియా హోల్‌టైమ్ డైరెక్టర్ వికాస్ బన్సాల్ తెలిపారు. యూపీఐ ప్రభావం.. డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి క్రెడిట్ కార్డులే కాకుండా, యూపీఐ చెల్లింపుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండడంతో డెబిట్ కార్డు ప్రాధాన్యం తగ్గింది. మే నెలలో 536 కోట్ల యూపీఐ మర్చంట్ లావాదేవీలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 254 కోట్ల లావాదేవీలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఇప్పుడు అన్ని చెల్లింపుల సాధనాల్లోనూ యూపీఐ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డు చెల్లింపులకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం వీటి సంఖ్య 7.5 కోట్లు. మూడేళ్ల క్రితం 5 కోట్ల కంటే తక్కువే ఉన్నాయి. ‘‘యూపీఐ మాదిరిగా కాకుండా క్రెడిట్ కార్డు అనేది మొత్తం ఎకోసిస్టమ్‌లో ఉన్న అందరికీ ఆదాయాన్నిచ్చే సాధనం. సాధారణంగా అధిక విలువ కొనుగోళ్లకు, వినియోగ చెల్లింపులకు దీన్ని స్వైప్ చేస్తుంటారు’’అని ఓ బ్యాంకర్ తెలిపారు. -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్‌సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్‌లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్‌లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్‌వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
60 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి
ముంబై: అధిక స్థాయిలో మొండి బకాయిలు, కార్పొరేట్ డిమాండ్ బలహీనంగా ఉండడం వంటి పలు అంశాల కారణంగా రుణాల వృద్ధి 60 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 5.08 శాతంగా నమోదైంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 10.7 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఏప్రిల్ 1 నాటికి బ్యాంకులు జారీ చేసిన రుణాలు రూ.75.01 లక్షల కోట్లుగా ఉండగా, అవి 2017 మార్చి చివరి నాటికి రూ.78.81 లక్షల కోట్లకు చేరాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, వృద్ధి రేటు 7 శాతానికి సమీపంలో ఉన్న తరుణంలో తాజా గణాంకాలు ఆశ్చర్యపరిచేవేనని నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీలు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించడం తగ్గి, బాండ్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పెరగడం ఇందుకు ఓ ముఖ్య కారణంగా చెబుతున్నారు. రుణాల వృద్ధి 1953–54లో అతి తక్కువగా 1.7 శాతమే నమోదు కాగా, ఆ తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం గత ఆర్థిక ఏడాదిలోనే. తాజా మొండి బకాయిల (ఎన్పీఏ) నమోదు రేటు సాధారణ స్థాయికి చేరుకుంటున్నా బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత బలహీనంగా కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.