60 ఏళ్ల కనిష్టానికి రుణ వృద్ధి
ముంబై: అధిక స్థాయిలో మొండి బకాయిలు, కార్పొరేట్ డిమాండ్ బలహీనంగా ఉండడం వంటి పలు అంశాల కారణంగా రుణాల వృద్ధి 60 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 5.08 శాతంగా నమోదైంది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 10.7 శాతంగా ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఏప్రిల్ 1 నాటికి బ్యాంకులు జారీ చేసిన రుణాలు రూ.75.01 లక్షల కోట్లుగా ఉండగా, అవి 2017 మార్చి చివరి నాటికి రూ.78.81 లక్షల కోట్లకు చేరాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, వృద్ధి రేటు 7 శాతానికి సమీపంలో ఉన్న తరుణంలో తాజా గణాంకాలు ఆశ్చర్యపరిచేవేనని నిపుణులు పేర్కొంటున్నారు.
కంపెనీలు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించడం తగ్గి, బాండ్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పెరగడం ఇందుకు ఓ ముఖ్య కారణంగా చెబుతున్నారు. రుణాల వృద్ధి 1953–54లో అతి తక్కువగా 1.7 శాతమే నమోదు కాగా, ఆ తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం గత ఆర్థిక ఏడాదిలోనే. తాజా మొండి బకాయిల (ఎన్‌పీఏ) నమోదు రేటు సాధారణ స్థాయికి చేరుకుంటున్నా బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత బలహీనంగా కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.