రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి?
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చడానికి చాలా ముందుగానే కుట్రపన్నిన ఎల్టీటీఈ వర్గాలు ఏకంగా 10 జన్పథ్ నివాసంలోకే ప్రవేశించాయా? ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎలా తిరుగుతారన్న విషయాలన్నింటినీ అక్కడినుంచే గ్రహించాయా? అవునంటోంది ఓ పుస్తకం. గతంలో రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆర్డీ ప్రధాన్ ఈ పుస్తకం రాశారు. సోనియాగాంధీ కూడా అలాగే అనుకుంటున్నారని ఆయన అంటున్నారు.
''రాజీవ్ హత్యకేసులో చాలామంది నిందితులను అరెస్టుచేసి, కొంతమందిపై నేరం నిరూపించినా.. పూర్తి వాస్తవం బయటకు రాలేదని అనిపిస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది పెద్దమనుషులు కలిసి చేసిన కుట్రలో భాగమే ఈ హత్య అని తెలుస్తోంది. 10 జన్పథ్ నివాసంలో ఉన్నవాళ్లే కీలక సమాచారాన్ని బయటకు చేరవేశారు. ఆ సమయానికి 1991 లోక్సభ ఎన్నికల ప్రచారానికి అమేథీలో ఉన్న సోనియాగాంధీకి కూడా ఇలాంటి అనుమానమే ఉంది'' అని ప్రధాన్ ఆ పుస్తకంలో రాశారు.
హత్యకు దారితీసిన భద్రతాలోపాలపై జస్టిస్ వర్మ కమిషన్ విచారణ జరపగా, మొత్తమ్మీద భద్రతాలోపాలను జైన్ కమిషన్ పరిశీలించింది. కేవలం తమిళనాడు సర్కారుకు మాత్రమే ఎల్టీటీఈ కుట్రల గురించి తెలిసే అవకాశం ఉందని, కానీ ఈ విషయంలో ఐబీ, తమిళనాడు గవర్నర్ (భీష్మ నారాయణ్ సింగ్) విఫలమైనట్లు తనకు అనిపిస్తోందని ప్రధాన్ చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు ప్రధాన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.