RDO & Thahasildar
-
అమోయ్‌కుమార్ ల్యాండ్ కేసు: ఆర్డీవోకు ‘ఈడీ’ పిలుపు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్‌లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్‌ల విచారణ -
ఆర్డీవోగా వస్తానన్నావు రమణయ్యా..
మధురవాడ/ఆరిలోవ: త్వరలో ఆర్డీవో అవుతానన్నావు.. మరింత మందికి సేవ చేస్తానన్నావు.. పిల్లలను బాగా చదివించాలని ఆశప డ్డావు.. మా అందరికీ పెద్ద దిక్కుగా నిలిచావు.. ఇంతలోనే అందనిలోకాలకు చేరు కున్నావా.. రమణయ్యా అంటూ.. తహసీల్దార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. సరదాగా, స్నేహభావంతో ఉండేవాడని.. ఇప్పుడు తమకు దూరమయ్యాడంటూ గుండెలవిసేలా రోదించారు. పిల్లలు రమణయ్య ఫొటో చూసి డాడీ.. డాడీ అంటూ ఏడ్చిన తీరు చూపరులను కలచివేసింది. ఆయనతో పనిచేసిన సిబ్బంది అయితే కన్నీరు పెట్టుకున్నారు. రమణయ్య క్రమశిక్షణ గల అధికారిగా మంచి పేరు ఉందని, ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారని వారు తెలిపారు. ఉలిక్కిపడిన కొమ్మాది ప్రాంతం విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన సనపల రమణయ్య.. తల్లి శకుంతలమ్మ, భార్య అనూష, పాప చాన్విష (7), బాబు రియంత్(3)తో కలిసి కొమ్మాది ప్రాంతంలో చరణ్ కేజిల్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల కిందట ఆయనకు విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయింది. శుక్రవారం ఉదయం అక్కడకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. తిరిగి సాయంత్రం కొమ్మాదిలో తన నివాసానికి వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో అపార్ట్మెంట్ సెల్లార్లో రమణయ్యపై ఓ వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తలపై 12 సార్లు కొట్టడంతో వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రమణయ్య హత్యతో కొమ్మాది ప్రాంతం ఉలిక్కి పడింది. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రభుత్వ అధికారి హత్య ఉదంతంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కాగా రమణయ్య స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమిలాడ. సిబ్బంది దిగ్భ్రాంతి : రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల కిందట వరకు తహసీల్దార్‌గా పనిచేసిన రమణయ్య హత్యకు గురవడం.. సిబ్బందిలో కలవరం రేపింది. శనివారం ఉదయం ఆయన హత్య వార్త విన్న ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. రమణయ్య 2023 ఫిబ్రవరి 10న కలెక్టరేట్ సి–సెక్షన్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికల విధానంలో భాగంగా ఆయనకు రెండు రోజుల కిందట విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ జరిగింది. కాగా 15 ఏళ్ల కిందట ఇక్కడ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేసిన డి.గోపాలరావు మధురవాడ ప్రాంతంలో ఓ స్థలం సర్వేకి వెళ్లి హత్యకు గురయ్యాడు. బోసిపోయిన తహసీల్దార్ కార్యాలయం రూరల్ తహశీల్దార్ కార్యాలయం శనివారం బోసిపోయింది. రెండు రోజుల కిందట వరకు ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ రమణయ్య హత్యకు గురికావడంతో సిబ్బంది విచారవదనంలో మునిగిపోయారు. అధికారి హోదాలో ఉన్నప్పటికీ తమతో సరదాగా, స్నేహభావంతో ఉండేవారని కన్నీరు పెట్టుకున్నారు. సిబ్బందిలో కొందరు కేజీహెచ్ మార్చురీ వద్దకు వెళ్లారు. ఇంకొందరు ఆయన స్వగ్రామానికి మృతదేహంతో పాటు వెళ్లి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న సామాన్యులు సైతం రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. రమణయ్య కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేత మహారాణిపేట: కేజీహెచ్ మార్చురీ వద్ద రమణయ్య కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ అడిషినల్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్వో కె.మోహన్‌కుమార్, ఆర్డీవోలు డి.హూస్సేన్ సాహెబ్, భాస్కరరెడ్డి తదితరులు రమణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష రూపాయల చెక్కును రమణయ్య కుటుంబానికి కలెక్టర్ అందజేశారు. -
విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండ రావిపాకుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి మిద్దెకూలి గ్రామ సర్పంచ్ లచ్చమ్మ (51), ఆమె మనవడు యోగేశ్వర్ (7) మృతి చెందారు. మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మిద్దెకూలిపోయి వారిపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, బండ రావిపాకుల.. ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. ఈక్రమంలో సర్పంచ్ ఇళ్లు పాతదై పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీఓ,తహసీల్దార్లతో గ్రామస్తుల వాగ్వివాదం గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషయం తెలియడంతో ఆర్టీఓ, తహసీల్దార్ బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండ రావిపాకుల వెళ్లారు. అయితే, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ, తహసీల్దార్లను అడ్డుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. తమకు సకాలంలో పునరావాసం ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి పరిస్దితి తలెత్తేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులంతా పునరావాస పరిహారంపై పట్టుబట్టడంతో ఆర్టీఓ, తహసీల్దార్లు వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. చదవండి: కేపీహెచ్‌బీకాలనీ: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం -
తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన సర్కారు.. తాజాగా వ్యవసాయేతర భూమి నియోగ మార్పిడి(నాలా) అధికారాల నుంచి ఆర్డీవోలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది ఈ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించాలని యోచిస్తోంది. సాగు భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేయాలంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు, ప్రతిపాదిత భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆర్డీవో ఆదేశిస్తారు. తహసీల్దార్ సిఫారసుకు అనుగుణంగా ఆర్డీవో నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల ‘నాలా’జారీ ఆలస్యం కావడమేగాకుండా.. అక్రమాలు కూడా జరుగుతున్నాయని గుర్తించిన సర్కారు ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. భూ వినియోగ మార్పిడిపై దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపే సాగు భూమి విస్తీర్ణం నుంచి ఇతర అవసరాలకు మళ్లుతున్న భూమిని తొలగించేలా అధికారాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్వోసీలకు మంగళం! నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ)కు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన సర్కారు.. ఎన్వోసీ కమిటీలను కూడా ఎత్తేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైని కులు, అమరులు, పోలీసుల కుటుంబాలకు కేటాయించే భూములను విక్రయించుకునే అధికారాలను కలెక్టర్ నేతృత్వంలోని ఎన్వోసీ కమిటీలు జారీచేస్తాయి. అయితే, ఈ ఎన్వోసీల జారీ కొందరు అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్వోసీలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. చెల్లింపుల ద్వారా కేటాయించిన భూములపై నిర్దేశిత కాల వ్యవధి తర్వాత ఆటోమేటిక్‌గా యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని నిర్ణయించింది. వడివడిగా ‘ధరణి’.. దసరా నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లను తహసీళ్లలోనే చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ నెల మూడో వారంలో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌ను మదింపు చేస్తున్న సాంకేతిక సర్వీసుల శాఖ వచ్చే వారంలో దాని పనితీరును పరిశీలించనుంది. తహసీళ్లకు సాంకేతిక సౌక ర్యాలు సమకూరుస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న స్వాన్ (స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్)కు అదనంగా మరో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వెసులు బాటును తహసీల్దార్లకు కల్పించింది. రాష్ట్రంలోని 590 తహసీళ్లకు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉండగా, స్థానికంగా మంచి నెట్వర్క్ కలిగిన కనెక్షన్ అదనంగా తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్‌బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
నెల్లూరు జిల్లా- మీ ఓటు ఉందా? చెక్ చేసుకోండిలా....
సాక్షి, నెల్లూరు జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 0861 - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
కిడ్నీ రాకెట్లో ఎమ్మార్వో, ఆర్డీవోల పాత్ర
సాక్షి, గుంటూరు: జిల్లాలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో నర్సరావుపేట తహసిల్దార్, ఆర్డీవోల పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. నర్సరావుపేటలో కోడెల కుటుంబం ఆదేశాలు లేకుండా ఏమీ జరగదన్నారు. కిడ్నీ మార్పిడి కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపితే నిజాలు వెలుగుచూస్తాయన్నారు. నర్సరావుపేటలో క్రికెట్ బెట్టింగ్, రేషన్, కల్తీ నూనె మాఫియా పనిచేస్తోందని, నకిలీ మందుల తయారీలో కోడెల పాత్ర ఉందని ఆయన అన్నారు. కాగా, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడును శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రెవెన్యూలో కలకలం
ఆ శాఖ మెడకు ‘వాగ్దేవి’ ఉచ్చు తప్పును గర్తించిన ఉన్నతాధికారులు భూ సంతర్పణపై క్రమశిక్షణ చర్యలు ఆర్డీవో, తహసీల్దార్లకు చార్జ్ మెమోలు స్థానికుల ఫిర్యాదుతో వెల్లడైన అక్రమాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని ఓ బడా విద్యా సంస్థకు అప్పగించిన అంశం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లపై చర్యలు మొదలయ్యాయి. హన్మకొండ మండలం మామునూరులోని విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవీ విద్యా సంస్థలు)కి రెవెన్యూ అధికారులు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. వేల కొద్ది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా వాగ్దేవి విద్యా సంస్థలకు భారీగా భూమిని ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనే ఆరోపణలపై...వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావుకు, హన్మకొండ తహసీల్దారు రాంకుమార్‌కు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చార్జ్ మెమోలు జారీ చేశారు. కోట్ల విలువైన 16 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులో అప్పిలేట్ అధికారి నివేదిక ఆధారంగా గత నెలలో ఆర్డీవోకు, తహసీల్దారుకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన వివరణల ఆధారంగా చార్జ్ మొమోలు జారీ చేశారు. భూ కేటాయింపుల విషయంలో ఈ స్థాయి అధికారులపై చర్యలు మొదలు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో వాగ్దేవి విద్యా సంస్థల భూ కేటాయింపుల అంశం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకెందరు అధికారులపై చర్యలు ఉంటాయోననే ఆసక్తి నెలకొంది. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి... విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీకి 16 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై మామునూరు, బొల్లికుంట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ మండలం మామునూరు శివారులోని 509 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా 59 జీవో కింద రిజిస్రే్టషన్ చేశారని, పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రెండు గ్రామాల వారు, బాధిత రైతులు వచ్చి జేసీ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ పాటిల్ 509 సర్వేనెంబర్లో భూములను పరిశీలించి నివేదిక రూపొందించారు. నిబంధనలు గాలికి.. 59 జీవోను అడ్డు పెట్టుకుని వాగ్దేవి విద్యా సంస్థలకు భూములు కేటాయించిన వ్యవహారంలో తప్పులు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. 59 జీవో ప్రకారం ప్రభుత్వం స్థలంలో నివాసాలు ఉన్న ప్రాంతాలనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆట స్థలాలు, పార్కుల వంటి నిర్మిణాల పేరుతో ఎకరాల కొద్ది ఖాళీ భూములను రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాగ్దేవికి కేటాయించిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాగ్దేవి విద్యా సంస్థల వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విద్యా సంస్థలకు అనుకూలంగా తాత్కాలిక తీర్పు వచ్చింది. కోర్టు తుది ఉత్తర్వులు ఎలా ఉన్నా... రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఈ వ్యవహారంలో రెవెన్యూ పరంగా తప్పు జరిగిందని అంగీకరించినట్లయింది. అయితే ఈ తప్పు విషయంలో చర్యల పరంగా వేగం కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన వారు అంటున్నారు. దీంతో స్థానికుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరికి చార్జ్ మెమోలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూమి కేటాయింపు విషయంలో ఆరోపణలపై చార్జీ మెమోలు అందుకున్న ఆర్డీవో, తహసీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.