
సాక్షి, గుంటూరు: జిల్లాలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో నర్సరావుపేట తహసిల్దార్, ఆర్డీవోల పాత్ర ఉందని వైఎస్సార్‌సీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. నర్సరావుపేటలో కోడెల కుటుంబం ఆదేశాలు లేకుండా ఏమీ జరగదన్నారు. కిడ్నీ మార్పిడి కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపితే నిజాలు వెలుగుచూస్తాయన్నారు. నర్సరావుపేటలో క్రికెట్ బెట్టింగ్, రేషన్, కల్తీ నూనె మాఫియా పనిచేస్తోందని, నకిలీ మందుల తయారీలో కోడెల పాత్ర ఉందని ఆయన అన్నారు.
కాగా, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడును శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు.