Kidney rocket case
-
హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ మాఫియా
సాక్షి ప్రతినిధి, చెన్నై: డబ్బు కోసం ఎంతకైనా తెగించే కిడ్నీ మాఫియా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని రూ.కోట్లు కాజేస్తున్న వైనం వెలుగుచూసింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు ఈ మాఫియా చేతిలో మోసపోయినట్లు ఏపీకి చెందిన ఒక మహిళ వల్ల మంగళవారం తమిళనాడులో బయటపడింది. ఈరోడ్ సంపత్‌నగర్‌లో కల్యాణి కిడ్నీకేర్ ఆస్పత్రి పేరున ఈ మాఫియా ఫేస్బుక్లో ఆకర్షణీయమైన ప్రకటనను పొందుపరిచింది. ఒక్కో కిడ్నీని రూ.3 కోట్లకు కొనుగోలు చేస్తాం. కిడ్నీని అమ్మదలిచినవారు ఈ చిరునామాలో తమ వివరాలను నమోదు చేసుకుంటే అవసరమైనపుడు పిలుస్తామని పేర్కొన్నారు. అయితే నమోదు సమయంలో కిడ్నీ ఇవ్వదలిచిన వారు అడ్వాన్సుగా రూ.15వేల నుంచి రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. ఒక్క కిడ్నీకి రూ.3 కోట్లు లభిస్తుందన్న ఆశతో తమిళనాడులోని ఈరోడ్, సేలం, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చిరాపల్లి, కరూరు జిల్లాలవారేగాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ఆ ఫేస్బుక్ గ్రూపులో సభ్యులుగా చేరి అడ్వా న్సు రుసుము చెల్లించారు. కిడ్నీ అమ్మకం కోసం అడ్వాన్సు చెల్లించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ మంగళవారం ఈరోడ్‌లోని కల్యాణీ కిడ్నీకేర్ సెంటర్‌ను సంప్రదించడంతో ఆస్పత్రి నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. తమ ఆస్పత్రి పేరున నకిలీ ఫేస్బుక్ ఖాతాను తెరిచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుసుకుని ఈరోడ్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శక్తిగణేశన్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఇది నడిచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కిడ్నీ మాఫియా గురించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. -
కిడ్నీ రాకెట్ కేస్‌లో కస్టడీలోకి జేకే వర్మ
-
కన్పించకుండా పోయిన శ్రద్ధా ఆస్పత్రి యాజమాన్యం
-
రెవెన్యూ పాత్రకు పాతరేనా?
నరసరావుపేట కేంద్రంగా సంచలనమైన కిడ్నీ రాకెట్ కేసు పక్కదారి పట్టినట్టేనా ? అసలు నిందితులు అధికార పార్టీ నేతల అండతో తప్పించుకున్నట్టేనా ? కిడ్నీ దానం చేసిన వారు, దళారులే నిందితులా ? నిబంధనలన్నీ ఉల్లంఘించి అనుమతులిచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు లేనట్టేనా ? టీడీపీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారా ? తొమ్మిది నెలల తర్వాత కపలవాయి విజయకుమార్‌ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందా ?.. ఇలా అనేక ప్రశ్నలకు ప్రతి ఒక్కరి నుంచీ అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసులు సైతం రెవెన్యూ అధికారుల జోలికి వెళ్లకపోవడంపై ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు తిరుగులేదని మరోసారి స్పష్టమవుతోంది. సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు దొంగలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ దానం చేసిన వ్యక్తులతోపాటు, సహకరించిన దళారులు, ల్యాబ్ టెక్నీషియన్లను గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం ఆర్యవైశ్య నాయకుడు కపలవాయి విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కిడ్నీ రాకెట్ కేసులో తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేయడం చూస్తుంటే రాజకీయ కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పాత్రను గతంలోనే విజిలెన్స్, పోలీస్ అధికారులు నిగ్గు తేల్చారు. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించామంటూ అప్పట్లో పోలీసులు చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. పోలీసు దర్యాప్తులో తమ వారి పాత్ర తేలితే వారే శిక్షిస్తారంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండటం గమనార్హం అంతా గోప్యం 2017 నవంబరు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అప్పటి తహసీల్దారు చెబుతుండగా.. ఫిర్యాదు అందిన రెండు నెలలపాటు అటు రెవెన్యూ అధికారులుగానీ.. ఇటు పోలీసు అధికారులుగానీ బయటకు పొక్క నీయలేదు. అనంతరం కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు రావడంతో తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమించారు. అక్రమాల పుట్ట.. నరసరావుపేట నరసరావుపేట కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తుందనే విషయం బయటకు రావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డొంకను కదల్చలేకపోయారు. కిడ్నీ రాకెట్‌కు రెవెన్యూ అధికారుల సహకారం పూర్తిగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కిడ్నీ దానం చేసేందుకు అనుమతులు ఇచ్చేసి భారీ స్థాయి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మాత్రం నివేదికను రెవెన్యూ ఉన్నతాధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు. ఇదీ కథ..! దుర్గి మండలం చంద్రకుంట తండాకు చెందిన వెంకటేశ్వరనాయక్ ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి అందులో రావూరి రవి పేరు, అడ్రస్ పెట్టారు. ముందుగా రెవెన్యూ అధికారులతో బేరం మాట్లాడుకున్న తరువాత మాత్రమే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రావూరి రవి పేరుతో దరఖాస్తు చేసిన వెంకటేశ్వర నాయక్ పదేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు అప్పటి వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవోలు ధ్రువీకరించి అనుమతులు ఇచ్చేశారు. వీఆర్వోకు దగ్గరి బంధువు అయిన ఓ పోలీసు అధికారి మధ్య వర్తిత్వం వహించి అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఇబ్బంది లేకుండా చూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్న కొందరు రెవెన్యూ అధికారులు తమపై చర్యలు లేకుండా చూడాలంటూ వారిని ఆశ్రయించినట్లు తెలిసింది. నిగ్గు తేల్చేదెప్పుడు ? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కిడ్నీ రాకెట్ కేసులో అడ్డంగా అనుమతులు ఇచ్చేసిన రెవెన్యూ అధికారుల్లో ఏ ఒక్కరిపై కనీస చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల పాత్రపై మాత్రం నోరు మెదపకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు శాఖాపరంగా చర్యలు చేపట్టిన తరువాత వారి పాత్ర ఎంత మేరకు ఉందో తేల్చుకుని క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
అందుబాటులో లేని ‘పేట’ ఆర్డీవో, ఎమ్మార్వో
సాక్షి, గుంటూరు: నరసరావుపేట కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించిన రికార్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవోలను విచారించేందుకు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి, అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఆయా కార్యాలయాల్లో ఆ అధికారులు లేకపోవడంతో గుంటూరు తిరిగి వచ్చారు. -
కిడ్నీ రాకెట్లో ఎమ్మార్వో, ఆర్డీవోల పాత్ర
సాక్షి, గుంటూరు: జిల్లాలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో నర్సరావుపేట తహసిల్దార్, ఆర్డీవోల పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. నర్సరావుపేటలో కోడెల కుటుంబం ఆదేశాలు లేకుండా ఏమీ జరగదన్నారు. కిడ్నీ మార్పిడి కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరిపితే నిజాలు వెలుగుచూస్తాయన్నారు. నర్సరావుపేటలో క్రికెట్ బెట్టింగ్, రేషన్, కల్తీ నూనె మాఫియా పనిచేస్తోందని, నకిలీ మందుల తయారీలో కోడెల పాత్ర ఉందని ఆయన అన్నారు. కాగా, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడును శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్ కమిటీ వివరణ
గుంటూరు : కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టురట్టు కావడంతో సెంట్రల్ కమిటీ ఈ విషయంపై స్పందించింది. శుక్రవారం సెంట్రల్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..శివనాగేశ్వరరావు కిడ్నీ మార్పిడి వ్యవహరంలో విజయవాడ ఆయుష్ హస్పటల్ యాజమాన్యం నిబంధలు పాటించలేదని తెలిపారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో మాత్రమే శివనాగేశ్వరరావుకు కమిటి పర్మిషన్ ఇచ్చిందని వివరించారు. ఆయుష్ ఆసుపత్రి శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడికి సంబంధించి తమకు దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి తీసుకుని మరో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకోకూడదన్నారు. ఏ ఆసుపత్రి అయినా కిడ్నీ మార్పిడి చేసే ముందు కిడ్నీ మార్పిడి కమిటి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
కిడ్నీ రాకెట్లో మరో వికెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్లో మరో వికెట్ పడింది. ఈ రాకెట్‌తో సంబంధముందన్న కోణంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన అనుపమ్ మహేశ్వరి (51)ని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను అహ్మదాబాద్‌లో సాన్యా డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనుపమ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డయాగ్నస్టిక్ సెంటర్లో ఉండగా ఆయనను అదుపులోనికి తీసుకున్నామని, అహ్మదాబాద్ కోర్టులో హాజరు పరిచి విచారణ నిమిత్తం నల్లగొండకు తీసుకువచ్చినట్టు డీఎస్పీ వెల్లడించారు. అనుపమ్‌తో పాటు డయాగ్నస్టిక్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఈ రికార్డుల ఆధారంగా విచారణలో మరింత ముందుకు వెళతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో నల్లగొండ వన్‌టౌన్ సీఐ టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. నాకేం సంబంధం..? శ్రీలంకకు తీసుకువెళ్లే కిడ్నీ విక్రేతలకు సాన్యా డయాగ్నస్టిక్లోనే ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిలీప్ చౌహాన్ (అహ్మదాబాద్)కు సన్నిహితుడైన ఓ వ్యక్తి ప్రమేయంతో ఈ పరీక్షలు జరుగుతున్నాయని ఇప్పటికే ‘సాక్షి’ వెలుగులోనికి తెచ్చింది. అయితే, దిలీప్‌కు సన్నిహితుడైన వ్యక్తి, ఇప్పుడు అరెస్టయిన అనుపమ్ ఒకరేనా అన్నది పోలీసు విచారణలో తేలనుంది. కాగా, ఈ డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్లు, ఇతర డాక్టర్లు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. 2013 నుంచి డయాగ్నస్టిక్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనుపమ్ మాత్రం తనకేం సంబంధం లేదనే కోణంలో అక్కడే ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సెంటర్ మేనేజర్‌గా ఇతడికి కూడా ఈ రాకెట్లో బాధ్యత ఉంటుందని పోలీసులంటున్నారు. మరోవైపు ఈ డయాగ్నస్టిక్ సెంటర్ రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఎవరెవరికి కిడ్నీ ఆపరేషన్‌కు సంబంధించిన టెస్టులు చేయించారన్నది బహిర్గతం కానుంది. ఈ రికార్డుల్లో దాదాపు 30 మందికి సంబంధించిన వివరాలున్నట్లు పోలీ సులు చెబుతున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌కు చెందిన వ్యక్తులు అరెస్టయితే మరికొంత మంది వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ 30 మందికి మాత్రమే అక్కడ పరీక్షలు నిర్వహించినట్లయితే, మిగిలిన వారికి ఎక్కడ పరీక్షలు చేశారన్న అంశం మళ్లీ పోలీసులకు సవాలుగా మారనుంది. త్వరలోనే భోపాల్, ముంబై, శ్రీలంకకు ఈ రాకెట్లో కీలక భూమిక పోషించిన అహ్మదాబాద్‌లోని సాన్యా డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజర్ కూడా అరెస్టయిన నేపథ్యంలో ఇప్పుడు నల్లగొండ పోలీసుల దృష్టి భోపాల్, ముంబై, శ్రీలంకలపై పడనుంది. ఇప్పటికే కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కూడా నవలోక్, వెస్టర్న్తోపాటు మరో రెండు ఆస్పత్రుల్లో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించే పనిలో పడింది. అయితే, త్వరలోనే నల్లగొండ పోలీసులు భోపాల్, ముంబైలకు వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఈ కేసులో కీలక నిందితుడు సురేశ్ ప్రజాపతికి పోటీగా కిడ్నీ వ్యాపారం చేస్తున్న భోపాల్‌కు చెందిన కీలక ఏజెంటు, ప్రజాపతి రైట్‌హ్యాండ్‌గా ఉన్న ముం బైకి చెందిన మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకోవాల్సి ఉంది. వీరిద్దరూ అరెస్టయితే ఈ కేసులో దాదాపు నిందితులంతా అరెస్టయినట్టే. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే కేసు విచారణ కోసం శ్రీలంకకు కూడా వెళతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించి అందరినీ చట్టం ముందు నిలబెడతామని నల్లగొండ పోలీసులంటున్నారు.