నరసరావుపేట కేంద్రంగా సంచలనమైన కిడ్నీ రాకెట్ కేసు పక్కదారి పట్టినట్టేనా ? అసలు నిందితులు అధికార పార్టీ నేతల అండతో తప్పించుకున్నట్టేనా ? కిడ్నీ దానం చేసిన వారు, దళారులే నిందితులా ? నిబంధనలన్నీ ఉల్లంఘించి అనుమతులిచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు లేనట్టేనా ? టీడీపీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారా ? తొమ్మిది నెలల తర్వాత కపలవాయి విజయకుమార్‌ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందా ?.. ఇలా అనేక ప్రశ్నలకు ప్రతి ఒక్కరి నుంచీ అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీసులు సైతం రెవెన్యూ అధికారుల జోలికి వెళ్లకపోవడంపై ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు తిరుగులేదని మరోసారి స్పష్టమవుతోంది.
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు దొంగలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ దానం చేసిన వ్యక్తులతోపాటు, సహకరించిన దళారులు, ల్యాబ్ టెక్నీషియన్‌లను గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం ఆర్యవైశ్య నాయకుడు కపలవాయి విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కిడ్నీ రాకెట్ కేసులో తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేయడం చూస్తుంటే రాజకీయ కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెవెన్యూ అధికారుల పాత్రను గతంలోనే విజిలెన్స్, పోలీస్ అధికారులు నిగ్గు తేల్చారు. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించామంటూ అప్పట్లో పోలీసులు చెప్పారు. అయితే రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలుగానీ, శాఖాపరమైన చర్యలుగానీ తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. పోలీసు దర్యాప్తులో తమ వారి పాత్ర తేలితే వారే శిక్షిస్తారంటూ రెవెన్యూ అధికారులు చెబుతుండటం గమనార్హం అంతా గోప్యం 2017 నవంబరు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అప్పటి తహసీల్దారు చెబుతుండగా.. ఫిర్యాదు అందిన రెండు నెలలపాటు అటు రెవెన్యూ అధికారులుగానీ.. ఇటు పోలీసు అధికారులుగానీ బయటకు పొక్క నీయలేదు. అనంతరం కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు రావడంతో తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమించారు.
అక్రమాల పుట్ట.. నరసరావుపేట
నరసరావుపేట కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తుందనే విషయం బయటకు రావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డొంకను కదల్చలేకపోయారు. కిడ్నీ రాకెట్‌కు రెవెన్యూ అధికారుల సహకారం పూర్తిగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కిడ్నీ దానం చేసేందుకు అనుమతులు ఇచ్చేసి భారీ స్థాయి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మాత్రం నివేదికను రెవెన్యూ ఉన్నతాధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు.
ఇదీ కథ..!
దుర్గి మండలం చంద్రకుంట తండాకు చెందిన వెంకటేశ్వరనాయక్ ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి అందులో రావూరి రవి పేరు, అడ్రస్ పెట్టారు. ముందుగా రెవెన్యూ అధికారులతో బేరం మాట్లాడుకున్న తరువాత మాత్రమే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రావూరి రవి పేరుతో దరఖాస్తు చేసిన వెంకటేశ్వర నాయక్ పదేళ్లుగా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు అప్పటి వీఆర్వో, తహసీల్దారు, ఆర్డీవోలు ధ్రువీకరించి అనుమతులు ఇచ్చేశారు. వీఆర్వోకు దగ్గరి బంధువు అయిన ఓ పోలీసు అధికారి మధ్య వర్తిత్వం వహించి అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఇబ్బంది లేకుండా చూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్న కొందరు రెవెన్యూ అధికారులు తమపై చర్యలు లేకుండా చూడాలంటూ వారిని ఆశ్రయించినట్లు తెలిసింది.
నిగ్గు తేల్చేదెప్పుడు ?
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కిడ్నీ రాకెట్ కేసులో అడ్డంగా అనుమతులు ఇచ్చేసిన రెవెన్యూ అధికారుల్లో ఏ ఒక్కరిపై కనీస చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తొమ్మిది నెలల తరువాత కపలవాయిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల పాత్రపై మాత్రం నోరు మెదపకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు శాఖాపరంగా చర్యలు చేపట్టిన తరువాత వారి పాత్ర ఎంత మేరకు ఉందో తేల్చుకుని క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment