కిడ్నీ రాకెట్‌లో మరో వికెట్ | Another Kindey rocket wicket falled in Nalgonda | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌లో మరో వికెట్

Published Tue, Jan 26 2016 10:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

కిడ్నీ రాకెట్‌లో మరో వికెట్

కిడ్నీ రాకెట్‌లో మరో వికెట్

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  నల్లగొండ కేంద్రంగా వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌లో మరో వికెట్ పడింది. ఈ రాకెట్‌తో సంబంధముందన్న కోణంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన అనుపమ్ మహేశ్వరి (51)ని నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను అహ్మదాబాద్‌లో సాన్యా డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనుపమ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉండగా ఆయనను అదుపులోనికి తీసుకున్నామని, అహ్మదాబాద్ కోర్టులో హాజరు పరిచి విచారణ నిమిత్తం నల్లగొండకు తీసుకువచ్చినట్టు డీఎస్పీ వెల్లడించారు.

అనుపమ్‌తో పాటు డయాగ్నస్టిక్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఈ రికార్డుల ఆధారంగా విచారణలో మరింత ముందుకు వెళతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో నల్లగొండ వన్‌టౌన్ సీఐ టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
నాకేం సంబంధం..?
శ్రీలంకకు తీసుకువెళ్లే కిడ్నీ విక్రేతలకు సాన్యా డయాగ్నస్టిక్‌లోనే ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిలీప్ చౌహాన్ (అహ్మదాబాద్)కు సన్నిహితుడైన ఓ వ్యక్తి ప్రమేయంతో ఈ పరీక్షలు జరుగుతున్నాయని ఇప్పటికే ‘సాక్షి’ వెలుగులోనికి తెచ్చింది. అయితే, దిలీప్‌కు సన్నిహితుడైన వ్యక్తి, ఇప్పుడు అరెస్టయిన అనుపమ్ ఒకరేనా అన్నది పోలీసు విచారణలో తేలనుంది.

కాగా, ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్లు, ఇతర డాక్టర్లు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. 2013 నుంచి డయాగ్నస్టిక్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనుపమ్ మాత్రం తనకేం సంబంధం లేదనే కోణంలో అక్కడే ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సెంటర్ మేనేజర్‌గా ఇతడికి కూడా ఈ రాకెట్‌లో బాధ్యత ఉంటుందని పోలీసులంటున్నారు. మరోవైపు ఈ డయాగ్నస్టిక్ సెంటర్ రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఎవరెవరికి కిడ్నీ ఆపరేషన్‌కు సంబంధించిన టెస్టులు చేయించారన్నది బహిర్గతం కానుంది.

ఈ రికార్డుల్లో దాదాపు 30 మందికి సంబంధించిన వివరాలున్నట్లు పోలీ సులు చెబుతున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌కు చెందిన వ్యక్తులు అరెస్టయితే మరికొంత మంది వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ 30 మందికి మాత్రమే అక్కడ పరీక్షలు నిర్వహించినట్లయితే, మిగిలిన వారికి ఎక్కడ పరీక్షలు చేశారన్న అంశం మళ్లీ పోలీసులకు సవాలుగా మారనుంది.
 
త్వరలోనే భోపాల్, ముంబై, శ్రీలంకకు
ఈ రాకెట్‌లో కీలక భూమిక పోషించిన అహ్మదాబాద్‌లోని సాన్యా డయాగ్నస్టిక్ సెంటర్  మేనేజర్ కూడా అరెస్టయిన నేపథ్యంలో ఇప్పుడు నల్లగొండ పోలీసుల దృష్టి భోపాల్, ముంబై, శ్రీలంకలపై పడనుంది. ఇప్పటికే కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కూడా నవలోక్, వెస్టర్న్‌తోపాటు మరో రెండు ఆస్పత్రుల్లో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించే పనిలో పడింది. అయితే, త్వరలోనే నల్లగొండ పోలీసులు భోపాల్, ముంబైలకు వెళ్లనున్నట్టు సమాచారం.

అక్కడ ఈ కేసులో కీలక నిందితుడు సురేశ్ ప్రజాపతికి పోటీగా కిడ్నీ వ్యాపారం చేస్తున్న భోపాల్‌కు చెందిన కీలక ఏజెంటు, ప్రజాపతి రైట్‌హ్యాండ్‌గా ఉన్న ముం బైకి చెందిన మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకోవాల్సి ఉంది. వీరిద్దరూ అరెస్టయితే ఈ కేసులో దాదాపు నిందితులంతా అరెస్టయినట్టే. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే కేసు విచారణ కోసం శ్రీలంకకు కూడా వెళతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించి అందరినీ చట్టం ముందు నిలబెడతామని నల్లగొండ పోలీసులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement