రెవెన్యూలో కలకలం
-
ఆ శాఖ మెడకు ‘వాగ్దేవి’ ఉచ్చు
-
తప్పును గర్తించిన ఉన్నతాధికారులు
-
భూ సంతర్పణపై క్రమశిక్షణ చర్యలు
-
ఆర్డీవో, తహసీల్దార్‌లకు చార్జ్ మెమోలు
-
స్థానికుల ఫిర్యాదుతో వెల్లడైన అక్రమాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని ఓ బడా విద్యా సంస్థకు అప్పగించిన అంశం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లపై చర్యలు మొదలయ్యాయి.
హన్మకొండ మండలం మామునూరులోని విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవీ విద్యా సంస్థలు)కి రెవెన్యూ అధికారులు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. వేల కొద్ది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా వాగ్దేవి విద్యా సంస్థలకు భారీగా భూమిని ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనే ఆరోపణలపై...వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావుకు, హన్మకొండ తహసీల్దారు రాంకుమార్‌కు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చార్జ్ మెమోలు జారీ చేశారు. కోట్ల విలువైన 16 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులో అప్పిలేట్ అధికారి నివేదిక ఆధారంగా గత నెలలో ఆర్డీవోకు, తహసీల్దారుకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన వివరణల ఆధారంగా చార్జ్ మొమోలు జారీ చేశారు. భూ కేటాయింపుల విషయంలో ఈ స్థాయి అధికారులపై చర్యలు మొదలు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో వాగ్దేవి విద్యా సంస్థల భూ కేటాయింపుల అంశం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకెందరు అధికారులపై చర్యలు ఉంటాయోననే ఆసక్తి నెలకొంది.
రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి...
విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీకి 16 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై మామునూరు, బొల్లికుంట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ మండలం మామునూరు శివారులోని 509 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా 59 జీవో కింద రిజిస్రే్టషన్ చేశారని, పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రెండు గ్రామాల వారు, బాధిత రైతులు వచ్చి జేసీ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ పాటిల్ 509 సర్వేనెంబర్‌లో భూములను పరిశీలించి నివేదిక రూపొందించారు.
నిబంధనలు గాలికి..
59 జీవోను అడ్డు పెట్టుకుని వాగ్దేవి విద్యా సంస్థలకు భూములు కేటాయించిన వ్యవహారంలో తప్పులు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. 59 జీవో ప్రకారం ప్రభుత్వం స్థలంలో నివాసాలు ఉన్న ప్రాంతాలనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆట స్థలాలు, పార్కుల వంటి నిర్మిణాల పేరుతో ఎకరాల కొద్ది ఖాళీ భూములను రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాగ్దేవికి కేటాయించిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాగ్దేవి విద్యా సంస్థల వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విద్యా సంస్థలకు అనుకూలంగా తాత్కాలిక తీర్పు వచ్చింది.
కోర్టు తుది ఉత్తర్వులు ఎలా ఉన్నా... రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఈ వ్యవహారంలో రెవెన్యూ పరంగా తప్పు జరిగిందని అంగీకరించినట్లయింది. అయితే ఈ తప్పు విషయంలో చర్యల పరంగా వేగం కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన వారు అంటున్నారు. దీంతో స్థానికుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరికి చార్జ్ మెమోలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూమి కేటాయింపు విషయంలో ఆరోపణలపై చార్జీ మెమోలు అందుకున్న ఆర్డీవో, తహసీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.