Vagdevi college
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎంఎల్ఆర్ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఆర్ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ దాడి
-
వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్ దాడి
సాక్షి, వరంగల్ : వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు... రవళి అనే యువతి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. ఈరోజు(బుధవారం) కాలేజీకి వెళ్తున్న సమయంలో.. సాయి అన్వేష్ అనే యువకుడు ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా దాడికి పాల్పడ్డ అన్వేష్ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన అతడికి దేహశుద్ధి చేసిన తోటి విద్యార్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెవెన్యూలో కలకలం
ఆ శాఖ మెడకు ‘వాగ్దేవి’ ఉచ్చు తప్పును గర్తించిన ఉన్నతాధికారులు భూ సంతర్పణపై క్రమశిక్షణ చర్యలు ఆర్డీవో, తహసీల్దార్లకు చార్జ్ మెమోలు స్థానికుల ఫిర్యాదుతో వెల్లడైన అక్రమాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని ఓ బడా విద్యా సంస్థకు అప్పగించిన అంశం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లపై చర్యలు మొదలయ్యాయి. హన్మకొండ మండలం మామునూరులోని విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవీ విద్యా సంస్థలు)కి రెవెన్యూ అధికారులు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. వేల కొద్ది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా వాగ్దేవి విద్యా సంస్థలకు భారీగా భూమిని ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారనే ఆరోపణలపై...వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావుకు, హన్మకొండ తహసీల్దారు రాంకుమార్‌కు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చార్జ్ మెమోలు జారీ చేశారు. కోట్ల విలువైన 16 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులో అప్పిలేట్ అధికారి నివేదిక ఆధారంగా గత నెలలో ఆర్డీవోకు, తహసీల్దారుకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన వివరణల ఆధారంగా చార్జ్ మొమోలు జారీ చేశారు. భూ కేటాయింపుల విషయంలో ఈ స్థాయి అధికారులపై చర్యలు మొదలు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో వాగ్దేవి విద్యా సంస్థల భూ కేటాయింపుల అంశం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకెందరు అధికారులపై చర్యలు ఉంటాయోననే ఆసక్తి నెలకొంది. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి... విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీకి 16 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై మామునూరు, బొల్లికుంట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ మండలం మామునూరు శివారులోని 509 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా 59 జీవో కింద రిజిస్రే్టషన్ చేశారని, పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రెండు గ్రామాల వారు, బాధిత రైతులు వచ్చి జేసీ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ పాటిల్ 509 సర్వేనెంబర్లో భూములను పరిశీలించి నివేదిక రూపొందించారు. నిబంధనలు గాలికి.. 59 జీవోను అడ్డు పెట్టుకుని వాగ్దేవి విద్యా సంస్థలకు భూములు కేటాయించిన వ్యవహారంలో తప్పులు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. 59 జీవో ప్రకారం ప్రభుత్వం స్థలంలో నివాసాలు ఉన్న ప్రాంతాలనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆట స్థలాలు, పార్కుల వంటి నిర్మిణాల పేరుతో ఎకరాల కొద్ది ఖాళీ భూములను రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాగ్దేవికి కేటాయించిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాగ్దేవి విద్యా సంస్థల వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విద్యా సంస్థలకు అనుకూలంగా తాత్కాలిక తీర్పు వచ్చింది. కోర్టు తుది ఉత్తర్వులు ఎలా ఉన్నా... రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఈ వ్యవహారంలో రెవెన్యూ పరంగా తప్పు జరిగిందని అంగీకరించినట్లయింది. అయితే ఈ తప్పు విషయంలో చర్యల పరంగా వేగం కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన వారు అంటున్నారు. దీంతో స్థానికుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరికి చార్జ్ మెమోలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూమి కేటాయింపు విషయంలో ఆరోపణలపై చార్జీ మెమోలు అందుకున్న ఆర్డీవో, తహసీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
‘వాగ్దేవి’ భూముల వ్యవహారంలో అధికారులపై చర్యలు
ఆర్డీఓ, తహశీల్దార్‌కు మెమోలు ఆసక్తికరంగా మారిన ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ హన్మకొండ అర్బన్ : అధికారులు జీఓ నంబర్ 59లోని నిబంధనలకు విరుద్ధంగా విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ(వాగ్దేవి కళాశాల)కి ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసిన వ్యవహారంలో వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, హన్మకొండ తహశీల్దార్ రాజ్‌కుమార్‌ను బాధ్యులుగా గుర్తించి మెమోలు జారీ చేశారు. ఈ తతంగంపై విచారణ చేపట్టి న జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తదుపరి చర్యల్లో భాగంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అయితే ఇద్దరు అధికారులకు మాత్రమే మెమోలు జారీ చేసిన ఉన్నతాధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 16.28 ఎకరాల వ్యవహారం బొల్లికుంట సమీపంలోని సర్వే నంబర్ 509లో ఉన్న 16.28 ఎకరాలు ప్రభుత్వ భూమిని జీఓ 59 ద్వారా అధికారులు వాగ్దేవి యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంలో స్థానికంగా దళి త రైతులకు అన్యాయం జరిగిందని, అధికారులు తమకు అన్యాయంచేశారని ఆరోపిస్తూ కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు జేసీని ఆదేశిస్తూ జిల్లా కలెక్ట ర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు అధికారులకు మెమో లు ఇచ్చిన జేసీ తదుపరి భూముల రిజి స్ట్రేషన్ రద్దు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో ఒకవిధం గా క్షేత్రస్థాయిలో అధికారులు తప్పు చేసినట్లు ప్రాథమికంగా ఉన్నతాధికారులు గుర్తిం చారు. అయితే కోట్ల విలువ చేసే భూమి వ్యవహారంలో ఉన్నతాధికారులు తదుపరి చేర్యలు ఏవిధంగా ఉంటాయన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిం ది. కాగా రిజిస్ట్రేషన్ రద్దుపై సంబంధిత యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా ఊరట లభించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ విశ్వం భర సొసైటీ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి
హన్మకొండ: బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరగాలని అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అన్నారు. హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కాలేజీలో ఫోరం ఫర్ బెటర్, వరంగల్ మహిళ పతాంజలి యోగా సమితి, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘అర్థక్రాంతి’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరపడం వల్ల బ్యాంకులే 2 శాతం లావాదేవీ పన్ను వసూలు చేస్తాయన్నారు. దేశం మొత్తమ్మీద ప్రజలు కట్టే పన్ను ఇదొక్కటే కాబట్టి వినియోగదారుని ఖాతా నుంచి బ్యాంకులు ఈ పన్నును మినహాయించి ప్రభుత్వానికి కట్టేస్తాయన్నారు. ఎగుమతి, దిగుమతి పన్నులు మినహాయించి అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. అంతేకాకుండా రూ.2 వేల లోపు లావాదేవీలు మాత్రమే నగదు రూపంలో జరగాలని, అంతకుమించిన లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం నియంత్రించాలని అన్నారు. దీనిద్వారా దేశంలోని అవినీతినికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ భారతదేశం వంటి ప్రజాస్వామికవ్యవస్థలో అర్థక్రాంతి అమలు చేయడం సాధ్యమేనన్నారు. సదస్సులో ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు సుధాకర్, వరంగల్ మహిళా పతంజలి యోగా సమితి అధ్యక్షురాలు సునీత, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జోషి పాల్గొన్నారు.