సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్‌ఆర్‌ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్‌ఆర్‌ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది.
ఎంఎల్‌ఆర్‌ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్‌ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్‌ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్‌ఆర్‌ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment