Re-postmortem
-
ఆయేషా మృతదేహానికి నేడు రీ పోస్ట్‌మార్టం
సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. హత్య జరిగిన 12 ఏళ్ల అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు నెలల క్రితమే రీ పోస్ట్‌మార్టం చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధపడగా, మత పెద్దలు అంగీకరించడం లేదని ఆయేషా తల్లిదండ్రులు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. కోర్టు ఉత్తర్వులతో చేపడతామని అప్పట్లో సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయేషా తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా, రీ పోస్ట్‌మార్టం చేయడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. 14న రీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు తమకు సహకరించాలని సీబీఐ అధికారులు తెనాలి సబ్ కలెక్టర్‌కు ఈ నెల 12న లేఖ రాశారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానాన్ని శుక్రవారం తహసీల్దార్ కె.రవిబాబు, ఇతర అధికారులు, పోలీసులు పరిశీలించి ఆయేషా సమాధిని గుర్తించారు. -
లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రీజనల్ కార్యదర్శి లింగయ్య మృతదేహానికి శుక్రవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. గత నెల 31న లింగయ్యను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ అత్యవసర ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు శుక్రవారం వేకువ జామున 3 గంటలకు లింగయ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ పర్యవేక్షణలో ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యులు సుమారు మూడు గంటల పాటు లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు గాంధీ మార్చురీ వద్దకు చేరుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజుల ఆధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా మోహరించారు. మీడియాను గాంధీ మార్చురీలోకి అనుమతించలేదు. పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మార్చురీ వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. పోలీసులపై విమలక్క, సంధ్య ఆగ్రహం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఐద్వా నేత సంధ్య పోలీసుల కళ్లు గప్పి రోగుల మాదిరిగా ఆటోల్లో ఆస్పత్రిలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి మార్చురీ వద్దకు వెళ్తున్న క్రమం లో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లింగయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం లింగయ్య మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలించారు. 17 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. విమలక్క, సంధ్య అరెస్టు అన్యాయం: రేణుకాచౌదరి లింగయ్య ఎన్కౌంటర్ సందర్భంగా శవాన్ని రీ–పోస్టుమార్టం చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యలను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని, అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. సామాజిక ఉద్యమకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పోలీసు కాల్పుల పేరుతో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో రేణుక పేర్కొన్నారు. -
శిరీష పలు విషయాలు వెల్లడించింది: సింధుశర్మ
పెద్దపల్లి: హైకోర్టు ఆదేశాల మేరకు మంథని మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు విచారణ అధికారి ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 60మందిని విచారణ జరిపినట్లు ఆమె సోమవారమిక్కడ పేర్కొన్నారు. మధుకర్ కేసులో కీలకమైన శిరీషను విచారణ చేశామని, ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సింధుశర్మ తెలిపారు. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా అన్ని వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య మధుకర్ మృతదేహానికి సోమవారం రీ పోస్టుమార్టం జరుపుతున్నారు. కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో కుటుంబసభ్యుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియా వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పోలీసులు దీనిపై నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించనున్నారు. కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ 14వ తేదీన శవమై కనిపించగా, దీన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబీకులు మాత్రం అది ముమ్మాటీకి హత్యేనని ఆరోపించారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలిపారు. మధుకర్, శిరీష ప్రేమపెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని, ఈ నేపథ్యంలో మధుకర్ హత్య జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
మధుకర్ మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం
సాక్షి, పెద్దపల్లి: మంథని మధుకర్ మృతదేహానికి హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రీపోస్టుమార్టం జరగనుంది. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ఖననం చేసిన చోట అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ పోస్టుమార్టం జరపనున్నారు. ఈ కేసులో సోషల్ మీడియాలో జరిగిన.. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు.. మధుకర్ కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కళాశాల చెందిన నిపుణుల సమక్షంలో ఈ నెల 7న రీపోస్టుమార్టం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ప్రభావితం చేస్తారని, వీరు చేయించే రీపోస్టుమార్టంపై నమ్మకం లేదని మధుకర్ తల్లి లక్ష్మి ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించింది. జడ్జి, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరపాలనే ఆమె అభ్యర్థనకు కోర్టు సమ్మతిస్తూ రీపోస్టుమార్టం జరపాలని ఆదేశించింది. దీంతో 10వ తేదీ ఉదయం 8 గంటలకు రీపోస్టుమార్టం చేయనున్నారు. కరీంనగర్ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అక్కడికి మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యను అనుమతించనున్నారు. -
మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం
-
మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం
తహసీల్దార్‌కు నివేదించిన పోలీస్‌శాఖ - కాల్‌డేటా ఆధారంగా విచారణ ప్రారంభించిన ఏసీపీ - చనిపోయే ముందురోజు వెంకటాపూర్‌కు వెళ్లిన మధుకర్ సాక్షి, పెద్దపల్లి: ప్రేమ వ్యవహారంలో అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం చేయించాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమిం చినందుకే అతడి మర్మాంగాలు కోసి, కళ్లు పీకి దారుణంగా హత్యచేశారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి.. దళిత, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు చేస్తున్న ఆందోళనలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు పోలీస్‌శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రీ–పోస్టుమార్టం కోసం మంథని తహసీల్దార్‌కు సోమవారం నివేదించినట్టు డీసీపీ కె.విజేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో రీ–పోస్టుమార్టం జరిపించనున్నారు. ముందురోజు వెంకటాపూర్‌కు.. మృతదేహం దొరికిన మార్చి 14కు ముందురోజు (13న) మధుకర్ వెంకటాపూర్‌కు వెళ్లినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఖానాపూర్‌కు చెందిన వ్యక్తే మ«ధుకర్ను మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి.. యువతి తల్లిదండ్రులకు అప్పగించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు మధుకర్ ఇంటికి రాలేదని అంటున్నారు. కాగా, 14వ తేదీన సదరు యువతి ఫోన్ చేయగా.. మధుకర్ సోదరుడు సమ్మయ్య లిఫ్ట్ చేశాడని, మధు కోసం వాకబు చేసి.. మీఇంటి పక్కనే ఉన్న కాలువ పక్కన వెతకమని చెప్పిందని చెబుతున్నారు. ఆ యువతి.. గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెప్పిన చోటే మధుకర్ మృతదేహం దొరికిందని చెబుతున్నారు. ఇంటికి వెళ్లాక ఏమైంది..? వెంకటాపూర్‌కు వెళ్లిన మధుకర్ తాను ప్రేమించిన యువతిని కలిసిన తర్వాత ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారా..? లేకపోతే.. ఖానాపూర్ శివారులోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారా..? అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఆ యువతి కూడా క్రిమిసంహారక మందు తాగడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి మధుకర్‌ను దూషించినట్టు యువతి మేజిస్ట్రేట్ ఎదుట చెప్పినట్టు పోలీసుల సమాచారం. కాల్ డేటా ఆధారంగా విచారణ మధుకర్ మృతిపై పెద్దపల్లి ఏసీపీ సింధూ శర్మ సోమవారం విచారణ ప్రారంభించారు. మధుకర్ మృతదేహం దొరికిన మంథని మండలం ఖానాపూర్ శివారులోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 20 మీటర్ల దూరంలో లభించిన క్రిమిసంహారక మందు డబ్బా, మధుకర్ కర్చీఫ్, చున్నీని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం ఖానాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మధుకర్ కుటుంబ సభ్యు ల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. మధుకర్ సెల్ నంబరు, అతను ప్రేమించిన యువతి సెల్‌నంబర్ల కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆగని ఆందోళనలు మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మంథనిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీఎస్ కృష్ణ, అంబేడ్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, కేవీపీఎస్ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మంథనిలో అంబేడ్కర్ చౌరస్తాలో అరగంటపాటు మౌనదీక్ష చేశారు. వారు చెబితేనే మృతదేహం దొరికింది ఆ యువతి నా సెల్కే ఫోన్ చేసింది. మధు ఉన్నడా..? అని అడిగి... మీ ఇంటి వెనకాల ఉన్న కాలువ పక్కన చూడమని చెప్పింది. మేం వెళ్లి వెతికి నా దొరకలేదు. చివరకు మా ఊరికి చెందిన ఓ వ్యక్తిని గట్టిగా నిలదీస్తే సబ్‌స్టేషన్ పక్కన వెతకమని చెప్పిండు. మొగిలి అనే వ్యక్తి మధుకర్ మృతదేçహాన్ని ఫలానా దగ్గర చూడమని చెప్పడంతో వెళ్లాం. కొట్టి చంపి వేశారు కాబట్టే అక్కడ ఉందని చెప్పిండ్రు. –సమ్మయ్య, మృతుడి సోదరుడు ఎంత చెప్పినా సీఐ వినలే... మా గ్రామానికి చెందిన ఐదుగురు, అమ్మాయి తండ్రి కలిసి నా కొడుకును దారుణంగా కొట్టి చంపేసిండ్రు. ఒళ్లంతా గాయాలే ఉన్నాయి. పళ్లు కూడా ఊడిపోయాయి. నోట్లోమట్టి పోసిండ్రు. ఒళ్లంతా గాయాలున్నాయని సీఐకి చెప్పినా వినలే. మమ్ములను నోరు ఎత్తనీయలే. మా ఊరికి చెందిన వ్యక్తే మోటార్ సైకిల్‌పై నా కొడుకును తీసుకుపోయిండు. వీరందరిని అరెస్టు చేస్తేనే నా కొడుకు ఆత్మ శాంతిస్తది. –మంథని లక్ష్మీ, మృతుడి తల్లి హత్య కేసు తరహాలో దర్యాప్తు మధుకర్ మృతిని దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ అధికారి సింధూశర్మను నియమించాం. హత్యకేసు తరహాలోనే దర్యాప్తు చేస్తున్నాం. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులోని ప్రతీ అంశాన్ని వీడియో తీయిస్తున్నాం. హత్య అయినట్లు ఆధారాలు లభించగానే మధుకర్ కుటుంబసభ్యు లు చెప్పినట్టు ఆ ఆరుగురిని అరెస్టు చేస్తాం. రీ–పోస్టుమార్టం కూడా చేయిం చాలని నిర్ణయించాం. –కె.విజేందర్‌రెడ్డి, డీసీపీ, పెద్దపల్లి -
రీ పోస్టు రీ పోస్టుమార్టం
వేలూరు: శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో కణ్ణమంగళం ప్రాంతానికి చెందిన మునస్వామి, మూర్తి, మహేంద్రన్, పెరుమాల్, శశికుమార్, మురుగన్ ఉన్నారు. ఈ ఆరు మృత దేహాలకు రీ పోస్టు మార్టం నిర్వహించాలని బాధిత కుటుం బాలు డిమాండ్ చేశాయి. మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాల్ మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఆరు మృత దేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పరచాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు రీ పోస్టుమార్టంపై ఆంధ్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా లేక గాంధీ ఆస్పత్రి ైవె ద్య నిపుణుల బృందంతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని శుక్రవారం సాయంత్రం హైకోర్టు తీర్పునిచ్చింది. అదే విధంగా రీ పోస్టు మార్టం రిపోర్టును ఈనెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. డాక్టర్ల బృందం రాక రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆంధ్ర రాష్ర్టం నుంచి డాక్టర్ల బృందం చెన్నై విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి కారులో తిరువణ్ణామలై చేరుకున్నారు. అప్పటికే తిరువణ్ణామలై ఆస్పత్రిలోని ఆరు మృత దేహాలను రీ పోస్టు మార్టం కోసం కలెక్టర్ జ్ఞానశేఖరన్ అధ్యక్షతన సిద్ధం చేసి ఉంచారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు ధర్బుద్దీన్ ఖాన్, అబిజిత్ గుప్తార్, రమణ మూర్తిని చెన్నై విమానాశ్రయం నుంచి పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తిరువణ్ణామలైకి తీసుకొచ్చారు. ఇంతకు ముందు తిరుపతిలో ఆరు మృత దేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన తిరుపతికి చెందిన డాక్టర్లు ఇంద్రాణి, రామ్మోహన్, ఎస్ ఎన్‌రావు, సాయి ప్రసాద్, భాస్కర్, నాగరాజు, దుర్గాప్రసాద్, పి ఆర్ జి మోహన్‌తో పాటు మొత్తం 12 మంది డాక్టర్ల బృందం కూడా తిరువణ్ణామలై చేరుకుంది. వీరిని తిరువణ్ణామలై జిల్లా సరిహద్దు నుంచి పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ డాక్టర్ల బృందం ప్రభుత్యాసుపత్రిలో ఉన్న ఆరు మృత దేహాల వద్దకు వెళ్లి రీ పోస్టుమార్టం నిర్వహించింది. దీన్ని వీడియోలో చిత్రీకరించారు. తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతోపాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. రీ పోస్టుమార్టం పూర్తి తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రిలో రీ పోస్టుమార్టం ప్రక్రియ శనివారం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. రాత్రి 8 గంటల తరువాత సంబంధిత కుటుం బ సభ్యుల సంతకాలు తీసుకుని కలెక్టర్ సమక్షంలో మృతదేహాలను వారికి అప్పగించారు. ఆస్పత్రి పరిసరాల్లో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పటిష్ట పోలీస్ బందోబస్తు తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రి శనివారం ఉదయం నుంచి పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. అదే విధంగా మార్చురీ వద్ద సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల బంధువులను ఎవరినీ లోనికి అనుమతించలేదు. పది రోజులు భద్ర పరిచిన మృతదేహాలు తిరుపతిలోని అడవిలో కూలీలపై ఎన్కౌంటర్ ఈనెల 7న జరిగితే, మృతదేహాలను 9వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో భద్ర పరిచారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు భద్ర పరిచారు. ఈ మృత దేహాలను చెన్నైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృత దేహాలను చెన్నైకి తీసుకెళ్లే పరిస్థితి లేనందున డాక్టర్ల బృందం తిరువణ్ణామలైలోనే రీ పోస్టుమార్టం నిర్వహించింది.