మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం
తహసీల్దార్‌కు నివేదించిన పోలీస్‌శాఖ
- కాల్‌డేటా ఆధారంగా విచారణ ప్రారంభించిన ఏసీపీ
- చనిపోయే ముందురోజు వెంకటాపూర్‌కు వెళ్లిన మధుకర్
సాక్షి, పెద్దపల్లి: ప్రేమ వ్యవహారంలో అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం చేయించాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమిం చినందుకే అతడి మర్మాంగాలు కోసి, కళ్లు పీకి దారుణంగా హత్యచేశారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి.. దళిత, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు చేస్తున్న ఆందోళనలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు పోలీస్‌శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రీ–పోస్టుమార్టం కోసం మంథని తహసీల్దార్‌కు సోమవారం నివేదించినట్టు డీసీపీ కె.విజేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో రీ–పోస్టుమార్టం జరిపించనున్నారు.
ముందురోజు వెంకటాపూర్‌కు..
మృతదేహం దొరికిన మార్చి 14కు ముందురోజు (13న) మధుకర్ వెంకటాపూర్‌కు వెళ్లినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఖానాపూర్‌కు చెందిన వ్యక్తే మ«ధుకర్‌ను మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి.. యువతి తల్లిదండ్రులకు అప్పగించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు మధుకర్ ఇంటికి రాలేదని అంటున్నారు. కాగా, 14వ తేదీన సదరు యువతి ఫోన్ చేయగా.. మధుకర్ సోదరుడు సమ్మయ్య లిఫ్ట్ చేశాడని, మధు కోసం వాకబు చేసి.. మీఇంటి పక్కనే ఉన్న కాలువ పక్కన వెతకమని చెప్పిందని చెబుతున్నారు. ఆ యువతి.. గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెప్పిన చోటే మధుకర్ మృతదేహం దొరికిందని చెబుతున్నారు.
ఇంటికి వెళ్లాక ఏమైంది..?
వెంకటాపూర్‌కు వెళ్లిన మధుకర్ తాను ప్రేమించిన యువతిని కలిసిన తర్వాత ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారా..? లేకపోతే.. ఖానాపూర్ శివారులోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారా..? అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఆ యువతి కూడా క్రిమిసంహారక మందు తాగడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి మధుకర్‌ను దూషించినట్టు యువతి మేజిస్ట్రేట్ ఎదుట చెప్పినట్టు పోలీసుల సమాచారం.
కాల్ డేటా ఆధారంగా విచారణ
మధుకర్ మృతిపై పెద్దపల్లి ఏసీపీ సింధూ శర్మ సోమవారం విచారణ ప్రారంభించారు. మధుకర్ మృతదేహం దొరికిన మంథని మండలం ఖానాపూర్ శివారులోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 20 మీటర్ల దూరంలో లభించిన క్రిమిసంహారక మందు డబ్బా, మధుకర్ కర్చీఫ్, చున్నీని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం ఖానాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మధుకర్ కుటుంబ సభ్యు ల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. మధుకర్ సెల్ నంబరు, అతను ప్రేమించిన యువతి సెల్‌నంబర్ల కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఆగని ఆందోళనలు
మధుకర్ మృతదేహానికి రీ–పోస్టుమార్టం జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మంథనిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీఎస్ కృష్ణ, అంబేడ్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, కేవీపీఎస్ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మంథనిలో అంబేడ్కర్ చౌరస్తాలో అరగంటపాటు మౌనదీక్ష చేశారు.
వారు చెబితేనే మృతదేహం దొరికింది
ఆ యువతి నా సెల్‌కే ఫోన్ చేసింది. మధు ఉన్నడా..? అని అడిగి... మీ ఇంటి వెనకాల ఉన్న కాలువ పక్కన చూడమని చెప్పింది. మేం వెళ్లి వెతికి నా దొరకలేదు. చివరకు మా ఊరికి చెందిన ఓ వ్యక్తిని గట్టిగా నిలదీస్తే సబ్‌స్టేషన్ పక్కన వెతకమని చెప్పిండు. మొగిలి అనే వ్యక్తి మధుకర్ మృతదేçహాన్ని ఫలానా దగ్గర చూడమని చెప్పడంతో వెళ్లాం. కొట్టి చంపి వేశారు కాబట్టే అక్కడ ఉందని చెప్పిండ్రు. –సమ్మయ్య, మృతుడి సోదరుడు
ఎంత చెప్పినా సీఐ వినలే...
మా గ్రామానికి చెందిన ఐదుగురు, అమ్మాయి తండ్రి కలిసి నా కొడుకును దారుణంగా కొట్టి చంపేసిండ్రు. ఒళ్లంతా గాయాలే ఉన్నాయి. పళ్లు కూడా ఊడిపోయాయి. నోట్లోమట్టి పోసిండ్రు. ఒళ్లంతా గాయాలున్నాయని సీఐకి చెప్పినా వినలే. మమ్ములను నోరు ఎత్తనీయలే. మా ఊరికి చెందిన వ్యక్తే మోటార్ సైకిల్‌పై నా కొడుకును తీసుకుపోయిండు. వీరందరిని అరెస్టు చేస్తేనే నా కొడుకు ఆత్మ శాంతిస్తది.
–మంథని లక్ష్మీ, మృతుడి తల్లి
హత్య కేసు తరహాలో దర్యాప్తు
మధుకర్ మృతిని దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ అధికారి సింధూశర్మను నియమించాం. హత్యకేసు తరహాలోనే దర్యాప్తు చేస్తున్నాం. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులోని ప్రతీ అంశాన్ని వీడియో తీయిస్తున్నాం. హత్య అయినట్లు ఆధారాలు లభించగానే మధుకర్ కుటుంబసభ్యు లు చెప్పినట్టు ఆ ఆరుగురిని అరెస్టు చేస్తాం. రీ–పోస్టుమార్టం కూడా చేయిం చాలని నిర్ణయించాం.
–కె.విజేందర్‌రెడ్డి, డీసీపీ, పెద్దపల్లి