కార్యకలాపాల విస్తరణలో ఎన్సీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్, విజయవాడలో అదనంగా రెడీ-మిక్స్ కాంక్రీట్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రూ. 195 కోట్ల ఆదాయంపై రూ. 12 కోట్ల లాభం నమోదు చేసింది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ. 178 కోట్లు కాగా లాభం రూ. 19 కోట్లు. నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లు సమీకరించగా, ఇందులో రూ. 103 కోట్లను రుణాల చెల్లింపునకు వినియోగించినట్లు పేర్కొంది. మధ్యంతర డివిడెండు రూ. 1తో కలిపి పూర్తి ఆర్థిక సంవత్సరానికి షేరు ఒక్కింటిపై రూ. 2 మేర తుది డివిడెండు ప్రకటించింది.