Real Estate Developers Association of India
-
ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్ మెటీరియల్స్ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సర్వే అంశాలు ► 60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు. ► ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది. ► 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ► నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. ► 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు. ► 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి ‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు. -
క్రెడాయ్ న్యాట్‌కాన్‌కు 1300 మంది హాజరు
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 19వ న్యాట్‌కాన్ సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఇజ్రాయిల్‌లో జరగనున్న న్యాట్‌కాన్‌కు 1300 మంది డెవలపర్లు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 200 మందికి పైగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 71 మంది డెవలపర్లు పాల్గొననున్నారని న్యాట్‌కాన్ కన్వీనర్ గుమ్మి రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. న్యాట్‌కాన్ పూర్తి విశేషాలు ఆయన మాటల్లోనే.. ►ప్రతి ఏడాది క్రెడాయ్ ఇండియా వెలుపల ఏదో ఒక దేశంలో న్యాట్‌కాన్‌ను నిర్వహిస్తుంటుంది. ఇప్పటివరకు 18 న్యాట్కాన్స్ జరిగాయి. టెల్ అవీవ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో జరగనున్న 19వ న్యాట్‌కాన్ సదస్సును క్రెడాయ్ తెలంగాణ నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రం న్యాట్‌కాన్‌ను నిర్వహించడం ఇదే ప్రప్రథమం. సదస్సును విదేశాల్లో నిర్వహించడానికి అసలు ఉద్దేశం.. ఆయా దేశాల్లోని స్థానిక నిర్మాణ పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం, వ్యాపార అవకాశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటమే! చిన్న డెవలపర్లుకు మంచి అవకాశం.. ఈ సదస్సులో డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటాయి. 25 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొని నిర్మాణ రంగం తీరుతెన్నుల మీద ప్రసంగిస్తారు. ఈసారి క్రెడాయ్ న్యాట్‌కాన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. చిన్న డెవలపర్లు కూడా పాల్గొనేందుకు వీలుగా నమోదు రుసుమును తగ్గించాం. దీంతో సదస్సులో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటూ నెట్‌వర్కింగ్‌ను పెంచుకునే వీలుంటుంది. రియల్ ఎస్టేట్ ఫైనాన్స్, మార్కెటింగ్, భవిష్యత్తు వ్యాపార అవకాశాలను తెలుసుకోవచ్చు కూడా. న్యాట్‌కాన్ ఏర్పాట్లలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్, క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ యూత్ చాప్టర్లు బాగా సహకరిస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో ఎందుకంటే? న్యాట్‌కాన్ సదస్సుకు ఇజ్రాయిల్‌ను ఎందుకు ఎంపిక చేశామంటే? వ్యర్ధాల నిర్వహణ, పునర్వినియోగం, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) వంటి నిర్వహణలో ఇజ్రాయిల్ ముందు వరసులో ఉంది. పైగా వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సముద్రపు నీటిని మంచినీటిగా శుద్ధి చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది కూడా. ఆయా నిర్వహణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా, క్షుణ్నంగా తెలుసుకునే వీలుంటుందని ఇజ్రాయిల్‌ను ఎంచుకున్నామని న్యాట్‌కాన్ కో–కన్వినర్ రామచంద్రారెడ్డి తెలిపారు. -
నేడు క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి స్థిరాస్తి ప్రదర్శనకు భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) సిద్ధమైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తారని క్రెడాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 31 వరకు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో సుమారుగా 150 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటారు. దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.2.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల వివరాలను అందజేస్తారు. ఈ ప్రాపర్టీ షోలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. -
‘రీట్స్’ సరికొత్త పెట్టుబడి సాధనం!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు.. రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులు.. అయినా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం సా....గుతోంది. కాకపోతే కొనుగోలుదారులే మందగించారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి కొత్త ఊపిరినందించింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్. ఈ బడ్జెట్లో కొత్తగా రియల్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్స్)ను ప్రతిపాదించారు. అసలు రీట్స్ అంటే ఏంటి? పెట్టుబడులు ఎలా పెడతారు? వంటి అనేక అంశాలను భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే.. ‘రీట్’ మనకు పెద్దగా పరిచయం లేని పెట్టుబడి సాధనం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రీట్స్‌తో మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చన్నమాట. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే.. దీనికీ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. స్థానికులైనా, ప్రవాసులైనా కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ సైజు రూ.లక్షగా నిర్ణయించారు. మార్కెట్ అభివృద్ధి చెందిన తర్వాత అందరికీ అవకాశం కల్పిస్తారు. బంగారంపై అధిక పెట్టుబడి పెట్టేవారికి ‘రీట్’ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు. కొనాలంటే 110%.. అమ్మాలంటే 90% రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందుపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. డబ్బులే డబ్బులు.. మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను వర్తించదు. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు. డెవలపర్లకూ ప్రయోజనమే.. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించవు. కేవలం నివాస సముదాయాలకే ప్రాధాన్యమిస్తాయి. ఈ నేపథ్యంలో రీట్లకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. రీట్స్‌తో డెవలపర్లకూ ప్రయోజనమే. అభివృద్ధి చేసిన ఆస్తులను రీట్లుగా సులువుగా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 6 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. లీజులకు ఇవ్వాల్సిన ఆఫీసు స్థలాన్ని త్వరగా సొమ్ము చేసుకోవచ్చు. దీనిపై ఎంతలేదన్నా పది శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కేవలం ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుందని భావించే నిపుణులూ లేకపోలేరు. ఏదేమైనా నగదు కొరతతో అల్లాడుతున్న డెవలపర్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది.