
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 19వ న్యాట్‌కాన్ సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఇజ్రాయిల్‌లో జరగనున్న న్యాట్‌కాన్‌కు 1300 మంది డెవలపర్లు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 200 మందికి పైగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 71 మంది డెవలపర్లు పాల్గొననున్నారని న్యాట్‌కాన్ కన్వీనర్ గుమ్మి రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. న్యాట్‌కాన్ పూర్తి విశేషాలు ఆయన మాటల్లోనే..
►ప్రతి ఏడాది క్రెడాయ్ ఇండియా వెలుపల ఏదో ఒక దేశంలో న్యాట్‌కాన్‌ను నిర్వహిస్తుంటుంది. ఇప్పటివరకు 18 న్యాట్‌కాన్స్ జరిగాయి. టెల్ అవీవ్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌లో జరగనున్న 19వ న్యాట్‌కాన్ సదస్సును క్రెడాయ్ తెలంగాణ నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రం న్యాట్‌కాన్‌ను నిర్వహించడం ఇదే ప్రప్రథమం. సదస్సును విదేశాల్లో నిర్వహించడానికి అసలు ఉద్దేశం.. ఆయా దేశాల్లోని స్థానిక నిర్మాణ పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం, వ్యాపార అవకాశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటమే!
చిన్న డెవలపర్లుకు మంచి అవకాశం..
ఈ సదస్సులో డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటాయి. 25 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొని నిర్మాణ రంగం తీరుతెన్నుల మీద ప్రసంగిస్తారు. ఈసారి క్రెడాయ్ న్యాట్‌కాన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. చిన్న డెవలపర్లు కూడా పాల్గొనేందుకు వీలుగా నమోదు రుసుమును తగ్గించాం. దీంతో సదస్సులో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటూ నెట్‌వర్కింగ్‌ను పెంచుకునే వీలుంటుంది. రియల్ ఎస్టేట్ ఫైనాన్స్, మార్కెటింగ్, భవిష్యత్తు వ్యాపార అవకాశాలను తెలుసుకోవచ్చు కూడా. న్యాట్‌కాన్ ఏర్పాట్లలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్, క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ యూత్ చాప్టర్లు బాగా సహకరిస్తున్నాయి.
ఇజ్రాయిల్‌లో ఎందుకంటే?
న్యాట్‌కాన్ సదస్సుకు ఇజ్రాయిల్‌ను ఎందుకు ఎంపిక చేశామంటే? వ్యర్ధాల నిర్వహణ, పునర్వినియోగం, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీ) వంటి నిర్వహణలో ఇజ్రాయిల్ ముందు వరసులో ఉంది. పైగా వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సముద్రపు నీటిని మంచినీటిగా శుద్ధి చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది కూడా. ఆయా నిర్వహణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా, క్షుణ్నంగా తెలుసుకునే వీలుంటుందని ఇజ్రాయిల్‌ను ఎంచుకున్నామని న్యాట్‌కాన్ కో–కన్వినర్ రామచంద్రారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment