ఇజ్రాయెల్ పరిజ్ఞానంపై భారత్ ఆశలు
ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాలకు కీలకం కానుంది. అంతర్జాతీయంగా మిత్రదేశాల అవసరంతో పాటు తన ఆర్థికవ్యవస్థను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్‌కు భారత్ అవసరం ఎంతో ఉంది. రక్షణ, వ్యవసాయ ఇతర రంగాలకు సంబంధిం చి ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు రెండు దేశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. యూదు దేశమైన ఇజ్రాయెల్‌ను 1950, సెప్టెంబర్ 17న భారత్ గుర్తించింది.
1992లో రెండుదేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని.. ఎంబసీలు ఏర్పడ్డాయి.రష్యా తర్వాత ఇజ్రాయెల్ ఆయుధాల్ని భారత్ అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. ఇందులో వివిధ ఆయుధ వ్యవస్థలు, క్షిపణులు, మానవరహిత విమానాలు ఉన్నాయి. చైనా–పాకిస్తాన్‌ల మధ్య రక్షణ బంధం నేపథ్యంలో... అప్రమత్తమైన భారత్ 250 బిలియన్ డాలర్ల వ్యయంతో ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున క్షిపణుల్ని కొనుగోలు చేయనుందని సమాచారం.
స్పైక్ క్షిపణులు, బరాక్–8 క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం లభించింది. ముడిచమురు, ఇతర విషయాల్లో అరబ్ దేశాలతో వాణిజ్య సంబంధాల కోసం ఇంతవరకూ ఇజ్రాయెల్‌ను భారత్ వ్యతిరేకిస్తూ వచ్చింది.అయితే మెరుగైన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తిని మూడింతలు పెంచవచ్చనే అంచనాతో తాజాగా సంబంధాలు బలపడ్డాయి. ఇజ్రాయెల్‌లో డ్రిప్ ఇరిగేషన్, ఫార్మా స్యూటికల్స్ తదితరరంగాల్లో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
బాలీవుడ్, ఇతర ప్రాంతీయ భాషా సినిమాల చిత్రీకరణకు రాయితీలు కల్పించి పర్యాటక ఆదాయం పెంచుకోవాలని ఇజ్రాయెల్ భావి స్తోంది. నీటిపారుదల, వ్యవసాయం సహా పలు రంగాల్లో ఉమ్మడి సహకారం, మేకిన్ ఇండియాలో భాగస్వామ్యంపై ఆ దేశం ఆసక్తిగా ఉంది. నీటి సాంకేతికను ఇజ్రాయెల్ సమర్థవంతంగా వాడుకుంటోంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి సాగు రం గానికి వాడుకుంటోంది. కట్ డైమండ్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానం. దేశ భూభాగంలో కేవలం 20 శాతమే సాగు భూమి ఉన్నా.. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ విధానాలతో మార్గదర్శకంగా నిలిచింది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్