‘రీట్స్’ సరికొత్త పెట్టుబడి సాధనం!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు.. రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులు.. అయినా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం సా....గుతోంది. కాకపోతే కొనుగోలుదారులే మందగించారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి కొత్త ఊపిరినందించింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్. ఈ బడ్జెట్‌లో కొత్తగా రియల్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్స్)ను ప్రతిపాదించారు. అసలు రీట్స్ అంటే ఏంటి? పెట్టుబడులు ఎలా పెడతారు? వంటి అనేక అంశాలను భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే..
‘రీట్’ మనకు పెద్దగా పరిచయం లేని పెట్టుబడి సాధనం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రీట్స్‌తో మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చన్నమాట. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది.
ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే.. దీనికీ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. స్థానికులైనా, ప్రవాసులైనా కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ సైజు రూ.లక్షగా నిర్ణయించారు. మార్కెట్ అభివృద్ధి చెందిన తర్వాత అందరికీ అవకాశం కల్పిస్తారు. బంగారంపై అధిక పెట్టుబడి పెట్టేవారికి ‘రీట్’ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు.
కొనాలంటే 110%.. అమ్మాలంటే 90%
రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్‌ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందుపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది.
డబ్బులే డబ్బులు..
మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను వర్తించదు. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది.
ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు.
డెవలపర్లకూ ప్రయోజనమే..
సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించవు. కేవలం నివాస సముదాయాలకే ప్రాధాన్యమిస్తాయి. ఈ నేపథ్యంలో రీట్లకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. రీట్స్‌తో డెవలపర్లకూ ప్రయోజనమే. అభివృద్ధి చేసిన ఆస్తులను రీట్లుగా సులువుగా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 6 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది.
మరో ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. లీజులకు ఇవ్వాల్సిన ఆఫీసు స్థలాన్ని త్వరగా సొమ్ము చేసుకోవచ్చు. దీనిపై ఎంతలేదన్నా పది శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కేవలం ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుందని భావించే నిపుణులూ లేకపోలేరు. ఏదేమైనా నగదు కొరతతో అల్లాడుతున్న డెవలపర్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది.