రికార్డ్ పోలింగ్
కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం.. 27 ఏళ్లలో రికార్డ్
జార్ఖండ్‌లో 66.03 శాతం.. రాష్ట్ర చరిత్రలో రికార్డ్
రెండు రాష్ట్రాలలో ఐదో విడతతో ముగిసిన ఎన్నికలు
శ్రీనగర్/రాంచి/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు శనివారంతో ముగిసిన ఐదు దశల ఎన్నికల్లో చరిత్రాత్మకంగా, కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్ ఐదు విడతల పోలింగ్‌లో గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రీతిలో 66 శాతం పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో ఐదు దశల్లో 66.03 శాతం ఓటింగ్ నమోదైంది. చివరిదైన ఐదవ దశ పోలింగ్‌లో ఏకంగా 71.26 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జార్ఖండ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కశ్మీర్లో ఐదో దశ ఎన్నికల్లో జమ్మూ, క తువా, రాజౌరీ జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో ఏకంగా 76 శాతం ఓటింగ్ నమోదైంది. గడ్డకట్టించే చలిని కూడా లెక్కచేయకుండా జనం ఓటుహక్కు వినియోగించుకున్నారు. వేర్పాటు వాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును, సరిహద్దులో ఉగ్రవాదుల దాడులను లెక్కచేయకుండా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాజౌరీ జిల్లాలోని చౌదరీ ఖార్ గ్రామానికి చెందిన 110 ఏళ్ల వయోవృద్ధుడు మున్షీ ఖాన్ ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. కాగా, కతువా జిల్లాలో బీజేపీ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి, కశ్మీర్ మంత్రి మనోహర్ లాల్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు రాజీందర్ సింగ్ అనే స్వతంత్ర అభ్యర్థిపై కూడా కేసు నమోదైంది.
గతనెల 25న మొదలైన కశ్మీర్ ఐదుదశల ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ వినోద్ జుత్షి తెలిపారు. 1987 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ, తాజా పోలింగ్ కంటే తక్కువ శాతమే ఓటింగ్ జరిగింద న్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 61.62 శాతం, 2002లో 43.09 శాతం ఓటింగ్ నమోదైందని, 2004 లోక్‌సభ ఎన్నికల్లో 35.20 శాతం, 2009లో 39.67 శాతం, 2014లో 50.23 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు ముందస్తుగాగానీ, ఎన్నికల్లో గానీ ప్రాణనష్టమే జరగలేదని చెప్పారు. ఐదవ దశలో కశ్మీర్ ఉపముఖ్యమంత్రి తారాచంద్, నలుగురు మంత్రివర్గ సహచరులు సహా 312 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇక జార్ఖండ్ ఐదవదశలో 16 నియోజకవర్గాల్లో 71.26 శాతం పోలింగ్ నమోదైందని, ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా చెప్పారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, స్పీకర్ శశాంక్ శేఖర్ భోక్తా, మంత్రి లోబిన్ హెంబ్రోమ్ తదితరుల భవితవ్యం ఐదవ దశలో తేలనుంది.
కశ్మీర్లో సర్పంచ్ కాల్చివేత
జమ్మూకశ్మీర్‌లో ఓ గ్రామ సర్పంచ్‌ను మిలిటెంట్లు శనివారం కాల్చిచంపారు. బారాముల్లా జిల్లా బోమై గ్రామ సర్పంచ్ గులామ్ అహ్మన్ భట్(65)పై గ్రామంలోని మెయిన్ చౌక్ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిగా తరలించగా.. బుల్లెట్ గాయాలతో తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు.