మహాపతనం నుంచి తెప్పరిల్లిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మహా పతనం నుంచి భారీగా తెప్పరిల్లాయి. కరెన్సీ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం, ట్రంప్ ఆధిక్యంతో తొలుత కనిపించిన ఆందోళనలు చల్లారి, నష్టాలను పరిమితం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల్లో అనిశ్చితి తొలగిపోవడంతో దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా కోలుకుని సెన్సెక్స్ 339 నష్టంతో 27,252 వద్ద, నిఫ్టీ 112 నష్టంతో 8432 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో ఫార్మ రంగంలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
రియల్టీ 11 శాతం కుప్పకూలగా, పీఎస్‌యూ దాదాపు 2 శాతం లాభపడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలకూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు ఆకర్షణీయమైన ఫలితాలతో లుపిన్ భారీగా లాభపడింది. ఇదే బాటలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, స్టేట్‌బ్యాంక్, జీ లాభపడగా, అంబుజా, హీరో మోటో, టెక్ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్, టీసీఎస్, ఏసీసీ, హిందాల్కో, టాటా పవర్, బెల్ నష్టపోయినవాటిల్లో ఉన్నాయి.
అటు డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ కూడా భారీగా కోలుకుంది. 12 పైసల నష్టంతో 66.50 వద్ద వుంది. పసిడి పది గ్రా.లు 555 రూపాయల లాభంతో రూ. 30, 435వద్ద ఉంది.