ఆపద్బంధువు.. రెడ్‌క్రాస్ సొసైటీ
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. మనిషి ప్రాణం నిలబెట్టేందుకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనా.. సేవే పరమార్థంగా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని రకాల సేవలందిస్తూ ఆపద్భంధువుగా నిలుస్తోంది ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ. రాష్ట్రంలో 1956లో ఆవిర్భవించింది. జిల్లాలో మొదటిసారిగా మంచిర్యాల డివిజన్ పరిధిలో 2006లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్(రక్త నిధి)ను 2008 డిసెంబర్ 4న మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభించారు. సొసైటీలో 1500 మందికి పైగా శాశ్వత సభ్యులు ఉన్నారు. సొసైటీ ద్వారా ఇప్పటివరకు 291 రక్తదాన శిబిరాలు నిర్వహించి 21,148 యూనిట్ల రక్తం సేకరించారు. ఇందులో 20,462 యూనిట్ల రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో అందజేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తమార్పిడి చేసుకునే వారికి, నిరుపేదలకు ఉచితంగా రక్తం అందజేస్తారు. 350 మిల్లీలీటర్ల రక్తానికి ప్రస్తుతం 1,450 తీసుకుంటారు.
సేవలు..
మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మూడు రకాలుగా సేవలందిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం, శ్రీశ్రీనగర్ ప్రాంతంలో ఎకరం స్థలంలో అనాథ, వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేశారు. 25 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ఆరు నుంచి 14ఏళ్లలోపు పిల్లలకు ఉచిత వసతి, విద్య, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. వృద్ధాశ్రమ భవన నిర్మాణం ఇటీవల పూర్తయింది. త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సర్వే ప్రకారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం ఉత్తమ బ్లడ్ బ్యాంక్‌గా ఎంపికైంది.