Red Hills
-
విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) భవనంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ నిర్వహించనుంది. 2022–23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం తెలిసిందే. బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది. -
మరో రెండు సుందర గిరులు
వుడా చేతికి శీతకొండ, ఎర్రకొండ ఆ రెండింటిపై పర్యాటక హంగులు చిన్న పట్టణాల రోడ్లు విస్తరణ మీట్ ది ప్రెస్‌లో బాబూరావునాయుడు విశాఖపట్నం సిటీ : నగరంలోని శీతకొండ, ఎర్రకొండలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావు నాయుడు అన్నారు. వీజేఎఫ్ ఓ హోటల్లో గురువారం నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ విదేశీ సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాభివృద్ధికి మలేషియా, అమెరికా వంటి దేశాలు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమయాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయిస్తున్నట్టు వెల్లడించారు. వుడా చిల్డ్రన్స్ థియేటర్ పెండింగ్ పనులకు ఒకే టెండర్ దాఖలవడంతో ఆ కాంట్రాక్టు పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని కొత్త టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయో లేదో పరిశీలించే పనిని చేపట్టినట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల చిన్నచిన్న తప్పిదాలున్నట్టు గమనించామన్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్‌తో రోడ్లు వెళ్లాలనేది ప్రజలందరికీ తెలిసేలా త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు గమనించి అందుకు తగ్గట్టుగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. వుడా కార్యాలయం ధనవంతులకే అన్న అపవాదు పోయేలా పేదలకు అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే పేదల కోసం మంచి ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. భూసంబంధ అంశాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారని గుర్తు చేశారు. విద్యా వంతులు సైతం లే అవుట్ల నిర్వాహకుల మాయలో పడి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. అందుకే ప్రజలంద రికీ ఎల్పీలపై అవగాహన కలిగేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వుడా పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తుని వంటి పట్టణాల్లో నగర రోడ్లను త్వరలో విస్తరిస్తామని ప్రకటించారు. ఆయా పట్టణాల్లో ఇరుకు రోడ్లే ఇప్పటికీ ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నాయని అందుకే మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. వుడాలో గతంలో జరిగిన కుంభకోణాలన్నీ న్యాయ పరిధిలో ఉన్నందున వాటిపై తనను ప్రశ్నించవద్దని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావుతో పాటు కార్యవర్గం పాల్గొంది. -
నిలోఫర్‌లో ‘వన్ స్టాప్ క్రైసెస్ సెల్’
మహిళా బాధితుల కోసం సింగిల్ విండో వారి వద్దకే అన్ని విభాగాల అధికారులు నెల రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభం హైదరాబాద్ కలెక్టర్ ముకేష్ కుమార్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: లైంగికదాడి వంటి నేరాల బారిన పడిన మహిళలు ప్రస్తుతం ఫిర్యాదు, వైద్య పరీక్షలు, న్యాయసహాయం, ఆర్థికసాయం, ఆవాసం ఇలా ఒక్కో సేవ కోసం ఒక్కో విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారితో పాటు బంధువులు అనేక కష్టనష్టాల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా అందుబాటులోకి రానున్నదే ‘వన్ స్టాప్ క్రైసెస్ సెల్’. స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల చేసిన ప్రతిపాదనల మేరకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ ప్రకటించారు. రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మహిళల భద్రత అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. అధికారుల వద్దకు బాధితులు కాకుండా బాధితుల వద్దకు అధికారులు వెళ్లేందుకే ఈ ఏర్పాటని వెల్లడించారు. సెల్ విధి విధానాలివి.. నిలోఫర్ ఆస్పత్రిలోని ఓ గదిని సెల్ ఏర్పాటు కోసం కేటాయించారు. స్వచ్ఛంద సంస్థ/మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ప్రతినిధులు అన్ని వేళల్లోనూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఈ సెల్‌ను ఆశ్రయించిన వెంటనే ప్రాథమిక సమాచారం సేకరించి సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తారు. పోలీసులే స్వయంగా సదరు సెల్‌కు వెళ్లి ఫిర్యాదు స్వీకరణ, ఎఫ్ఐఆర్ జారీ వంటివి చేపడతారు. సెల్ నిర్వాహకుల సాయంతో బాధితురాలికి అక్కడే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయిస్తారు. దాని ప్రతినిధులే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించి బాధితురాలికి న్యాయసహాయం అందేలా చర్యలు తీసుకుంటారు. చట్ట ప్రకారం బాధితురాలికి అందించాల్సిన ఆర్థిక సాయాన్నీ రెవెన్యూ విభాగం నుంచి తక్షణం మంజూరు అయ్యేలా చూస్తారు. దీని కోసం జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా రూ.10 లక్షలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. బాధితురాలికి ఆశ్రయం అవసరమైన పక్షంలో సెల్ నిర్వాహకులే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని షెల్టర్ హోమ్ లేదా స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తారు. రెవెన్యూ, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ సహా అన్ని విభాగాలు భాగస్వాములుగా ఉండే ఈ సెల్ నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించనుంది. విట్నెస్కూ ప్రొటెక్షన్: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సెల్ ఏర్పాటును స్వాగతిస్తూనే మరో కీలక సలహా ఇచ్చారు. ‘బాధితులు, సాక్షులపై ఒత్తిడి నేపథ్యంలోనే అనేక లైంగిక దాడి కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. అందువల్ల ఈ సెల్లో సాక్షులకు భద్రత కల్పించడానికి ఏర్పాట్లు ఉండాలి. విట్నెస్ ప్రొటెక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ వాయిదాలు, విచారణకు వారితో పాటు బాధితుల్నీ సురక్షితంగా తరలించాలి’ అని సూచించారు.