- మహిళా బాధితుల కోసం సింగిల్ విండో
- వారి వద్దకే అన్ని విభాగాల అధికారులు
- నెల రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభం
- హైదరాబాద్ కలెక్టర్ ముకేష్ కుమార్ వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: లైంగికదాడి వంటి నేరాల బారిన పడిన మహిళలు ప్రస్తుతం ఫిర్యాదు, వైద్య పరీక్షలు, న్యాయసహాయం, ఆర్థికసాయం, ఆవాసం ఇలా ఒక్కో సేవ కోసం ఒక్కో విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారితో పాటు బంధువులు అనేక కష్టనష్టాల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా అందుబాటులోకి రానున్నదే ‘వన్ స్టాప్ క్రైసెస్ సెల్’. స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల చేసిన ప్రతిపాదనల మేరకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ ప్రకటించారు. రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మహిళల భద్రత అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. అధికారుల వద్దకు బాధితులు కాకుండా బాధితుల వద్దకు అధికారులు వెళ్లేందుకే ఈ ఏర్పాటని వెల్లడించారు.
సెల్ విధి విధానాలివి..
నిలోఫర్ ఆస్పత్రిలోని ఓ గదిని సెల్ ఏర్పాటు కోసం కేటాయించారు.
స్వచ్ఛంద సంస్థ/మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ప్రతినిధులు అన్ని వేళల్లోనూ ఇక్కడ అందుబాటులో ఉంటారు.
లైంగిక దాడికి గురైన బాధితురాలు ఈ సెల్‌ను ఆశ్రయించిన వెంటనే ప్రాథమిక సమాచారం సేకరించి సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇస్తారు.
పోలీసులే స్వయంగా సదరు సెల్‌కు వెళ్లి ఫిర్యాదు స్వీకరణ, ఎఫ్‌ఐఆర్ జారీ వంటివి చేపడతారు.
సెల్ నిర్వాహకుల సాయంతో బాధితురాలికి అక్కడే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయిస్తారు.
దాని ప్రతినిధులే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించి బాధితురాలికి న్యాయసహాయం అందేలా చర్యలు తీసుకుంటారు.
చట్ట ప్రకారం బాధితురాలికి అందించాల్సిన ఆర్థిక సాయాన్నీ రెవెన్యూ విభాగం నుంచి తక్షణం మంజూరు అయ్యేలా చూస్తారు.
దీని కోసం జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా రూ.10 లక్షలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు.
బాధితురాలికి ఆశ్రయం అవసరమైన పక్షంలో సెల్ నిర్వాహకులే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని షెల్టర్ హోమ్ లేదా స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తారు.
రెవెన్యూ, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ సహా అన్ని విభాగాలు భాగస్వాములుగా ఉండే ఈ సెల్ నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించనుంది.
విట్నెస్‌కూ ప్రొటెక్షన్: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సెల్ ఏర్పాటును స్వాగతిస్తూనే మరో కీలక సలహా ఇచ్చారు. ‘బాధితులు, సాక్షులపై ఒత్తిడి నేపథ్యంలోనే అనేక లైంగిక దాడి కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. అందువల్ల ఈ సెల్‌లో సాక్షులకు భద్రత కల్పించడానికి ఏర్పాట్లు ఉండాలి. విట్నెస్ ప్రొటెక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ వాయిదాలు, విచారణకు వారితో పాటు బాధితుల్నీ సురక్షితంగా తరలించాలి’ అని సూచించారు.