పోలీసుల్లో కేసుల భయం
♦ ఎర్రకూలీల కాల్చివేతపై స్పందించిన న్యాయస్థానం
♦ కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించిన నేపథ్యం
♦ ఉన్నతాధికారుల్లో మొదలైన అంతర్మథనం
♦ చర్యలు ఎవరెవరిపై ఎలా ఉంటాయోననే ఆందోళన
సాక్షి,చిత్తూరు : పోలీసుల్లో టెన్షన్ ఏర్పడుతోంది. 20 మంది ఎర్రకూలీల కాల్చివేత ఘటనలో పాల్గొన్న పోలీసులపై కేసులు ఎందుకు పెట్టలేదంటూ సాక్షాత్తు హై కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల్లో అంతర్మథనం మొదలైంది. మరో వైపు ఇది కౌంటర్ కాదని, ఎన్కౌంటరేనని నొక్కి వక్కాణిస్తున్న రాష్ట్ర డీజీపీ తోపాటు ప్రభుత్వానికి సైతం ఈ వ్యవహారం తలకు చుట్టుకోనుంది. ఇప్పటికే ఈ వివాదం జాతీయ స్థాయికి చేరింది.
ఎర్రకూలీల కాల్చివేతలో పాల్గొన్న పోలీసులపై విచారణ సంగతి ఎలా ఉన్నా, హైకోర్టు ప్రశ్నించడంతో కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. మరో వైపు జాతీయ మానవహక్కుల సంఘం జోక్యం చేసుకుంటే పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుంది. ఏకపక్షంగా కాల్చివేశారనే విషయం విచారణలో వెలుగుచూస్తే పోలీసులపై కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే చాలామంది అధికారులు ఉద్యోగాలు పొగొట్టుకున్న సందర్భాలూ కోకొల్లలు. అదే జరిగితే వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది కాల్చివేత ఘటనలో పాల్గొంటారు.
ఇప్పడు వారిపైనే చర్యలంటే సిబ్బంది ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కౌంటరే అని తేలిన పక్షంలో ఉన్నతాధికారులపై సైతం చర్యలు తప్పకపోవచ్చు. దీంతో ఉన్నతాధికారులు మరింత ఆందోళనలో పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన టాస్క్ఫోర్స్ సిబ్బంది పైనే కేసులు పెడతారా ... లేక పాల్గొన్న మొత్తం సిబ్బందిపై కేసులు పెడతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సాక్షాత్తు టాస్క్ఫోర్స్ అధికారులే కాల్చివేతలో పాల్గొన్న అధికారులతో పాటు సిబ్బంది జాబితాను ప్రభుత్వానికి స్వయంగా అప్పగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధికారులు జీర్ణించుకోలేకున్నారు.
ఈ కాల్చివేత ఘటనలో టాస్క్ఫోర్స్కు చెందిన మూడు కూంబింగ్ దళాలతో పాటు సివిల్ పోలీసులు, అటవీ సిబ్బంది దాదాపు 200 మందికిపైనే పాల్గొన్నట్లు సమాచారం. మరో ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులు ఈ ఘటనకు నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశిస్తే వీరందరిపైనా కేసులు పెట్టాల్సి వస్తుందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. అదే జరిగితే ఈ వ్యవహారం అధికారులతో పాటు ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. నగరితోపాటు జిల్లా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో ఎర్రకూలీలను కాల్చివేతకు రెండు రోజులముందే పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని పోలీసుల నుంచి తప్పించుకున్న కూలీలు,వారి బంధుగణం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూలీలను అడవిలోకి తీసుకెళ్లి చేతులను తాళ్లతో కట్టి మరీ పాయింట్ బ్లాంక్ నుంచి కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పౌరహక్కుల సంఘాలతో పాటు ప్రతిపక్షాలు సైతం ఈ ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి వివాదంగా మారబోతోంది. తమిళనాడుకు చెందిన వివిధ రాజకీయ పక్షాలు ఈ ఘటనను ఢిల్లీ గడ్డపై నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రకటన చేయాలంటూ ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఇంకో వైపు తమిళనాడులో రోజురోజుకూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తెలుగుసంస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటన ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడంలేదు. జాతీయ మానవహక్కుల సంఘం స్పందించాలని పౌరహక్కుల సంఘాలతోపాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ కూలీల కాల్చివేత ఘటన మరింత వివాదంగా మారనుంది.