శేషాచలంలో అలజడి
టాస్క్‌ఫోర్స్ కూంబింగ్‌లో ఎదురుపడ్డ ఎర్ర’దొంగలు
దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పరారీ
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో అలజడి రేగింది. ఏప్రిల్‌లో 20 మంది ఎర్రకూలీల ఎన్కౌంటర్ జరిగిన చీకటి గల కోన ప్రాంతంలో బుధవారం రాత్రి రంగంపేట అటవీశాఖ అధికారులు, కల్యాణిడ్యాం టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చీకటి గల కోన సమీపంలో ఎర్రచందనం దుంగలతో సుమారు 40 మంది కూలీలు ఎదురయ్యారు. వారిని నిలువరించేందుకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారు. ఎదురు తిరిగిన కూలీలపై పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో దుంగలను వదిలి వేసి కూలీలు అడవిలోకి పారిపోయారు.
దాదాపు రూ.90 లక్షల విలువైన 1500 కేజీల 35 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీలను వెదికే ప్రయత్నంలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఒకరు తప్పిపోయారు. అతని ఆచూకీ రాత్రి వరకు దొరకలేదని అటవీశాఖాధికారులు తెలిపారు. శేషాచలం కొండల్లో దాగిన స్మగ్లర్లను ఒక్కరినీ వదలమని, అందని పట్టుకుంటామని టాస్క్‌ఫోర్స్ డీ ఐజీ కాంతరావు తెలిపారు.