అయ్యప్ప భక్తులకు కన్నీటి వీడ్కోలు
=దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమైన రెడ్డిప్రసాద్ తల్లి
=సొమ్మసిల్లిన చండ్రాయుడు భార్య
=సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: తమిళనాడులోని పళణి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అయ్య ప్ప భక్తులకు బసినికొండ, రామాచార్లపల్లెలో కుటుంబ సభ్యులు, బంధువు లు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో చండ్రాయుడు, రెడ్డిప్రసాద్ మృతదేహాలు గ్రామానికి వచ్చాయి. పెద్దరెడ్డెప్ప మృతదేహం రావాల్సి ఉంది. చండ్రానాయుడు, రెడ్డిప్రసాద్ మృతదేహా లకు గురువారం సాంప్రదాయ బద్ధం గా అంత్యక్రియలు నిర్వహించారు.
ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ సహాయం చేసే మంచి వ్యక్తి చండ్రాయుడని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత రాత్రిలో పిలిచినా పలికే చండ్రాయుడు ఇక లేడన్న వార్త రామాచర్లపల్లె ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భవనకార్మికుడిగా ఉంటూ ఎంతోమందికి ఉపాధి చూపిన ఆయన మరణవార్త విని కార్మికులు చలించిపోయారు.
చండ్రాయుడు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కిరణ్‌కుమార్, భార్య లక్ష్మీదేవిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. భర్త మృతదేహం వద్దే లక్ష్మిదేవి సొమ్మసిల్లి పడిపోయింది. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తదితరులు చండ్రాయుడు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం ప్రకటిం చారు. ప్రభుత్వం నుంచి సాయం త్వరగా అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.
మాకు దిక్కెవరు నాయనా:
‘అష్టకష్టాలు పడి, అప్పులు చేసి చదివించామే. నీవేమో ఇంత అన్యా యం చేసి మాకు దక్కకుండా పోయా వే ఇక మాకు దిక్కెవరు నాయనా’ అంటూ రెడ్డిప్రసాద్ తల్లి రోదించడం అందరినీ కలచివేసింది. బీటెక్ చదివి చెట్టంత ఎదిగిన కొడుకును దేవుడు ఇంత అర్ధాంతంగా ఎందుకు తీసు కెళ్లిపోయాడంటూ బంధువులు, స్థాని కులు కన్నీటి పర్యంతమయ్యారు. అన్న కోసం చెల్లెలు దీప వెక్కివెక్కి రోదించడం, అమ్మను ఓదార్చలేక పోవడం చూపరులను కంటతడిపెట్టించింది. రెడ్డి ప్రసాద్ అంతిమ సంస్కారాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరై తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రెడ్డిప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలియజేశారు.
నిరీక్షణ
పెద్దరెడ్డెప్ప మృతదేహం గురువారం రాత్రికీ గ్రామానికి చేరుకోలేదు. పోస్టుమార్టం కాకపోవడంతో ఆస్పత్రిలోనే మృతదేహం ఉందని గ్రామస్తులు తెలియజేశారు. రెడ్డెప్ప మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడిన పురుషోత్తం(44) పరిస్థితి విషమంగా ఉండడంతో మరో చేదువార్త వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.