అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల దాడి
చిత్తూరు: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు హద్దులేకుండో పోతోంది. ఏమాత్రం భయంలేకుండా తమ ఇష్టారాజ్యంగా వారు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా దేవరకొండ అటవీ ప్రాంతంలో, వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. భయంతో ఆటవీ సిబ్బంది పరుగులు తీశారు.
దేవరకొండ అటవీప్రాంతం యర్రావారిపాలెం మండలం తుమ్మలచేనుపల్లిలో అటవీ సిబ్బంది(ఎస్టిఎఫ్ దళాలు)పై ఎర్రచందనం కూలీలు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 200 మంది కూలీలు పాల్గొన్నారు. కూలీలపై ఎస్టిఎఫ్ దళాలు కాల్పులు జరిపారు. ఒక కూలీ మృతి చెందాడు. మిగిలిన కూలీలు పారిపోయారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్పి శ్రీనివాసరావు పరిశీలించారు.
వైఎస్ఆర్ జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల వీరంగం చేశారు. రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద దాదాపు వంద మంది కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. దాంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆ తరువాత వారు పారిపోయారు. బాలుపల్లి అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.