Redwood trafficking
-
ఎర్రచందనం రవాణాలో టీడీపీ నేత అరెస్ట్
రూ. 20 లక్షల విలువైన దుంగలు స్వాధీనం చంద్రగిరి: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేత మల్లెల చంద్రను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి సీఐ శివప్రసాద్ శనివారం తెలిపిన వివరాలు.. ముందస్తు సమాచారం మేరకు చంద్రగిరిలోని కేఎంఎం కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో 18 మంది దుంగలను మోసుకొస్తుండగా దాడిచేశారు. చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన టీడీపీ నేత మల్లెల చంద్ర, తిరుపతి మంగళానికి చెందిన పవన్‌కుమార్, తమిళనాడు తిరుత్తణి తాలూకా అలిమేలు మంగాపురానికి చెందిన ఉమాపతిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఎర్ర’ నిర్మాతల కోసం వేట
ఎర్రచందన అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులకు రోజుకో వింత అనుభవం ఎదురవుతోంది. తమిళ సినీపరిశ్రమలోనూ ఎర్రదొంగలున్నట్లు తేలడం అధికారులను ఆశ్చర్యచకితులను చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఈనెల 7వ తేదీన జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే స్థాయిలో వివాదాస్పదమైంది. అసలు నేరస్తులను అట్టిపెట్టి ఆమాయక కూలీలను మట్టుపెట్టారనే అపవాదును ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంది. ఏపీలోని ప్రతిపక్షాలు, తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్‌కౌంటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. దీని నుంచి బైటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎర్రచందన స్మగ్లింగ్‌లో తమిళనాడు పాత్ర కూడా తక్కువేమీ కాదని నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆకస్మిక దాడులను జరుపుతున్నారు. ఈ సమయంలో సాగుతున్న రహస్య విచారణల్లో కోలివుడ్‌కు చెందిన ఇద్దరు సినిమా నిర్మాతల హస్తం ఉన్నట్లు తేలింది. ఖచ్చితమైన ఆధారాల కోసం ఆరాతీస్తున్న పోలీసులు మరోవైపు వారిద్దరి కదలికలపై నిఘాపెట్టినట్లు సమాచారం. సాక్ష్యాలు దొరకగానే ఇద్దరు నిర్మాతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. అలాగే ఉత్తర చెన్నైకి చెందిన రాజకీయనేతల జోక్యం కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. రాజకీయ వత్తిళ్లలకు లోనుకాకుండా వీరిని సైతం అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఎర్ర స్మగ్లింగ్‌లో సినీతారలు, నిర్మాతల భాగస్వాములు కావడంపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో పట్టుబడిన సినీనిర్మాత మస్తాన్‌వలి రెండుసార్లు వివాహం చేసుకున్నాడని, వారిద్దరూ దూరమైపోగా ప్రస్తుతం నటి నీతూ అగర్వాల్‌తో సహజీవనం సాగిస్తున్నాడని తెలిపారు. రీతూ అగర్వాల్‌కు హైదరాబాద్‌లో ఒక ప్లాటు, కారు, మోటార్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని ఆయన చెప్పారు. ఎర్రచందన స్మగ్లర్లకు ఆమె బ్యాంకు ఖాతా ద్వారానే నగదు మార్పిడి చేస్తున్నట్లు తేలడంతో ఖాతాను ఏపీ పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. ఇదిలా ఉండగా, మరో నటి ప్రమేయం కూడా ఉన్నట్లు విచారణలో తెలిసిందని ఆయన అన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ నటి టాలివుడ్లో ప్రముఖతారగా వెలుగొందుతున్నారని, ఈమె బ్యాంకు ఖాతా నుంచి కూడా స్మగ్లర్లకు సొమ్ము చేరుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అలాగే ఇద్దరు తమిళ నిర్మాతల అక్రమాలను మరింతగా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఎర్రచందన సొమ్ముతోనే ఆయా నిర్మాతలు సినిమాలను తీసినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఇంకా ఎంతో మంది ప్రముఖుల పేర్లు బైటపడతాయని అంచనావేసినట్లు ఆయన చెప్పారు. -
50మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని రాజంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించడమే కాకుండా, అడ్డగించిన అటవీశాఖా అధికారులపై కూడా ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పోలీసులతో సంయుక్తంగా విస్తృత తనిఖీలు జరిపారు. ఈ జాయింట్ అపరేషన్‌లో భాగంగా అధికారులు రాజంపేట అటవీ ప్రాంతమంతా జల్లడిపట్టారు. కాగా, నిఘా పెట్టిన పోలీసులు, అధికారులు అడవిలో ప్రవేశిస్తున్న 50మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
వైఎస్ఆర్జిల్లా: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణా చేసేందుకు వీలుగా ఎర్రచందనం డంప్‌లను స్మగ్లర్లు దాచిపెడుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులుకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టడానికి అటవీశాఖ ఎప్పటికప్పుడూ తమ చర్యలను ముమ్మరం చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్జిల్లాలోని చిట్వేల్ సుద్దకాలువ వద్ద స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం డంప్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం డంప్ విలువ దాదాపు 1.10 లక్షల విలువ ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
8 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు: ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం గోలుపల్లి అడువుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న వాహనాన్ని మంగళవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో తరలిస్తున్న 8లక్షల రూపాయల విలువైన 40ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏస్ వాహనాన్నిసీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.