కాళేశ్వరానికి సై
జగిత్యాల, మెదక్ జిల్లాల సంపూర్ణ మద్దతు
మెట్పల్లి/మెదక్ జోన్: కాళేశ్వరం ప్రాజెక్టుకు పార్టీలు, రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును వారు ఆహ్వానిస్తున్నారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో రెండు చోట్లా సంపూర్ణ మద్దతు లభించింది. ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ నంబరు 21 కింద జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 19,979 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
ఈ పనుల పర్యావరణ అనుమతుల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వాగతించారు. మెదక్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ లో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐతో పాటు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొని ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలి పారు. ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్ భారతీ హోళికేరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు.