regency institute of technology
-
హైడ్రోజన్ అనుసంధానంతో నడిచే ఇంజన్
యానాం: హైడ్రోజన్ ఇంధన అనుసంధానంతో నడిచే మోటార్ వెహికల్ ఇంజన్‌ను యానాం లోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్ఐటీ)కి చెందిన విద్యార్థులు తయూరు చేశారు. బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చైతన్య, ఎన్. ఉమామహేశ్వరరావు, ఆర్వీఎస్ కిరణ్, ఎస్.సతీష్ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఏడాదిపాటు శ్రమించి ఈ ఇంజన్‌ను రూపొందించారు. హైడ్రోజన్ సెల్‌ను ఉపయోగించి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి, దానిని మోటార్ వెహికల్ కార్బొరేటర్‌లో ప్రవేశపెట్టి ఇంజన్‌ను నడిపినట్టు విద్యార్థులు తెలిపారు. దీనివల్ల వాతావరణ కాలుష్యాన్ని కలుగచేసే కార్బన్ మోనాకై్సడ్, హైడ్రోకార్బన్లను 40 శాతం మేరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ఇంజన్ సామర్థ్యాన్ని 25 శాతం పెంచగలిగామని తెలిపారు. ఒక పాత మోటార్ వెహికల్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోజన్ సెల్, వాటర్ సీల్, 12 ఓల్ట్స్ గల బ్యాటరీని అమర్చాలని, ఇంజన్‌కు అమర్చిన వాటర్‌సీల్ బాటిల్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో నింపాలన్నారు. ఈ బాటిల్లో నీరు పూర్తయిన తర్వాత తిరిగి నింపాల్సి ఉంటుందన్నారు. ఈ ఇంజన్ ద్వారా లీటరు పెట్రోల్‌కు 12 కిలోమీటర్ల మేర మైలేజ్ పెరుగుతుంద న్నారు. ప్రాజెక్ట్‌కు రూ.5 వేలు ఖర్చు అయినట్టు తెలిపారు. విద్యార్థులు రూపొందించి న మోటారు వెహికల్‌ను కళాశాల ఆవరణలో నడిపి చూపారు. ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన ప్రొఫెసర్ జి.రవికుమార్‌ను, విద్యార్థులను ఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.నారాయణ, డీన్ అన్యం రామకష్ణారావు అభినందించారు. -
‘గాలి’ మోటార్..
రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లతో గాభరా పడాల్సిన పనిలేదిక. గాలితో నడిచే ద్విచక్ర వాహనాన్ని సృష్టించారు యానాంలోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఐటీ) బీటెక్ మెకానికల్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు. తాము తయారు చేసిన ‘వాయురథాన్ని’ గురువారం నడిపి చూపించారు. కేవలం గాలి ఒత్తిడి (కంప్రెస్డ్ ఎయిర్ ఇంజిన్)తో నడవడం, ఇంజిన్ ఉష్ణోగ్రత 30 సెల్సియస్ డిగ్రీలకు మించకపోవడం, అత్యధిక మెకానికల్ వాల్యూ మెట్రిక్ సామర్థ్యం ఈ వాహనం ప్రత్యేకత అని ‘టీమ్-4 బాయ్స్’ సానిపేని వీరవెంకట వినోద్, ధరణికోట రాజేష్, తోట జైతేజ, బోడపాటి వెంకటేష్ విలేకరులకు చెప్పారు. ఈ వాహనం ఇంజిన్ నుంచి వెలువడే వాయవులు కాలుష్య రహితమైనవన్నారు. అంతేకాక.. ఇంజిన్ నుంచి వెలువడే వాయువు ఉష్ణోగ్రత 16 సెల్సియస్ డిగ్రీలు మాత్రమే ఉండడం వలన.. ఇదే ఇంజిన్‌ను కార్లకు అమర్చినప్పుడు ఏసీ మెషీన్లా కూడా ఉపయోగించవచ్చన్నారు. గాలిని నిల్వచేసే ట్యాంక్ పరిమాణం ప్రస్తుతానికి కొంచెం పెద్దగా ఉన్నా.. దాన్ని మామూలు బైక్‌ల ఫ్యూయల్ ట్యాంక్‌ల సైజులో రూపొందించాలన్న తమ యత్నం త్వరలోనే ఫలించగలదన్నారు. ఆర్ఐటీ మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రాజెక్ట్ గైడ్ జి.రవికుమార్ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని, గత ఏడాది అక్టోబర్ నుంచి గ్రౌండ్ వర్కు చేసి, డిసెంబర్లో పని మొదలు పెట్టామని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.25 వేలు ఖర్చయిందన్నారు.