సామాన్యుని నెత్తిన ‘తనఖా’!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాకివ్వనుంది. అనుమతి ప్రకారం నిర్మాణాలు జరిగేలా చూసేందుకంటూ తీసుకొచ్చిన తనఖా విధానం కాస్తా ఇప్పుడు జనం పాలిట గుదిబండలా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 200 చదరపు గజాలు, ఇతర ప్రాంతాల్లో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇళ్లు విధిగా అనుమతించిన ప్రణాళిక (ప్లాన్) ప్రకారమే ఉండాలంటూ తనఖా విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ తనఖా కోసం గృహ నిర్మాణానికి అనుమతిచ్చే స్థానిక సంస్థకు సదరు యజమానులు రూ.100 స్టాంప్ పేపర్‌పై రాసిస్తే ఇప్పటిదాకా సరి పోయేది. దీని ఆధారంగా తనఖా పెట్టిన విస్తీర్ణాన్ని విక్రయించడానికి వీల్లేకుండా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ప్రొహిబిటరీ రిజిస్టర్ (విక్రయాల నిషేధ పుస్తకం)లో నమోదు చేసేవారు. కానీ ఇలా నమోదు చేయడం వల్ల తనకొచ్చే ఆదాయమేమీ లేదని భావించిందో ఏమో, ఇకపై ఇలా విక్రయాల నిషేధ పుస్తకంలో నమోదు చేయాలంటే ఫీజు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇందుకోసం 3 శాతం ఫీజు చెల్లించాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పట్టుబడుతున్నారు.
ఇళ్లు కట్టుకునే వారికి ఇదో అదనపు భారంగా మారింది. తనఖా విస్తీర్ణం విలువపై 3 శాతమంటే వేలల్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. పైగా తనఖాను విడిపించుకునే సమయంలోనూ మళ్లీ ఫీజు చెల్లించాలన్న అధికారుల వైఖరితో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. నిబంధనలను చూపుతూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ విధానాన్ని పలుచోట్ల వసూలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల రూ.100 బాండ్ పేపర్ రాసిచ్చినా ఆమోదిస్తున్నారు. ఇకపై అంతటా కొత్త విధానాన్నే అమలు చేయాలని పురపాలక శాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు. స్టాంప్ పేపర్‌పై రాయడం కంటే ఇందుకోసం రూ.5,000 ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి, ఫైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదానికి పంపారు. రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే ఈ ఫీజును తనఖా విడుదల సమయంలో తిరిగి చెల్లించడం కూడా ఉండబోదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పైగా తనఖా విధానాన్ని 100 చదనపు గజాలకు కుదించాలని కూడా ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అదే జరిగితే ఖజానాకు ఆదాయం మరింత పెరుగుతుంది.