religious discrimination
-
మత వివక్ష ఆరోపణలను భారత్ తిప్పికొట్టాలి
భారతీయ సమాజం, రాజకీయ వ్యవస్థలోని కొన్ని విభాగాలు ఇస్లామోఫోబియా సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని, ప్రత్యేకించి కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ –19) వ్యాప్తి తర్వాత, ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాలలో ఆందోళన నెలకొనివుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ అభియోగాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందరినీ లక్ష్యంగా చేసుకున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఐక్యత, సోదరభావం ఉండాల్సిన అవసరాన్ని ఏప్రిల్ 19న చేసిన తన ట్వీట్లో మోదీ నొక్కి చెప్పారు. తబ్లిగీ జమాత్ చర్యలకు ముస్లింలందరినీ బాధ్యులుగా చేయడం తప్పని ఆయన అన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీనియర్ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఒకరు కూడా వ్యక్తం చేశారు. గతంలోలాగే ఈ సంవత్సరం కూడా మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం దయ, సామరస్యం, కరుణలను సమృద్ధిగా తేవాలని ఆయన ట్వీట్ చేశారు. సమానత్వం, సోదరభావం, దాతృత్వ విలువల గురించిన ప్రవక్త సందేశాన్ని రెండు సంవత్సరాల క్రితం మోదీ గుర్తు చేసుకున్నారు. 2016లో ప్రపంచ సూఫీ ఫోరమ్‌లో ప్రసంగించిన మోదీ, ‘‘ఒక గొప్ప మతం యొక్క దృఢమైన పునాదులపై నిలిచివున్న ఇస్లామిక్ నాగరికత యొక్క గొప్ప వైవిధ్యాన్ని’’ గురించి మాట్లాడారు. అదే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సూఫీ మత స్ఫూర్తి, తమ దేశంపై వారికున్న ప్రేమ, గౌరవాలే భారతదేశ ముస్లింలను నిర్వచిస్తా’యని అన్నారు. ‘అవి మన దేశపు చిరకాల సంస్కృతియైన శాంతి, వైవిధ్యం, సమానత్వాలను ప్రతిబింబిస్తాయి...’ కదిలించే ఈ మాటలు ఇస్లామోఫోబియానో, ముస్లిం వ్యతిరేక పక్షపాతాన్నో ఎత్తి చూపవు. అయితే మరెందుకు ఉమ్మా యొక్క ఇస్లామిక్ విభాగాలు భారతదేశ ధోరణుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి? గత విధానాలను ఆధారంగా చేసుకొని, పరస్పర విరోధులుగా ఉన్న పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసిన మోదీ మొదటి పదవీకాలంలో ఇది కనిపించలేదు. అందువల్ల, భారత ముస్లింలపై ప్రభావం చూపుతున్న లేదా ప్రభావితం చేసే ఈ రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ విధానాలను, చర్యలను; ఈ అంశాలను పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకోవాలని చూస్తూవుందో కూడా పరిశీలించాల్సి వుంది. నాలుగు పరిణామాలు విశిష్టంగా కనిపిస్తున్నాయి: జమ్మూ కశ్మీర్లో రాజ్యాంగపరమైన మార్పులు, పౌరసత్వం (సవరణ) చట్టం లేదా సీఏఏ, దీన్ని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్íసీ)కు ముందస్తు చర్యగా ముస్లింలు భయపడటం, ఢిల్లీ అల్లర్లు, తబ్లిగీ జమాత్ సమావేశాలకు ప్రతి స్పందనలు.జమ్మూ కశ్మీర్లో జరిగిన రాజ్యాంగపరమైన మార్పులు భారతదేశ రాజకీయ, దేశ అధికార పరిధిలోని విషయాలుగా అరబ్ దేశాలలో చూడబడ్డాయి. భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్ లోయలోని జనాభా స్థితిగతుల నిర్మాణాన్ని మార్చాలని, మానవ హక్కులను పట్టించుకోవటం లేదని చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందన లేదు. మోదీ ప్రభుత్వానికీ, దాని సైద్ధాంతిక హిందుత్వ మూలాలకూ వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తోన్న తీవ్ర విమర్శ కూడా విస్మరించబడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్లలోని మత రాజకీయాల పరిపాలనను పరిగణనలోకి తీసుకుంటే, సీఏఏ నుండి ముస్లింలను మినహాయించడం సహజంగానే వివక్షాపూరి తంగానూ, కొన్నిసార్లు హింసాయుతంగానూ అనిపిస్తుంది. భారతీయ ముస్లింలపై సీఏఏ ఎటువంటి ప్రభావం చూపలేదని మోదీ ప్రభుత్వం సరిగ్గానే నొక్కి చెప్పింది. ఏదేమైనా, ఇది ఎన్ఆర్సీకి ముందస్తు చర్య అనీ, ఇది తమలో చాలామందిని విస్థాపనకు గురిచేస్తుందనీ భావించిన అనేకమంది ముస్లింలు భయపడ్డారు. తదనంతరం కొనసాగిన సుదీర్ఘ ఆందోళనలు గల్ఫ్ దేశాలతో సహా ముస్లిం ప్రపంచంలో గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, జాతీయతను మంజూరుచేయడంలో మతం ఒక కారకంగా మారడం కారణంగా అంతర్జాతీయ ఉదారవాద అభిప్రాయం మరింత దూరమైనప్పటికీ గల్ఫ్ దేశాలు శత్రువులుగా మారలేదు. అయితే, మలేసియా, టర్కీలు మాత్రం మారాయి. ఢిల్లీ అల్లర్లు, కొన్ని సందర్భాల్లో కోవిడ్ –19 వ్యాప్తికి దోహదపడిన తబ్లిగీ జమాత్ చర్యలకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రతిచర్యలు గల్ఫ్ దేశాలలోని కొన్ని వర్గాల అభిప్రాయాలను మార్చివేశాయి. తబ్లిగీ జమాత్ ప్రవర్తన నేపథ్యంలో ముస్లింలను పూర్తిగా సాధారణీకరిస్తూ వారికి వ్యతిరేకంగా నిందార్హమైన వ్యాఖ్యలు వచ్చాయి. ముస్లింలను దేశ బహిష్కారం చేయాలనే బాధ్యతారహిత డిమాండ్లు, కొన్ని గల్ఫ్ దేశాల్లో ఆందోళన, ఆగ్రహాలకు కారణమయ్యాయి. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కొంతమంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోశాయి. ఇది సరిగ్గా పాకిస్తాన్‌కు కొన్ని నకిలీ సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా భారత్ వ్యతిరేక జ్వాలను ఎగదోసేలా మంచి అవకాశం ఇచ్చినట్లయింది. అలాగే మోదీ ప్రభుత్వం పట్ల తనకున్న నేరారోపణ చిట్టాలను తవ్వేందుకు పనికొచ్చింది. ఇప్పుడు దాని స్పష్టమైన ప్రయత్నం ఏమంటే– ఇస్లామోఫోబియాను అధికారికంగా ప్రోత్సహించిందని ఇండియాకు వ్యతిరేకంగా అత్యున్నత స్థాయిలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) చేత ఆక్షేపణ జారీ చేయించడం. కొన్ని రోజుల క్రితం ఓఐసీ దేశాలకు ఇచ్చిన నాలుగు పేజీల లేఖలో– ముస్లింల పట్ల ద్వేషం అనే కీలక భూమికపైనే బీజేపీ అధికారంలోకి రావడమూ, అనంతరం బలపడటమూ జరిగిందని పాకిస్తాన్ నొక్కిచెప్పింది. ఈ ఇస్లామోఫోబియా ఆరోపణలను కరాఖండిగా ఎదుర్కోవాలి. మత రాజ్యాలైన ఇస్లామిక్ దేశాలు ప్రాథమికంగా వివక్షాపూరితమైనవి అన్నది నిజం. అవి కూడా వీగర్ ముస్లింల పట్ల చైనా అణచివేత ధోరణిని నిందించడం లేదు. పాఠశాల చర్చా కార్యక్రమాల్లో ఈ అంశాలు మెరుస్తాయేమోగానీ ప్రపంచ దౌత్యంలో ఇవి పని చేయవు. అక్కడ మార్కులు కొట్టేయడం కన్నా, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏమంటే– స్వీయ రక్షణలో పడకుండా, భారత్ తన రాజ్యాంగ స్ఫూర్తి నుంచి ఎంత మాత్రమూ దూరం జరిగిపోవడం లేదనీ, దేశ ఐక్యతను దెబ్బతీసేవారు ఎవరైనా, పార్టీలకు అతీతంగా వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటున్నామనీ ఇస్లామిక్ దేశాలకు నమ్మకం కలిగించాలి. అలాగే ప్రపంచ ఉదారవాదుల అభిప్రాయాల పట్ల తిరస్కార భావం ప్రదర్శించకుండా, వారితో చర్చించడం కూడా ముఖ్యం. వ్యాసకర్త: వివేక్ కట్జూ, మాజీ దౌత్యవేత్త -
మహిళలకు సమ ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ/సూరత్: మన జీవితాల్లోని ప్రతి అంశంలోనూ, అడుగులోనూ మహిళ పాత్ర ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రాథమిక విధి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మనసులో మాట’ (మన్ కీ బాత్)లో ఆయన ఆదివారం ప్రసంగించారు. నవభారతమంటే శక్తిమంతమైన, సాధికారత కలిగిన, అభివృద్ధి కార్యక్రమాల్లో సగం పాత్ర పోషించే మహిళలు ఉండే భారతదేశమని మోదీ నిర్వచించారు. స్త్రీలలో ఉండే అంతర్ శక్తి, ఆత్మ విశ్వాసమే వారిని నేడు తమ కాళ్లపై నిలబడగలిగేలా చేస్తున్నాయన్నారు. ‘ఆమె తను ఎదగడమే కాకుండా దేశాన్ని, సమాజాన్ని కూడా కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. నేడు దేశం మహిళాభివృద్ధి అనే దారిలో కాకుండా, ఆ మహిళలే నాయకత్వం వహిస్తున్న దారిలో పయనిస్తోంది’ అని మోదీ ప్రశసించారు. స్వామి వివేకానందుడు చెప్పిన ‘పరిపూర్ణ స్త్రీత్వమే పరిపూర్ణ స్వాతంత్య్రం’ అన్న సూక్తిని మోదీ గుర్తుచేశారు. స్త్రీ పేరుతో పురుషుడిని గుర్తించే సంప్రదాయంలో మనం భాగమనీ, యశోదా నందన్, కౌసల్యా నందన్, గాంధారి పుత్ర తదితర పేర్లే అందుకు నిదర్శనమన్నారు. ఈ నెల 28న జరుపుకోనున్న జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ప్రశ్నలకు సమాధానాలు వచ్చేంతవరకూ పరిశోధనలు చేస్తూనే ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తేనే భద్రత మార్చి 4న పాటించే జాతీయ భద్రతా దినోత్సవం గురించి కూడా మోదీ మాట్లాడారు. ప్రజలంతా భద్రతను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఎన్నో పెద్దపెద్ద విపత్తులను నివారించడంలో ఇది సాయపడుతుందని ఆయన సూచించారు. ప్రజలు రోడ్లపై సూచిక బోర్డులను చదువుతారేగానీ ఆ నిబంధనలను పాటించరంటూ విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే మానవ తప్పిదాల వల్ల జరిగే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చని మోదీ పేర్కొన్నారు. ఇటీవలే ప్రారంభించిన ‘గోబర్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్) ధన్’ పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. పల్లెలను పరిశుభ్రంగా మార్చడానికే ఈ పథకం తీసుకొచ్చామనీ, పశువుల పేడ, పంట వ్యర్థాలతో పర్యావరణహిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు ఆదాయం సమకూర్చడమే దీని ఉద్దేశమన్నారు. ఈ వారంలోనే జరుపుకోనున్న హోలీ పండుగ అందరి జీవితాల్లోనూ రంగులు నింపాలని మోదీ ఆకాంక్షించారు. కులమతాల్లేని నవ భారతాన్ని నిర్మిద్దాం కుల, మత, అవినీతిరహిత నవభారతాన్ని నిర్మించాలని మోదీ పిలుపునిచ్చారు. డైమండ్ సిటీ సూరత్‌లో ‘రన్ ఫర్ న్యూ ఇండియా’ పేరుతో ఏర్పాటుచేసిన మారథాన్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భారత ప్రాముఖ్యాన్ని గుర్తించటం ప్రారంభించింది. మనలోని లోపాలను పక్కనబెట్టాల్సిన అవసరం ఉంది. కులమనే విషప్రభావం లేని నవభారతాన్ని నిర్మించుకోవాలి. ఈ నవభారతంలో మతవివాదాలు, అవినీతి ఉండకూడదు. ప్రతిపౌరుడికీ సాధికారత కలిగిన నవభారతాన్ని నిర్మిద్దాం’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయులను గౌరవించుకోవాలన్నారు. ప్రజల శక్తిని ప్రశంసిస్తూ.. ‘ఏ దేశాన్నైనా.. నేతలు, ప్రభుత్వాలు నిర్మించలేదు. పౌరుల బలంతోనే దేశం నిర్మితమైంది’ అని తెలిపారు. యోగా దినోత్సవం, అక్టోబర్‌లో సమగ్రతా పరుగు కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని సూరత్ ప్రజలను మోదీ కోరారు. ఈ 48 నెలలను ఆ 48 ఏళ్లతో పోల్చండి ► అన్నేళ్లు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది ► రానున్న అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ గెలుస్తాం ► పుదుచ్చేరి సభలో మోదీ సాక్షి, చెన్నై: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 48 ఏళ్లు ఈ దేశాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక్క కుటుంబమే పాలించిందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. త్వరలోనే తమ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోందనీ, తమ ‘అభివృద్ధి కేంద్రక’ 48 నెలల పాలనను కాంగ్రెస్ 48 ఏళ్ల పాలనతో పోల్చి చూడాలని మోదీ కోరారు. పుదుచ్చేరిలో మోదీ ఆదివారం పర్యటించారు. ఆ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. పేర్లను ప్రస్తావించకుండానే నెహ్రూ–గాంధీ కుంటుంబం గురించి మోదీ మాట్లాడుతూ ‘తొలి ప్రధాని (జవహర్లాల్ నెహ్రూ) 17 ఏళ్లు, ఆయన కూతురు (ఇందిరా గాంధీ) 14 ఏళ్లు, ఆమె కొడుకు (రాజీవ్ గాంధీ) ఐదేళ్లు దేశాన్ని పాలించారు. ఆ తర్వాత మరో పదేళ్లు రిమోట్ పాలన (ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలం గురించి) సాగింది’ అని మోదీ విమర్శించారు. ‘మా 48 నెలల పాలనను వారి 48 ఏళ్ల పాలనతో పోల్చాలని నేను మేధావులను పుదుచ్చేరి నుంచి కోరుతున్నా. వారు ఈ అంశంపై చర్చలు పెట్టొచ్చు’ అని అన్నారు. కాంగ్రెస్ సీఎం నారాయణస్వామి మాత్రమే.. ఈ ఏడాది జూన్ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఒక్క పుదుచ్చేరిలో మాత్రమేనని మోదీ జోస్యం చెప్పారు. కర్ణాటక సహా త్వరలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించారు. ‘జూన్ తర్వాత కాంగ్రెస్‌కు పుదుచ్చేరి మాత్రమే మిగులుతుంది. అప్పుడు వారి సీఎం అంటే నారాయణస్వామి మాత్రమే ఉంటారు. ఆయనకు నా అభినందనలు’ అని మోదీ అన్నారు. అయితే పంజాబ్‌లోనూ అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న విషయాన్ని ఆయన వదిలేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్ ► ‘ఆరోవిల్’ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆరోవిల్: అనాదిగా భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక గమ్యంగా విరాజిల్లుతోందని ప్రధాని మోదీ తెలిపారు. వేర్వేరు సంస్కృతులు, మతాలు పరస్పరం కలసిమెలసి శాంతియుతంగా జీవించేందుకు భారత్ అనుమతించిందన్నారు. ప్రపంచంలోనే గొప్ప మతాల్లో చాలావరకూ భారత్‌లోనే పుట్టాయన్న మోదీ.. ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక మార్గంవైపు మరలేలా ఇవి ప్రేరేపించాయని పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఆరోవిల్ అంతర్జాతీయ టౌన్షిప్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అరబిందో అశ్రమంలో మదర్‌గా పేరుగాంచిన మిర్రా అల్ఫాసా ఆలోచన మేరకే అరోవిల్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. ‘ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించే విషయంలో అరబిందో ఆశ్రమం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇందుకు ఆరోవిల్ ప్రత్యక్ష సాక్ష్యం’ అని చెప్పారు. గత ఐదు దశాబ్దాలుగా ఆరోవిల్ సామాజిక, విద్యా, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ విశ్వసించే వసుధైక కుటుంబం నినాదానికి ఆరోవిల్ ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. 1968లో 124 దేశాల ప్రతినిధులు హాజరుతో ప్రారంభమైన ఆరోవిల్ టౌన్షిప్.. నేడు 49 దేశాలకు చెందిన 2,400 ప్రతినిధులకు కేంద్రంగా మారిందన్నారు. అంతకుముందు పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో అశ్రమాన్ని సందర్శించిన మోదీ.. ఆశ్రమ స్థాపకుడు శ్రీ అరబిందోకు నివాళులర్పించారు. అక్కడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. శ్రీ అరవిందోకు నివాళులర్పిస్తున్న మోదీ -
కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకుందాం
అల్లర్లు అందరికి నష్టదాయకమే ఆదోని: కుల,మత బేధం లేకుండా కలిసిమెలసి వేడుకలను నిర్వహించుకుందామని ముస్లిం మత పెద్ద కతీఫ్సాహెబ్, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్, మరికొంతమంది ఆయా వర్గాల పెద్దలతో కలిసి ఆదివారం రాత్రి కతీఫ్ సాహెబ్ ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సాహెబ్ ఇంటి నుంచి ప్రజలను ఉద్దేశించి ఇరువురు మాట్లాడారు. ఆదోని పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోయినా కొందరు అదేపనిగా పుకార్లు సృష్టిస్తున్నారని..వాటిని నమ్మవద్దని కోరారు. పరస్పర సహకారం లేనిదే సుఖమయ ప్రశాంత జీవనం గడపలేమని పేర్కొన్నారు. బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఇటీవల వినాయక చవితి, దసరా మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా ఎస్పీ ఆకె రవిక్రిష్ణ, డీఎస్పీ శివరామిరెడ్డితో ఎమ్మెల్యే, కతీఫ్ సాహెబ్ ఫోన్లో మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదని, అయితే.. అవసరమైన పోలీస్ బందోబస్తును నియమించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆకె రవి కృష్ణ సమాచారం అందుకుని ఆదోని చేరుకుని పరిస్థితి సమీక్షించారు.