కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకుందాం
అల్లర్లు అందరికి నష్టదాయకమే
ఆదోని: కుల,మత బేధం లేకుండా కలిసిమెలసి వేడుకలను నిర్వహించుకుందామని ముస్లిం మత పెద్ద కతీఫ్‌సాహెబ్, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్, మరికొంతమంది ఆయా వర్గాల పెద్దలతో కలిసి ఆదివారం రాత్రి కతీఫ్ సాహెబ్ ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సాహెబ్ ఇంటి నుంచి ప్రజలను ఉద్దేశించి ఇరువురు మాట్లాడారు. ఆదోని పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోయినా కొందరు అదేపనిగా పుకార్లు సృష్టిస్తున్నారని..వాటిని నమ్మవద్దని కోరారు.
పరస్పర సహకారం లేనిదే సుఖమయ ప్రశాంత జీవనం గడపలేమని పేర్కొన్నారు. బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఇటీవల వినాయక చవితి, దసరా మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా ఎస్పీ ఆకె రవిక్రిష్ణ, డీఎస్పీ శివరామిరెడ్డితో ఎమ్మెల్యే, కతీఫ్ సాహెబ్ ఫోన్‌లో మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదని, అయితే.. అవసరమైన పోలీస్ బందోబస్తును నియమించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆకె రవి కృష్ణ సమాచారం అందుకుని ఆదోని చేరుకుని పరిస్థితి సమీక్షించారు.