'పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎత్తివేయాలి'
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. 15 రోజుల్లో రెండుసార్లు ధరలు పెంచడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విడ్డూరమని పద్మ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని, ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పద్మ డిమాండ్ చేశారు.