Renigunta police
-
భర్త తల నరికి.. కవర్లో పెట్టుకుని..
రేణిగుంట: ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చి.. అతని తలను వేరుచేసి కవర్లో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో కలకలం రేపింది. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రీభాష్యం రవిచంద్రసూరి (53), అతని భార్య ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వసుంధర (50), కుమారుడు జయదీప్ అలియాస్ సాయి (20) గత కొన్నేళ్లుగా రేణిగుంటలో కాపురముంటున్నారు. రవిచంద్రసూరి తిరుచానూరు ముళ్లపూడి సమీపంలో ఓ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ నడుపుతున్నాడు. రేణిగుంట బుగ్గవీధిలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే వీరు అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో రవిచంద్రసూరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ భార్య వసుంధర కొన్నాళ్లుగా ఘర్షణ పడుతుండేది. పైగా అతను మద్యం తాగి వస్తుండడంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్తకు ఇష్టమైన దోసెలు వేసింది. తింటూ ఉండగానే వంటింట్లో సిద్ధంగా ఉంచుకున్న కత్తితో తలపై మోదింది. వెంటనే తేరుకున్న భర్త ఏం చేస్తున్నావంటూ మాట్లాడుతుండగానే.. గుండెలపై కూర్చొని పీక కోసేసింది. చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తలను వేరు చేసింది. అనంతరం మృతుడి తలను ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని కుమారుడు జయదీప్‌ను వెంటపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులకు తన చేతిలో ఉన్న కవర్‌ను తెరిచి భర్త తలను చూపడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వసుంధరను అదుపులోకి తీసుకుని హత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హంతకురాలు వసుంధరకు, కుమారుడు జయదీప్‌కు మానసిక స్థితి బాగోలేదని చుట్టుపక్కలవారు తెలిపారని రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపారు. -
పెద్దఎత్తున బంగారం పట్టివేత
సాక్షి, చిత్తూరు : రేణిగుంట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మీదుగా రాజంపేటకు బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. అటుగా వస్తున్న టాటా సుమోను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కువైట్‌లో పనిచేస్తూ సొంత ఊరికి వెళ్తామని చెప్పి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం స్మగ్లింగ్ చేశారన్నారు. వాహనంతో పాటు ఆరుగురిని రేణికుంట అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
పోలీసుల అదుపులో పోలీసులు..
తిరుపతి: పోలీసుల అదుపులో పోలీసులు. ఇదేదో సినిమా కథ కాదు...రియల్ స్టోరీనే. ఎర్రచందనం స్మగ్లర్ నుంచి అదనపు డబ్బు డిమాండ్ చేసిన ఖాకీలు.. చివరకూ పోలీసులకు చిక్కిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎర్రచందనం స్మగ్లర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో చిత్తూరు జిల్లా వడమాలపేట ఎస్ఐ, ఐడీ హెడ్‌కానిస్టేబుళ్లని రేణిగుంట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ... ఎర్రచందనం స్మగ్లర్ శివని ఇటీవల వడమాల ఎస్ఐ రాజశేఖరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. శివ ద్వారా ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలను సేకరించారు. సదరు స్మగ్లర్లను శివ ద్వారా బెదిరించి సుమారు రూ. 20 లక్షల వరకు నగదును ఎస్ఐ రాజశేఖరెడ్డి హెడ్ కానిస్టేబుల్ కుమార్, కానిస్టేబుల్ చినబాబు రాబట్టినట్లు తెలిసింది. ఆ క్రమంలో శివను వీరు మరింత వేధింపులకు గురి చేసి... మరో రూ.4 లక్షలు రాబట్టాలని ఆదేశించారు. ఆ క్రమంలో శివను వీరు భౌతికంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ వేధింపులు తాళలేక శివ గురువారం మధ్యాహ్నం రేణిగుంట రూరల్ సీఐను ఆశ్రయించాడు. దాంతో సీఐ ఆదేశాల మేరకు వడమాల పోలీసులపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వడమాల పోలీస్ స్టేషన్లో రేణిగుంట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రాజశేఖరరెడ్డి టేబుల్ డ్రాయిర్లోనే దాదాపు రూ. 5 లక్షల నగదు దొరికినట్లు తెలిసింది. స్మగ్లర్ శివ ఫిర్యాదు అనంతరం రేణిగుంట పోలీసులు తనిఖీలలో వడమాల పోలీసులు వద్ద దాదాపు రూ. 11 లక్షల నగదు లభ్యమైనట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వీరిని ...పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విషయాలను మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. -
పోలీసుల అదుపులో పోలీసులు..
-
బంగ్లా దేశీయులకు రిమాండ్
మంగళవారం రేణిగుంట పోలీసులు అరెస్టు చేసిన బంగ్లా దేశీయులకు సెప్టెంబర్ 9వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిలో ఏడుగురు చంటి పిల్లలను వారి తల్లులతో పాటు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. . తిరుపతి లీగల్ : వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి ప్రవేశించి రైలులో బెంగళూరుకు వెళుతున్న బంగ్లా దేశీయులకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి 5 వ అదనపు జూనియర్ జడ్జి నాగవెంకటలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్‌కు తరలించిన వారిలో 9 మంది పురుషులు, 9 మంది స్త్రీలు ఉన్నారు. ఏడుగురు చంటి పిల్లలను వారి తల్లులతో పాటు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి రేణిగుంట పోలీసులు 2 వాహనాల్లో 33 మంది బంగ్లా దేశీయులను తిరుపతికి తీసుకు వచ్చారు. కోర్టు వద్ద రెండు వాహనాలు ఉంచారు. పిల్లలను ఒక వాహనంలో, వారి తల్లిదండ్రులను మరో వాహనంలో ఉంచారు. దీంతో ఆ తల్లులు పిల్లలను తమ వద్దనే ఉంచాలని రోదించారు. పోలీసులు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులున్న వాహనంలోకి తరలించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామచంద్రారెడ్డి, ఇతర పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి 8.30 గంటలు దాటడంతో పోలీసులు వారిని న్యాయమూర్తి ఇంటి వద్దకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి బంగ్లాదేశీయులకు సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రిమాండ్‌కు ఆదేశించారు.