
ప్రతీకాత్మక చిత్రం
రేణిగుంట: ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చి.. అతని తలను వేరుచేసి కవర్‌లో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో కలకలం రేపింది. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రీభాష్యం రవిచంద్రసూరి (53), అతని భార్య ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వసుంధర (50), కుమారుడు జయదీప్ అలియాస్ సాయి (20) గత కొన్నేళ్లుగా రేణిగుంటలో కాపురముంటున్నారు. రవిచంద్రసూరి తిరుచానూరు ముళ్లపూడి సమీపంలో ఓ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ నడుపుతున్నాడు.
రేణిగుంట బుగ్గవీధిలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే వీరు అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో రవిచంద్రసూరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ భార్య వసుంధర కొన్నాళ్లుగా ఘర్షణ పడుతుండేది. పైగా అతను మద్యం తాగి వస్తుండడంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్తకు ఇష్టమైన దోసెలు వేసింది. తింటూ ఉండగానే వంటింట్లో సిద్ధంగా ఉంచుకున్న కత్తితో తలపై మోదింది. వెంటనే తేరుకున్న భర్త ఏం చేస్తున్నావంటూ మాట్లాడుతుండగానే.. గుండెలపై కూర్చొని పీక కోసేసింది. చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తలను వేరు చేసింది.
అనంతరం మృతుడి తలను ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుని కుమారుడు జయదీప్‌ను వెంటపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులకు తన చేతిలో ఉన్న కవర్‌ను తెరిచి భర్త తలను చూపడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వసుంధరను అదుపులోకి తీసుకుని హత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హంతకురాలు వసుంధరకు, కుమారుడు జయదీప్‌కు మానసిక స్థితి బాగోలేదని చుట్టుపక్కలవారు తెలిపారని రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment