బంగ్లా దేశీయులకు రిమాండ్
మంగళవారం రేణిగుంట పోలీసులు అరెస్టు చేసిన బంగ్లా దేశీయులకు సెప్టెంబర్ 9వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిలో ఏడుగురు చంటి పిల్లలను వారి తల్లులతో పాటు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. .
తిరుపతి లీగల్ : వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి ప్రవేశించి రైలులో బెంగళూరుకు వెళుతున్న బంగ్లా దేశీయులకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి 5 వ అదనపు జూనియర్ జడ్జి నాగవెంకటలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్‌కు తరలించిన వారిలో 9 మంది పురుషులు, 9 మంది స్త్రీలు ఉన్నారు. ఏడుగురు చంటి పిల్లలను వారి తల్లులతో పాటు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు.
మంగళవారం రాత్రి రేణిగుంట పోలీసులు 2 వాహనాల్లో 33 మంది బంగ్లా దేశీయులను తిరుపతికి తీసుకు వచ్చారు. కోర్టు వద్ద రెండు వాహనాలు ఉంచారు. పిల్లలను ఒక వాహనంలో, వారి తల్లిదండ్రులను మరో వాహనంలో ఉంచారు. దీంతో ఆ తల్లులు పిల్లలను తమ వద్దనే ఉంచాలని రోదించారు. పోలీసులు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులున్న వాహనంలోకి తరలించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామచంద్రారెడ్డి, ఇతర పోలీసులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి 8.30 గంటలు దాటడంతో పోలీసులు వారిని న్యాయమూర్తి ఇంటి వద్దకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి బంగ్లాదేశీయులకు సెప్టెంబర్ 9వ తేదీ వరకూ రిమాండ్‌కు ఆదేశించారు.