Rental homes
-
Fact Check: ఆ జీఎస్టీ వార్తలు తప్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నివాస అద్దెలపై ఎటువంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ కింద నమోదైతే నివాస గృహాల అద్దెలపైనా కిరాయిదారు 18 శాతం జీఎస్టీ చెల్లించాలంటూ వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. నివాస యూనిట్లను (ఇళ్లు, ఫ్లాట్లు) కార్యాలయం, వ్యాపార వినియోగానికి అద్దెకు ఇచ్చినప్పుడే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘ఒక వ్యక్తి నివాసం కోసం ఇల్లు అద్దెకు తీసుకుంటే దానిపై జీఎస్టీ లేదు. ఒక వ్యాపార సంస్థ యజమాని లేదా భాగస్వామి తన వ్యక్తిగత నివాసానికి అద్దెకు తీసుకున్నా జీఎస్టీ ఉండదు’’అని కేంద్ర సర్కారు ఓ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత జీఎస్టీ రిజిస్టర్డ్ వ్యాపారస్తులకు ఊరటనిస్తుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ అభిషేక్ జైన్ పేర్కొన్నారు. వారు తమ నివాస గృహాల అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 -
'ఆమెకు' అద్దె ఇల్లు కష్టమే!
మన నగరం మహిళలకు సేఫ్ ప్లేస్. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రత విషయంలోహైదరాబాద్ తొలి స్థానంలో నిలవగా... పుణె, బెంగళూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కానీ ఒంటరి మహిళలకు మాత్రం నగరంలో ఇల్లు దొరకడం కష్టంగా మారింది. ‘నెస్ట్అవే’ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో : ఈవ్ టీజింగ్ ఇబ్బందులున్నా, అక్కడక్కడా ఒంటరి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా... ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మహిళలకు అత్యంత సురక్షితమైనదని తేలింది. ఆన్లైన్ రెంటల్ కంపెనీ నెస్ట్అవే చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనితో పాటు ఉద్యోగం చేసే ఒంటరి మహిళలు వారు నివసిస్తున్న నగరాలకు సంబంధించి మరికొన్ని అంశాల్లోనూ ఈ సర్వేఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అభిప్రాయాల సేకరణ కోసం వేర్వేరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాలతో పాటు మన నగరంలోని మాదాపూర్, శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో నివసించే మహిళా ఉద్యోగులను ఎంచుకున్నారు. అద్దె తక్కువున్నా..దొరకడం కష్టమే.. ఇతర నగరాలతో పోలిస్తే అద్దె ఇల్లు కోసం హైదరాబాద్‌లో మహిళలు చాలా కష్టపడాల్సి వస్తోందని సర్వే తెలిపింది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే అద్దెలు నగరంలో కొంత మేర తక్కువే అయినప్పటికీ... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు అందుబాటులో ఉండడం లేదు. ఇక అన్ని రకాలుగా తమకు నప్పే ఇల్లు కోసం అవసరానికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇంటి అద్దె వ్యయమే తమకు ఎక్కువగా ఉన్నట్టు నగర మహిళలు అభిప్రాయపడ్డారు. తమ నెల జీతాల్లో నుంచి సగానికిపైగా ఇంటి అద్దెలకు వెచ్చిస్తున్నామని అంటున్నారు. భద్రతకే ఓటు... ఇంటిని ఎంచుకోవడంలో అందుబాటులో అద్దెలు, వసతులు, రాకపోకలకు సులువుగా ఉండడం తదితర పక్కకునెట్టి, భద్రతకే మహిళలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇల్లు అద్దెకు లభించే ప్రాంతం సురక్షితమైనదిగా భావిస్తే తాము పనిచేసే చోటుకి 5 నుంచి 10 కి.మీ వరకు దూరమైనా సరే తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రాథామ్యాల నేపథ్యంలో పురుషుల నెలవారీ అద్దె సగటు (రూ.6,900) కన్నా మహిళల నెలవారీ సగటు అద్దె (రూ.7,250) ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఏదేమైనా... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు దొరకడం నగరంలో అంత సులభం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాపడ్డారు. రకరకాల కారణాలను చెబుతూ ఇంటి యజమానులు తమకి ఇల్లు నిరాకరిస్తున్నారని ఒంటరి మహిళలు వాపోతున్నారు. -
అద్దె ఇళ్లలో ప్రభుత్వ బడులు
మంచిర్యాల సిటీ : ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లు డి నోట్లో శని’ అన్న చందంగా ఉంది మంచి ర్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. సరిపడా నిధులున్నా సంబంధిత అధికారులు స్థలం కేటాయించకపోవడంతో పట్టణంలోని ఐదు ప్రాథమిక పాఠశాలలను అద్దె ఇళ్లలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలల తోపాటు ఎంఈవో, డెప్యూటీ ఈవో కార్యాల యాలకు సైతం శాశ్వత భవనాలు లేక ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. పాఠశాలలకు ఏటా ఆర్వీఎం నుంచి నిధులు మంజూరవుతున్నా అధికారులు స్థలం కేటాయించకపోవడం తో అవి తిరిగి వెనక్కిమళ్లిపోతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్థలం మంజూరు చేస్తే పక్కా భవనాలు నిర్మించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2006 నుంచి అద్దె గదుల్లోనే చెన్నూర్ రోడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2006లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాల అద్దె గదుల్లోనే కొనసాగుతోంది. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండగా 112 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్థలం లేక.. స్టేషన్ రోడ్డు ప్రాథమిక పాఠశాల 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం తరగతులు నిర్వర్తిస్తున్న అద్దె భవనం రెండోది. ప్రభుత్వం నుంచి సకాలంలో అద్దె మంజూరు కాకపోవడంతో యజమాని ఏడాది కిందట గదులకు తాళం వేశాడు. అయినా స్థలం మంజూరు కాలేదు. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతి వరకు 81 విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 2002 నుంచి మసీదులో.. 2002 నుంచి ఇస్లాంపుర కాలనీలోని ఉర్దూ ప్రా థమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నాడు. 38 మంది విద్యార్థులకు పాటాలు చెబుతున్నాడు. స్థానిక మసీదులో పాఠశాల కొనసాగడం విశేషం. రెండు గదుల్లో.. జాఫర్‌నగర్‌లో 2001లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను రెండు అద్దె గదుల్లో ప్రారంభించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. 33 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయురాలే పాఠాలు చెబుతోంది. వరండాలోనే.. రాళ్లపేట ప్రాథమిక పాఠశాల 2004 ఏర్పడింది. ఒకటి నుంచి ఐదో వరకు ఉండగా 55 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఉపాధ్యాయురాలే ఉంది. అద్దెకు గదులు దొరకకపోవడంతో ప్రస్తుతం ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎంఈవో కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఇప్పటికీ మూడు సార్లు నివేదికలు పంపించాం. డీఈవోతోపాటు, కలెక్టర్, ఆర్వీఎం పీవోకు నివే దికలు పంపుతున్నాం. అద్దె గదుల్లో నిర్వహిస్తున్న పాఠశాలలకు స్థలం మంజూరు కాకపోవడంతో వచ్చిన నిధులు వెనక్కిమళ్లిపోయాయి. - బొమ్మ గణపతిరెడ్డి, మంచిర్యాల ఇన్చార్జి ఎంఈవో -
వావ్!
వాల్ షెల్ఫ్స్తో ఇంటికి సరికొత్త అందం హైదరాబాద్: ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. మన సమాజంలో గృహాలంకరణే ఇల్లాలి ప్రతిభకు ప్రాతిపదిక. సొంతమైనా, అద్దె ఇళ్లయినా అందంగా ఉండాల్సిందే. సాదాసీదాగా ఉండే గోడలకు వివిధ రకాల డిజైన్లను చేర్చి అందాన్నే కాదు సౌకర్యవంతంగానూ మలచుకునే ఉపాయమే వాల్షెల్ఫ్స్. దీంతో పాతకాలపు ఇంటిని ఈ కాలపు అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దుకోవచ్చు. ► వాల్షెల్ఫ్స్ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసి ఉంటాయి. మన అవరాలతో పాటు ఇంటి కొలత లు తెలిస్తే చాలు తగ్గ సైజు, కావాల్సిన రంగును ఎంపిక చేసుకోవచ్చు కూడా. ► గోడకు చిన్న రంధ్రాలు చేసి వాల్షెల్ఫ్స్ను తేలిగ్గా అమర్చుకోవచ్చు. హాల్ నుంచి డ్రాయిండ్ రూమ్, కిచెన్, హాల్, బెడ్రూమ్, బాత్రూమ్ల్లో కూడా వీటిని పెట్టుకోవచ్చు. ► వాల్షెల్ఫ్స్ అమర్చే గదిలో లగ్జరీ పార్సెలిన్ నుంచి నిర్మల్ బొమ్మల దాకా రకరకాల బొమ్మలతో అందంగా అలంకరించుకోవచ్చు. ► ఉడెన్‌తో పాటు వివిధ మెటల్స్‌తో లభ్యమయ్యే వాల్షెల్ఫ్స్ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ► నగరంలో ఇంటీరియర్ స్టోర్స్, హోమ్ నీడ్స్ స్టోర్లతో ఈ షెల్ఫ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ సేవలందించే ఈ సెట్ల ద్వారా కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. -
ఇళ్ల అద్దెలూ ఆకాశానికి
► రాజధాని ప్రచారంతో రెట్టింపైన ఇళ్ల అద్దెలు ► విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో జోరుగా అద్దెల వ్యాపారం ► అద్దె పెంచేందుకు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్న యజమానులు ► ఏదో ఒకసాకుతో ఖాళీ చేయించడం, లేకుంటే అవస్థలు పెట్టడం ► ఇంటి యజమాని,కిరాయిదారుల మధ్య పెరుగుతున్న వివాదాలు విజయవాడ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కొత్త రాజధాని ప్రచారం అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో రెండు నెలలుగా ఇళ్ల అద్దెలు మెట్రో నగరాలతో పోటీ పడుతున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరే ఇప్పుడు రెంటల్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చాయి. విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నుంచి రాష్ర్ట మంత్రుల వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీసు పెడితే చంద్రబాబు బస చేసేందుకు గురునానక్ కాలనీలో ఒక ఇంటిని ఇటీవల పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే క్యాంపు ఆఫీసు పెట్టారు. జిల్లాలోని మరో ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలు క్యాంపు ఆఫీసుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా విజయవాడలో ఇంటి వేటలోపడ్డారు. దీనికి తోడు కొన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విజయవాడ, గుంటూరు నగరాలకు క్యూ కడుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులు విపరీతంగా ఇంటి అద్దెలు పెంచేశారు. రెండు నెలల్లోనే అద్దెల భారం పెరగడంతో మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ సంపాదనలో సగం అద్దె కట్టడానికే సరిపోతోందని ఆవేదన చెందుతున్నారు.విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న విజయవాడ. ఇప్పుడు రాజధానికి చేరువ కాబోతోందన్న ప్రచారంతో సత్యనారాయణపురం, వన్‌టౌన్, గవర్నర్‌పేట ప్రాంతాల్లో అద్దెలు రెట్టింపయ్యాయి. గతంలో పదివేలు పలికిన అపార్ట్మెంట్ ప్లాట్ అద్దె కొన్ని చోట్ల ఏకంగా రూ.20 వేల దాకా పెరిగింది. నగర శివారు కానూరు, పోరంకి, యనమలకుదురు, రామవరప్పాడు, సింగ్ నగర్, భవానీపురంలో గతంలో రూ.3వేలు నుంచి ఐదు వేలున్న ఇంటి అద్దె ఇప్పుడు రూ 8 నుంచి రూ .10 వేలకు చేరింది. 1.విజయవాడలో సుమారు మూడు లక్షల ఇళ్లు ఉండగా నాలుగున్నర లక్షలకుపైగా కుటుంబాలు ఉంటున్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకు త్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.12 నుంచి 25వేలు, డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు రూ.10 నుంచి 15వేలు, సింగిల్ పోర్షన్ రూ.4 నుంచి 8వేల అద్దెలు ఉన్నాయి. 2. గుంటూరులో గత మూడు నెలలతో పోల్చితే ఇప్పుడు 30శాతం వరకు అద్దెలు పెరిగాయి. నగరంలో 1.83లక్షల ఇళ్లు ఉంటే7.60లక్షల జనాభా ఉంది. టూ టౌన్ ప్రాంతంలో రెండు పడక గదుల ప్లాట్ రూ.10వేల నుంచి 15వేలకు అద్దె పలుకుతోంది. గుంటూరు తూర్పు ప్రాంతంలో ఇంటి అద్దె రూ.6వేల నుంచి 8వేల వరకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.8వేల నుంచి 10వేల వరకు ఉంది. 3. రాజధాని ప్రచారంతో మంగళగిరిలో సైతం అద్దె ఇళ్లకు డిమాండ్ రావడంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ ఆసుపత్రి, హాయ్‌ల్యాండ్, కొకొకోలా వంటి వాటితో ఇక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో 18వేల ఇళ్లు ఉండగా సుమారు 30 వేల కుటుంబాలు ఉంటున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ అద్దెలు 25 నుంచి 35శాతం పెరిగాయి. ఇల్లు ఖాళీ చేస్తే అద్దెకు మరో ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో రూ.5వేలు ఉన్న ప్లాట్ ఇప్పుడు రూ.8 నుంచి 9వేలకు పెరిగింది.